తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా వస్తున్న ఈ-మెయిల్ బెదిరింపులతో భక్తులు, స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా తిరుపతి నగరంలోని మూడు ప్రముఖ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులు పంపడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
కపిలతీర్థం దగ్గర రాజ్ పార్క్ హోటల్, పాయ్ వైస్రాయ్, ఉప్పరపల్లిలోని ఎస్ ఆర్ బీ హోటళ్లను పేల్చేస్తామంటూ గుర్తుతెలియన వ్యక్తులనుంచి బెదిరింపులు వచ్చాయి. నిన్న చిత్తూరు కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చిన కొన్ని గంటల్లోనే తిరుపతిలో హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి.
హోటళ్ల సిబ్బంది సమాచారంతో అలెర్ట్ అయిన పోలీసులు తనీఖీలు చేపట్టారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీంలతో హోటళ్లను తనిఖీ చేశారు. హోటల్ గదులు, పార్కింగ్ ఏరియా, లాబీల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా హోటళ్లను ఖాళీ చేయించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి బాంబు సంబంధించిన వస్తువులు లభించలేదు. ప్రముఖులు విడిది చేసే ఇలాంటి హోటళ్లకు బెందిరింపులు రావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈమెయిల్స్ ఎక్కడినుంచి వచ్చాయి.. ఎవరూ పంపించారు.. బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ టీం ఈ-మెయిల్ ఐడీలను ట్రాక్ చేస్తోంది. బాంబు బెదిరింపులకు నగర ప్రజలు, భక్తులు ఎవరూ ఆందోళన చెందొద్దని భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.
