ఒడిశాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం (మార్చి 16) తెల్లవారుజామున కటక్ లోని SCB మెడికల్ కాలేజీలో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటలకు ట్రామా కేర్ ICU లో మంటలు అంటుకోవడంతో పది మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు.
ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అప్పటికే చాలా వరకు తగలబడి పోయింది. ఫైర్ సిబ్బంది వచ్చే లోపే మంటల్లో చిక్కుకుని పేషెంట్లు, నర్సులు చనిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
విషయం తెలుసుకున్న సీఎం మోహన్ చరణ్ మఝీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారు.
హాస్పిటల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం తీవ్రస్థాయిలో ఉండటంతో పలు వార్డులను ఖాళీ చేయించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెవుతున్నారు.
