ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి వాకిటి శ్రీహరి

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి వాకిటి శ్రీహరి

జడ్చర్ల టౌన్/మిడ్జిల్, వెలుగు :  రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యకార, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్ పల్లిలో రూ. 3 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్‌‌ను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. రైతన్నలకు సన్న వడ్లపై బోనస్ ఇస్తూ అండగా ఉంటున్నామని, జడ్చర్లకు ఐఐఐటీ తీసుకువచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని తెలిపారు.

స్థానిక ముదిరాజుల కోరిక మేరకు కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే స్వయంగా ఐసీయూ పరిసరాలను శుభ్రం చేసి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ తన హయాంలో నియోజకవర్గంలో 22 సబ్ స్టేషన్లను మంజూరు చేయించానని, మిడ్జిల్ మండల అభివృద్ధికి రూ. 213 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. జూన్ నాటికి తన రాజకీయ ప్రస్థానం 20 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్ మండలానికి రానున్నట్లు వెల్లడించారు. మోయినాబాద్ డ్రగ్స్ ఘటనపై స్పందిస్తూ, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.