హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు మామూలు డిమాండ్ లేదుగా.. నెలకు 92 లక్షల అద్దెతో లీజు తీసుకున్న అమెరికన్ కంపెనీ..

 హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు మామూలు డిమాండ్ లేదుగా.. నెలకు 92 లక్షల అద్దెతో లీజు తీసుకున్న అమెరికన్ కంపెనీ..

అమెరికాకు చెందిన ఇన్సూరెన్స్ కంపెనీ  హార్ట్‌ఫోర్డ్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్  హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో 1.59 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని ప్రతినెల రూ.92.28 లక్షల అద్దెతో ఐదు సంవత్సరాలకి  లీజుకు తీసుకుంది. కళ్యాణి ట్రైడెంట్‌లో ఉన్న ఈ  స్థలం 21 అలాగే 22 అంతస్తులలో ఉంది. హార్ట్‌ఫోర్డ్ 21వ అంతస్తులో ఉన్న 76,701 చదరపు అడుగుల స్థలానికి నెలకు  రూ.44.48 లక్షలు, 22వ అంతస్తులో ఉన్న  82,406 చదరపు అడుగుల స్థలానికి నెలకు రూ.47.79 లక్షలు అద్దె చెల్లిస్తుంది.
 
దీని మొత్తం విస్తీర్ణం చూస్తే 1.59 లక్షల చదరపు అడుగులు. అలాగే ప్రతినెల  మొత్తం అద్దె దాదాపు 92.28 లక్షలు అంటే చదరపు అడుగుకు రూ.58. ఈ ఆఫీస్ కోసం కంపెనీ సుమారు  రూ.5.53 కోట్లు అడ్వాన్స్‌ సెక్యూరిటీ డిపాజిట్ గా కట్టింది. ఆఫీస్ స్థలం లీజు ఒప్పందం ప్రకారం ఈ ఆఫీస్‌ను ఐదేళ్లకి లీజుకు తీసుకున్నారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి అద్దె 15% పెంచేలా డీల్  కుదుర్చుకున్నారు.

అలాగే  కంపెనీకి 213 కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించారు. ఒక్కో కారు పార్కింగ్‌కు విడిగా నెలకు రూ.3,500 కట్టాలి. ఈ ఒప్పందం కోసం కంపెనీ 14 లక్షల స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించింది. ఈ ఆఫీస్ రెంటు  21వ అంతస్తుకి  1 మార్చి 2026 నుండి, 22వ అంతస్తుకు  1 సెప్టెంబర్  2026 నుండి మొదలవుతుంది.

హైదరాబాద్‌లో మరికొన్ని పెద్ద ఆఫీస్ డీల్స్ చూస్తే  ఇప్పుడు బెంగళూరును మించి గ్లోబల్ కంపెనీలను హైదరాబాద్‌ ఆకర్షిస్తోంది. అంతకుముందు, ఫేస్‌బుక్ ఇండియా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ఐటీ కారిడార్‌లో దాదాపు 69,702 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని ఐదేళ్లకి దాదాపు 67 లక్షల  ప్రతినెల అద్దెతో లీజుకు తీసుకుంది.

►ALSO READ | మున్సిపల్ ఎన్నికలు: లోక్ సభ సెగ్మెంట్లకు ఇంచార్జీలు..మెదక్ కు మంత్రి వివేక్

రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ CRE మ్యాట్రిక్స్  ప్రకారం, మహాంగా కమర్షియల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్  అండ్ ఫేస్‌బుక్ ఇండియా ఆన్‌లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ది స్కైవ్యూ కాంప్లెక్స్‌లోని స్కైవ్యూ 20 భవనంలో కంపెనీ ఈ స్థలాన్ని తీసుకుంది.

గత ఏడాది డిసెంబర్‌లో వీవర్క్ ఇండియా గ్రేడ్-ఎ టెక్ పార్క్ అయిన స్కైవ్యూ 20లో 1.75 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఐదు ఏళ్ళకి   రూ.1.72 కోట్ల  ప్రతినెల అద్దెతో లీజుకు తీసుకుంది . ఆ తర్వాత కంపెనీ మొత్తం రెండు అంతస్తుల స్థలాన్ని JP మోర్గాన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.4.38 కోట్ల ప్రతినెల అద్దెతో 60 నెలల పాటు సబ్-లీజుకు ఇచ్చింది.

మాదాపూర్‌లోని హైటెక్ సిటీలోని స్కైవ్యూ 20  ఐదవ, ఆరవ అంతస్తులో జెపి మోర్గాన్ 1,501 డెస్క్‌ల కోసం లీజుకు తీసుకుంది. ఇందుకు రూ.25.9 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కట్టింది. ఈ ఆఫీసులో 176 కార్ పార్కింగ్‌లు ఉన్నాయి, సబ్-లీజు చదరపు అడుగుకు రూ.249.

అదే టైంలో జోన్స్ లాంగ్ లాసల్లె ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ఇండియా (JLL)  స్కైటెక్‌లో 1.2 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని ఐదు ఏళ్ళకి  రూ. 64.1 లక్షల ప్రతినెల అద్దెతో లీజుకు తీసుకుంది. గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, పోప్పల్‌గూడలో ఉన్న ప్రెస్టీజ్ స్కైటెక్‌లోని స్కై వన్ భవనంలో  5వ, 6వ అంతస్తులను లీజుకు తీసుకుంది. ఈ ఒప్పందంలో 3.84 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఉంది.