Ram Charan: ఒత్తిడి నాపై కాదు ప్రేక్షకులపైనే.. "స్టార్ కిడ్" ట్యాగ్ పై మనసు విప్పిన రామ్ చరణ్!

Ram Charan: ఒత్తిడి నాపై కాదు ప్రేక్షకులపైనే.. "స్టార్ కిడ్" ట్యాగ్ పై మనసు విప్పిన రామ్ చరణ్!

తెలుగు సినీ పరిశ్రమలో 'కొణిదెల' కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా వెండితెరకు పరిచయమైన రామ్ చరణ్.. ' ఆర్ఆర్ఆర్ ' ( RRR) మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగి తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. ఇటీవల  ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్, తన వ్యక్తిగత జీవితం, కెరీర్, తనపై ఉండే ఒత్తిడి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

వారసత్వం ఒక వరం.. బాధ్యత!

తన సినీ నేపథ్యాన్ని ఎప్పుడూ భారంగా భావించలేదని రామ్ చరణ్ అన్నారు.. "స్టార్ కిడ్" అనే ట్యాగ్ గురించి ఆయన స్పందిస్తూ.. ఒక గొప్ప సినీ కుటుంబంలో పుట్టడం నాకు దక్కిన అద్భుతమైన వరంగా భావిస్తానని తెలిపారు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడం వల్ల పరిశ్రమ పట్ల అవగాహన, అనుభవం చిన్నతనం నుంచే లభిస్తాయి. నటన నేర్చుకోవడానికి ఇన్సిస్ట్యూట్‌కు వెళ్లే వారికంటే, ఇంట్లోనే ఆ వాతావరణం చూస్తూ పెరిగే మాకు విషయాలు త్వరగా అర్థమవుతాయి చెప్పారు.

అయితే, స్టార్ కిడ్స్ పడే ఇబ్బందుల గురించి చెబుతూ.. ఒత్తిడి నా మీద కంటే ప్రేక్షకులపైనే ఎక్కువగా ఉంటుంది. ఒక లెజెండరీ నటుడి వారసుడిని తెరపై చూడబోతున్నప్పుడు వారు అంచనాలు భారీగానే ఉంటాయి.  అయితే వారి అంచనాలను అందుకోవడం, వారిని మెప్పించడం అనేది కాలంతో పాటు కష్టపడి సాధించాల్సిన విషయం అని  చెప్పారు.

 నేను ఒక సాధారణ వ్యక్తినే..

'నాటు నాటు' పాటకు ఆస్కార్ రావడం, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినా, చరణ్ మాత్రం చాలా ఒదిగి ఉంటారు. దీనిపై స్పందిస్తూ.. నేను నన్ను నేను సీరియస్‌గా తీసుకోను. ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు నా పనిని ఎంతో నిబద్ధతతో చేస్తాను. ఆ తర్వాత మేకప్ తీసేయగానే నేను ఒక సాధారణ వ్యక్తిని. ఆ సినిమా విజయాన్ని కానీ, క్రేజ్‌ను కానీ ఇంటికి తీసుకెళ్లను అని తన సింప్లిసిటీని చాటుకున్నారు. ఈ అలవాటే తనను మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుందని ఆయన వెల్లడించారు.

మొదలైన 'పెద్ది' జాతర!

 ప్రస్తుతం రామ్ చరణ్..  బుచ్చిబాబు  దర్శకత్వంలో తన తదుపరి చిత్రం 'పెద్ది' (Peddi) పై దృష్టి పెట్టారు. ఈ చిత్రం ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ఇందులో చరణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

►ALSO READ | శర్వానంద్ సరసన ఆషికా రంగనాథ్

కేవలం చిరంజీవి వారసుడిగానే కాకుండా, తనదైన కష్టం, క్రమశిక్షణతో 'గ్లోబల్ స్టార్' హోదాను సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రయాణం నేటి యువతకు ఆదర్శం అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 'పెద్ది' చిత్రంతో ఆయన బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను తిరగరాయాలని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.