ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఎలా పడితే అలా పెంచితే కుదరదు.. త్వరలో కొత్త చట్టం

ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఎలా పడితే అలా పెంచితే కుదరదు.. త్వరలో కొత్త చట్టం

తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ ఫీజుల పెంపుపై కళ్లెం వేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఎలా పడితే అలా పెంచి విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయకుండా కట్టడి చేయనుంది. అందులో భాగంగా కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఫీజులు ఏటేటా పెంచకుండా రెండేళ్లకు ఒకసారి 8 శాతం లోపు పెంచుకునేలా చట్టం తీసుకురానుంది.

ఫీజుల పెంపు కోసం రాష్ట్ర ఫీ రెగ్యులేటరీ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 8 శాతం లిమిట్ కు లోబడి పెంచేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒక స్కూలుకు ఫీజు నిర్ణయించే ముందు ముఖ్యమైన డాక్యుమెంట్లు, స్కూల్ కు వస్తున్న రెవెన్యూ, ఆదాయం, ఖర్చుల వివరాలను పరిశీలించి కమిటీ అనుమతించనుంది. ప్రైవేట్, కార్పోరేట్ స్కూల్స్ ఫీజుల పెంపు నియంత్రణకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. వచ్చే కేబినెట్ మీటింగ్ లో దీనిపై చర్చించనున్నారు. 

రాష్ట్రంలో  ఉన్న11 ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కువ భాగం ఉన్న బడ్జెట్ స్కూల్స్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఏడాదికి 5 శాతం చుకునేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. రెండు సంవత్సరాలకు ఒకసారి ఎనిమిది శాతం ఫీజు పెంపుదల అనేది ఆమోదయోగ్యం కాదని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ చెబుతోంది. పెరుగుతున్న ధరలు, ఖర్చులు, టీచర్లు, సిబ్బంది జీతాల పెంపుదల.. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఏడాదికి ఒకసారి 5 శాతం ఫీజులు పెంచుకునేలా అనుమతివ్వాలని కోరుతున్నాయి. 

తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో, ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలకు ఫీజులను నిర్ణయించే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ తరహాలో, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి 10 నుండి 15 శాతం ఫీజు పెంపును సిఫార్సు చేసింది.

ఫీజు పెంపు కోసం, రాష్ట్ర స్థాయిలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో తెలంగాణ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ ఫీజు రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఈ కమిటీలో సీనియర్ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, పాఠశాల నిర్వహణ సభ్యులుగా ఉండాలని సూచించింది.

కలెక్టర్ నేతృత్వంలో జిల్లా వారీగా ఫీజు నియంత్రణ కమిటీని కూడా కమిషన్ సిఫార్సు చేసింది. కన్జూమర్ ఇండెక్స్ ను పరిగణనలోకి తీసుకుని ఫీజు పెంపు ప్రతిపాదించడమే కాకుండా, కమిషన్ మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని సూచించింది.