పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఉగాది పండుగ ముందే రాబోతుందా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్ లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రకటించి విడుదల తేదీకంటే ఒక వారం ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుందని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై తెగ చర్చనడుస్తోంది.
ఉగాది బరిలో ఉస్తాద్.?
నిజానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీని మార్చి 26, 2026న విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రం వారం ముందే రిలీజ్ చేయాలని ప్తాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే మార్చి 19న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని టాక్స్ వినిపిస్తున్నాయి. కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' (Toxic) చిత్రం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా మార్చి 19 నుండి జూన్ 4వ తేదీకి వాయిదా పడింది.
ఉగాది పర్వదినం (మార్చి 19) నాడు 'టాక్సిక్' తప్పుకోవడంతో ఆ ఖాళీని భర్తీ చేయాలని, లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్‌ను క్యాష్ చేసుకోవాలని 'ఉస్తాద్' టీమ్ భావిస్తోంది. ఇప్పటికే పంపిణీదారులకు (Distributors) కూడా ఈ మేరకు సంకేతాలు అందినట్లు సమాచారం. మరో వైపు 'దురంధర్ 2' మూవీ కూడా వాయిదా వేసే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీనిని సద్వీనియోగం చేసుకునేందుకు ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.
దేవి అవుట్.. తమన్ ఇన్?
మరోవైపు ఈ సినిమా మ్యూజిక్ విషయంలోనూ ఒక షాకింగ్ రూమర్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం.. సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (BGM) కోసం మేకర్స్ ఎస్.ఎస్. తమన్‌ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. గతంలో 'పుష్ప 2' విషయంలోనూ ఇలాగే బిజిఎం కోసం అదనపు సంగీత దర్శకులను తీసుకున్నట్లు, 'ఉస్తాద్' కోసం కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు టాక్. 'OG' సినిమాకు తమన్ ఇస్తున్న మ్యూజిక్ రేంజ్ చూసి, హరీష్ శంకర్ ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 'తెరి' రీమేక్ అయినప్పటికీ, హరీష్ శంకర్ తనదైన స్టైల్‌లో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మార్చి 19న ఉగాది కానుకగా ఉస్తాద్ రాకపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 19న ధురందర్ 2 రిలీజ్ అయినా.. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ మేనియా ముందు ఏ సినిమా అయినా తలవంచాల్సిందేనని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.
