నాది అంత వీక్ క్యారెక్టర్ కాదు.. ఓ పత్రికలో వచ్చిన కథనంపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

నాది అంత వీక్ క్యారెక్టర్ కాదు.. ఓ పత్రికలో వచ్చిన కథనంపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

హైదరాబాద్: సింగరేణి బొగ్గు గని టెండర్ల కేటాయింపులో అక్రమాలు అంటూ ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఆదివారం ( జనవరి 18) జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‎లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బొగ్గు గనుల కోసమే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తప్పుడు వార్త కథనాలు ప్రసారం చేయించారని ఓ ఛానల్ చైర్మన్ కథనం రాశారు. ఆ ఆర్టికల్‎లో నా పేరు పేరు ప్రస్తావించారు. నా పేరును ఎందుకు లాగారో తెలియదు. ఏ ప్రయోజనాల కోసం కట్టు కథలు రాస్తున్నారో తెలుసుకుంటా. కథనం రాసిన వ్యక్తి నేనే తేల్చుకుంటాం. ప్రజలకు నిజానిజాలు తెలియాలి’’ అని అన్నారు. 

కొందరిపై ఇష్టంతోనైనా నాపై తప్పుడు ఆర్టికల్ రాసి ఉండొచ్చు లేదా నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని కాబట్టి ఆయన మీద కోపంతో నా మీద తప్పుడు కథనం రాసుండొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెండర్ల నిబంధనలు రూపొందించింది.. టెండర్లు పిలిచింది సింగరేణి సంస్థ అని.. తాను కాదని స్పష్టం చేశారు. అయినప్పటికీ నా మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి.. నైని కోల్ బ్లాక్ గనుల టెండర్లు కాన్సల్ చేసి మళ్లీ కొత్త టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించానని తెలిపారు.

►ALSO READ | టీటీడీ పేరుతో లక్కీ డ్రా స్కామ్.. రూ. 399కే ఫార్చ్యూనర్ కారు అంటూ భక్తులను మోసం.. ముఠా అరెస్ట్..

 క్లిష్టతరమైన ప్రాంతాల్లో బొగ్గు గనులుంటాయి కాబట్టి ఫీల్డ్ విజిట్ అనేది పెడతారని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇటువంటి నిబంధనలు ఉంటాయని.. వార్తలు రాయడం కాదు ముందు వాస్తవాలు తెలుసుకోవాలని చురకలంటించారు. సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తి అని.. ప్రజల ఆస్తులను కాపాడటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఆస్తులను సంపాదించడం, పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. సమాజంలో ఉన్న వనరులను ప్రజలకు సమానంగా పంచడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 

నేను ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత కాలం ఎలాంటి గద్దలను, దోపిడీ దారులను, క్రిమినల్స్‎ను‎  తెలంగాణ ఆస్తుల మీద పడకుండా చూసుకుంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నీచ, నికృష్టపు, దిగజారిపోయి రాజకీయాల కోసం ఇలాంటి కథనాలు స్ప్రెడ్ చేసే వీక్ క్యారెక్టర్ నాది కాదని హాట్ కామెంట్ చేశారు
మీకు, ఇతర మీడియా సంస్థలకు అంతర్గతంగా ఏం విబేధాలు ఉన్నాయో మాకు తెలియదని.. కానీ మీ మధ్యలోకి 
ప్రజాప్రతినిధులను లాగొద్దని హెచ్చరించారు. వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి ఎవరు వెళ్లొద్దన్నారు.