
హైదరాబాద్, వెలుగు: చేనేత కార్మికుల ప్రయోజనాలు, స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నదని వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం భరోసా అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రభుత్వ శాఖలన్నీ టెస్కో నుంచే వస్త్రాలు కొనుగోలు చేసేలా ఆదేశాలిచ్చామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటిదాకా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి టెస్కోకు రూ.255.27 కోట్ల ఆర్డర్లు వచ్చాయని శనివారం ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కారు చేనేత సహకార సంఘాలను పట్టించుకోకుండా, ఎంఏసీఎస్ సహకార సంఘాలనే ప్రోత్సహించడం వల్ల నిజమైన చేనేత కార్మికులకు లబ్ధి జరగలేదన్నారు. రాష్ట్రంలోని 393 ప్రాథమిక చేనేత సహకార సంఘాల్లో కేవలం 105 సహకార సంఘాలకే పని కల్పించారన్నారు. అందుకే అన్ని సంఘాలకూ పని కల్పించేందుకుగాను చేనేత సహకార సంఘాల నుంచే రూ.53 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేశామన్నారు.
పేమెంట్లనూ వెంటనే చేస్తున్నామని తెలిపారు. సమగ్ర శిక్ష పథకం కింద యూనిఫారాల సరఫరా కోసం 50 శాతం అడ్వాన్సుగా రూ.50 కోట్లు రిలీజ్ చేశామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.8.81 కోట్ల బకాయిలను చేనేత సహకార సంఘాలకు చెల్లించామని, మరో రూ.7 కోట్లు విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను మంజూరు చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు.
అంతేగాకుండా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు, హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణ, కొత్త పవర్లూమ్ క్లస్టర్ల అభివృద్ధి, కొత్త మైక్రో హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు, నేషనల్ సెంటర్ ఫర్ డిజైన్స్ఏర్పాటు, స్టేట్ టెక్స్టైల్ పాలసీ రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కాగా, బతుకమ్మ చీరల పథకం కింద నిరుడు గత ప్రభుత్వం టెస్కోకు చెల్లించాల్సిన రూ.351.52 కోట్ల బకాయిల్లో.. తమ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసిందని మంత్రి తుమ్మల తెలిపారు.