దక్షిణాఫ్రికాలో మోదీ .. నవంబర్ 22,23 తేదీల్లో జీ20 సమిట్

దక్షిణాఫ్రికాలో మోదీ .. నవంబర్ 22,23 తేదీల్లో జీ20 సమిట్
  • మూడు సెషన్లలో పాల్గొననున్న ప్రధాని
  • వివిధ దేశాల అధినేతలతో భేటీలు.. ఐబీఎస్ఏ సమిట్ కూ హాజరు  

జోహన్నెస్ బర్గ్: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దక్షిణాఫ్రికా చేరుకున్నారు. జోహన్నెస్​బర్గ్​లో శని, ఆదివారాల్లో (ఈ నెల 22, 23) జరిగే జీ20 దేశాల సమిట్​లో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం జోహన్నెస్​బర్గ్, ప్రిటోరియా నగరాల మధ్య ఉన్న వాటర్ క్లూఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్​లో ల్యాండ్ అయిన మోదీకి సౌత్ ఆఫ్రికా మంత్రి ఖంబుజో చువేనీ రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా అక్కడి కళాకారులు పాటలు, నృత్యాలతో ఆయనకు గ్రాండ్ వెల్కం చెప్పారు. అనంతరం జోహన్నెస్​బర్గ్​లోని ఓ హోటల్ కు మోదీ చేరుకున్నారు. అక్కడ ఇండియన్ కమ్యూనిటీ ప్రజలను కలుసుకున్నారు. ‘‘జీ20 సమిట్​ కోసం జోహన్నెస్​బర్గ్ వచ్చాను. కీలకమైన ప్రపంచ అంశాలపై వివిధ దేశాల అధినేతలతో చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నా” అని మోదీ ట్వీట్ చేశారు. 

జీ20 సమిట్​లో మోదీ 3 సెషన్లలో పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే జీ20 సమిట్ సందర్భంగా 6వ ఐబీఎస్ఏ(ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా) సమిట్​లోనూ ఆయన పాల్గొననున్నారు. కాగా, జీ20 సమిట్​కు 2023లో ఇండియా, 2024లో బ్రెజిల్ అధ్యక్షత వహించగా, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెన్సీ బాధ్యతలు తీసుకుంది.