పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో టీటీడీ (TTD) పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్న ఒక ముఠా పై సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను అడ్డుపెట్టుకుని, సామాన్య ప్రజలను బురిడీ కొట్టిస్తున్న వైనంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్ అనే ఇద్దరు యువకులు టీటీడీ పేరును ఉపయోగించుకుంటూ సోషల్ మీడియాలో ఒక నకిలీ లక్కీ డ్రా ప్రచారాన్ని ప్రారంభించారు. కేవలం 399 రూపాయలకే లక్కీ డ్రా కూపన్ కొంటే ఫార్చ్యూనర్ కార్, లేటెస్ట్ ఐఫోన్ గెలుచుకోవచ్చని ప్రకటన చేసారు. టీటీడీ ఆలయ ఫోటోలు, పేరును ప్రమోషన్ల కోసం వాడుకోవడంతో భక్తులు ఇది నిజమైన డ్రా అని నమ్మి డబ్బులు కట్టి లక్కీ డ్రా కూపన్స్ కొంటున్నారు.
ఈ నకిలీ వ్యవహారంపై స్పందించిన కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకి ఫిర్యాదు చేసారు. పవిత్రమైన టీటీడీ పేరును ఇలాంటి మోసపూరితమైన వ్యాపారాలకు వాడుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. సుమారు లక్షల్లో ఈ ముఠా వసూలు చేసిందని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు.
కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు నిందితులపై కఠిన చర్యలు చేపట్టారు. ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్‌లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఫేక్ లక్కీ డ్రా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో మరింతగా విచారణ జరుపుతున్నారు.
అయితే ఇలాంటి సోషల్ మీడియా ప్రకటనలను చూసి ప్రజలు/భక్తులు మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దేవాలయాల పేర్లతో వచ్చే అనధికారిక లక్కీ డ్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
