ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ కు ఇటలీ క్రికెట్ బోర్డు ఆదివారం (జనవరి 18) తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టుకు వేన్ మాడ్సెన్ నాయకత్వం వహించనున్నాడు. ఇటలీకి ఇదే తొలి టీ20 ప్రపంచ కప్. ఈ స్క్వాడ్ లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ జెజె స్మట్స్ ఇటలీ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్మట్స్ సౌతాఫ్రికా తరపున 6 వన్డేలు, 13 టీ20 మ్యాచ్ లాడాడు. 2021లో చివరిసారిగా సౌతాఫ్రికా జట్టు తరపున ఆడిన స్మట్స్ కు ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో కోల్పోయాడు.
స్మట్స్ కు ఇటలీ వారసత్వం ఉన్న కారణంగా వరల్డ్ కప్ జాతీయ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. క్వాలిఫయర్స్‌లో లో భాగంగా ఆస్ట్రేలియా క్రికెటర్ జో బర్న్స్ ఇటలీ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే గత ఏడాది చివర్లో ఈ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడిని జట్టు నుంచి తప్పించారు. ఇటలీ జట్టులో హ్యారీ మానెంటి, బెంజమిన్ మానెంటి సోదరులతో పాటు ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా అనే సోదరులు కూడా ఉన్నారు. ఇటాలియన్ కోచింగ్ సిబ్బందికి జాన్ డేవిసన్ ప్రధాన కోచ్‌గా నాయకత్వం వహిస్తారు. అసిస్టెంట్ కోచ్‌లు కెవిన్ ఓ'బ్రియన్, డగ్లస్ బ్రౌన్ బాధ్యతలు స్వీకరిస్తారు.
వరల్డ్ కప్ లో ఇటలీ గ్రూప్ సిలో ఉంది. ఇటలీతో పాటు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, నేపాల్, వెస్టిండీస్‌లు ఈ గ్రూప్ లో ఉన్నాయి. ఇటలీ ఫిబ్రవరి 9న కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 12న ముంబైలో నేపాల్‌తో.. ఫిబ్రవరి 16న ఇంగ్లాండ్‌తో.. ఫిబ్రవరి 19న వెస్టిండీస్‌తో ఆడతారు.
2026 టీ20 వరల్డ్ కప్ కు ఇటలీ జట్టు:
వేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్‌ప్రీత్ సింగ్, జెజె స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా.
టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించిన 20 జట్ల లిస్ట్ ఇదే:
భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, యూఎస్‌ఏ, వెస్టిండీస్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, జింబాబ్వే, నమీబియా, ఒమన్, నేపాల్, యూఏఈ
