హైదరాబాద్: మునుగోడులో మద్యం షాపుల సమయపాలనలో ఎలాంటి మార్పు ఉండదని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే వైన్ షాపులు తెరుచుకోవాలని.. సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూములకు అనుమతించాలని మద్యం షాప్ నిర్వాహకులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాల కోసం కఠిన నియంత్రణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఆదివారం (జనవరి 18) మునుగోడు ఎమ్మెల్యే కార్యాలయంలో మద్యం వ్యాపారులతో రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారం కోసం ప్రజారోగ్యాన్ని బలి చేయొద్దని వ్యాపారులకు సూచించారు. ఉదయం మద్యం సేవకు పూర్తిగా చెక్ పెట్టడమే లక్ష్యమని అన్నారు.
►ALSO READ | నాది అంత వీక్ క్యారెక్టర్ కాదు.. ఓ పత్రికలో వచ్చిన కథనంపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
నియోజకవర్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పెంచుతామని చెప్పారు. యువత మద్యం నుంచి దూరంగా ఉండేలా.. గ్రామాల్లో ఆరోగ్యకర వాతావరణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ నిర్ణయం పట్ల ఇతర నియోజకవర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. మునుగోడులో మద్యం నియంత్రణపై రాజీ లేదని తేల్చిచెప్పారు.
