- చొరబాటుదారులను కాపాడుతున్నరని మండిపాటు
- ప్రతి చొరబాటుదారున్ని ఏరిపారేస్తామని క్లారిటీ
న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్రాలు చొరబాటుదారులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. అందుకే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను అడ్డుకుంటున్నాయని అన్నారు. శుక్రవారం అమిత్ షా గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్) వజ్రోత్సవ వేడుకల్లో మాట్లాడారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేరెత్తకుండా పరోక్ష విమర్శలు చేశారు. ‘‘చొరబాటుదారులను అడ్డుకోవడం దేశ భద్రతకు ఎంతో కీలకం. అంతేకాదు.. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు అత్యవసరం” అని పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తూ కొందరు సర్‌ను అడ్డుకొని, చొరబాటుదారులను కాపాడేందుకు బయలుదేరారని విమర్శించారు.
కాగా, సర్ ప్రక్రియ తమ రాష్ట్రంలో అరాచకంగా, బలవంతంగా, ప్రమాదకరంగా సాగుతున్నదని మమతా బెనర్జీ ఆరోపించారు. కనీస సన్నద్ధత, తగినంత ప్రణాళిక, స్పష్టమైన సమాచారం లేకుండా రాష్ట్ర పౌరులపై ఎలక్షన్ కమిషన్అధికారులు సర్‌ను రుద్దుతున్నారని సీఈసీకి గురువారం రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్‌షా వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
సర్ అంటే ఓటర్ లిస్ట్ ఫ్యూరిఫికేషన్..
సర్ అంటే ఓటర్ లిస్ట్ ఫ్యూరిఫికేషన్ అని అమిత్‌షా అన్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన వారందరినీ ఏరిపారేస్తామని హెచ్చరించారు. ఇది మోదీ సర్కారు సంకల్పమని తెలిపారు. నేడు దేశంలోని అన్ని సరిహద్దుల వద్ద చొరబాట్లను నిరోధించడంలో బీఎస్‌ఎఫ్ నిమగ్నమై ఉందని వెల్లడించారు. ‘‘దేశంలోని ఏ రాష్ట్రానికి ఎవరు సీఎం కావాలి? లేదా దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి? అనేది భారత పౌరులు మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయం.
చొరబాటుదారులకు మన ప్రజాస్వామ్య వ్యవస్థను కలుషితం చేసే, మన ప్రజాస్వామ్య నిర్ణయాలను ప్రభావితం చేసే హక్కు లేదు” అని పేర్కొన్నారు. సర్ అనేది దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఒక ప్రక్రియ అని, దేశంలోని ప్రతి పౌరుడు దీనిని సమర్థించాలని పిలుపునిచ్చారు. బిహార్ రాష్ట్రం చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఉన్నదని, ఇటీవల అక్కడి ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
చొరబాటుదారులను వెనకేసుకొచ్చే పార్టీలకు ప్రజల మద్దతు ఉండదనే విషయం తెలుసుకోవాలని హెచ్చరించారు. దేశం త్వరలోనే నకల్సిజం నుంచి పూర్తి విముక్తి పొందబోతున్నదని, ఇందులో బీఎస్‌ఎఫ్ పాత్ర చాలా కీలకమని అభినందించారు. బీఎస్‌ఎఫ్ జవాన్ల ధైర్యసాహసాలకు ప్రధాని మోదీతోపాటు యావత్‌దేశం సెల్యూట్ చేస్తున్నదని చెప్పారు.
