మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీ ‘ఫంకీ’ (Funky). కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. డైరెక్టర్ అనుదీప్ కేవీ ఈ సినిమాను తెరకెక్కించాడు. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్గా వచ్చిన ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రిలీజైన ఈ రొమాంటిక్ కామెడీ ఆశించిన విజయం అందుకోలేదు. ఈ క్రమంలోనే మూవీ సరిగ్గా నెలరోజులోపే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, స్ట్రీమింగ్ విషయంలో నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అనుదీప్ కె.వి. మార్క్ కామెడీ అంటేనే లాజిక్కులకు అతీతంగా సాగే 'సిల్లీ హ్యూమర్'. 'జాతిరత్నాలు'లో ఆ మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది ఎందుకంటే అందులో ఒక చిన్నపాటి కథా బలం, బలమైన క్యారెక్టరైజేషన్లు ఉన్నాయి. కానీ ‘ఫంకీ’ విషయానికి వస్తే, దర్శకుడు కేవలం వన్-లైనర్స్‌పైనే భారం వేసి కథను గాలికి వదిలేసినట్లు కనిపిస్తుందన్న భావనను సినీ ప్రియులు వ్యక్తం చేశారు.
విశ్వక్ సేన్ తన ఇమేజ్‌ని పక్కన పెట్టి కోమల్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. అయితే, కథలో దమ్ము లేకపోవడంతో ఆయన ప్రతిభ వృధా అయినట్లు అనిపిస్తుందన్న అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేశారు. కనీసం ఓటీటీలో అయినా ఫంకీ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుందన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. చూడాలి మరి ఏమవుతుందో!
కథేంటంటే:
కోమల్ (విశ్వక్ సేన్) ఒక యంగ్ అండ్ అంబిషియస్ సినిమా డైరెక్టర్. మంచి ప్రొడక్షన్స్ అధినేత సుదర్శన్ (నరేష్) దగ్గర ఒక సినిమాను పట్టాలెక్కిస్తాడు. కేవలం 4 కోట్లతో మొదలైన ఈ ప్రాజెక్ట్, కోమల్ పుణ్యమా అని ఏకంగా 40 కోట్లకు చేరుతుంది. బడ్జెట్ తడిసి మోపెడవ్వడంతో టెన్షన్ తట్టుకోలేక నిర్మాత సుదర్శన్ ఆసుపత్రి పాలవుతాడు.
ఈ క్రమంలో ఆయన కూతురు చిత్ర (కయాదు లోహర్) రంగంలోకి దిగుతుంది. తన తండ్రిని కోలుకోలేని స్థితికి తెచ్చిన కోమల్‌ను తీసేసి, వేరే డైరెక్టర్‌తో సినిమా పూర్తి చేయాలనుకుంటుంది. అప్పుడు కోమల్ ఏం చేశాడు? కేవలం కోటి రూపాయలతో మిగిలిన సినిమాను పూర్తి చేస్తానని ఆమెను ఎలా ఒప్పించాడు? ఈ గందరగోళం మధ్య కోమల్, చిత్రల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అసలు ఈ కథలోకి జి.కె. (సంపత్ రాజ్) ఎందుకు వచ్చాడు? అనేదే మిగతా సినిమా..
