Gautam Gambhir: స్వదేశంలో కూడా ఓడిపోతున్నారు.. గంభీర్ కోచ్‌గా టీమిండియాకు 18 నెలల్లో 9 చెత్త రికార్డులు

Gautam Gambhir: స్వదేశంలో కూడా ఓడిపోతున్నారు.. గంభీర్ కోచ్‌గా టీమిండియాకు 18 నెలల్లో 9 చెత్త రికార్డులు

టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ అడుగుపెట్టినప్పటి దగ్గర నుంచి భారత జట్టు ఖాతాలో ఊహించని చెత్త రికార్డులు వచ్చి చేరుతున్నాయి. టీ20 ఫార్మాట్ మినహాయిస్తే మిగిలిన వన్డే, టెస్టుల్లో భారత జట్టు స్థాయికి తగ్గ ఆట తీరును ప్రదర్శించడంలో విఫలమవుతోంది. స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ జట్టు విజయాలు సాధించడంలో తడబడుతోంది. స్వదేశంలో తిరుగులేని టీమిండియా అనూహ్యంగా మన గడ్డపై విజయాలు కోసం శ్రమిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో వన్డే సిరీస్ ను కోల్పోయిన తర్వాత    గంభీర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఒకరకంగా చెప్పాలంటే కివీస్ బి జట్టుతో ఇండియా ఏ జట్టు ఓడిపోయింది. జట్టు ఓటమికి గంభీర్ ప్రయోగాలే కారణమని కొందరు అంటుంటే.. మరికొందరు ఏమో గంభీర్ వచ్చిన దగ్గర నుంచి డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరం బాగా లేదని చెబుతున్నారు. కారణాలు ఏవైనా గంభీర్ కు బ్యాడ్ లక్ మాత్రం కొనసాగుతోంది. గౌతమ్ గంభీర్ జూలై 2024లో టీమిండియా ప్రధాన కోచ్ అయ్యాడు. ఈ 18 నెలల్లో  2025 లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్.. 2025లో ఆసియా కప్‌లో టైటిల్ విజయాలు తప్పితే గంభీర్ ఖాతాలో చెప్పుదగ్గ విశేషాలు ఏమీ లేవు. అయితే పరాజయాలు చాలానే ఉన్నాయి. కోచ్ పదవి చేపట్టిన తర్వాత భారత జట్టు ఈ 18 నెలల్లో 9 చెత్త రికార్డ్స్ నమోదు చేసింది. 


1) 27 ఏళ్ళ తర్వాత శ్రీలంక సిరీస్ గెలుపు:
 
*గంభీర్ కోచ్ పదవి చేపట్టిన తర్వాత 2024లో శ్రీలంకతో టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ 0-2 తేడాతో సిరీస్ చేజార్చుకుంది. 27 ఏళ్ల తర్వాత భారత్ పై సిరీస్ గెలిచి శ్రీలంక తమ చెత్త రికార్డ్ కు బ్రేక్ వేసుకున్నారు. 

2) స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ ఓటమి:

2024లో న్యూజిలాండ్ పై జరిగిన తొలి టెస్టులో ఇండియా ఓడిపోయింది. స్వదేశంలో 1988 తర్వాత భారత జట్టు స్వదేశంలో కివీస్ పై టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం ఇదే తొలిసారి 

3) 2012 తర్వాత తొలిసారి స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓటమి:

ఇదే సిరీస్ లో రెండో టెస్ట్ ఓడిపోయిన టీమిండియా 2012 తర్వాత తొలిసారి స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. మొదటి టెస్టు ఓడిపోయి రెండేవ టెస్టులో కంబ్యాక్ ఇస్తారనుకుంటే కివీస్ ఊహించని షాక్ ఇస్తూ మేరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.   
 
4) 2000 తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ వైట్ వాష్:

టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ అడుగుపెట్టాక ఇది చేదు జ్ఞాపకమనే చెప్పుకోవాలి. స్వదేశంలో 12 ఏళ్లుగా ప్రత్యర్థిని వణికిస్తూ ఒక్క సిరీస్ ఓడిపోకుండా విజయాలు సాధిస్తూ వచ్చిన టీమిండియాకు న్యూజిలాండ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో గెలిచి భారత జట్టు టెస్ట్ ఛాంపియన్ షిప్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఈ సిరీస్ లో గంభీర్ చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. ఈ సిరీస్ ఓటమితో గంభీర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.      

5) స్వదేశంలో టెస్టుల్లో అత్యల్ప స్కోర్:

బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మొదటి టెస్ట్​లో భారత క్రికెట్ జట్టు తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో అత్యంత చెత్తగా ఆడింది. కేవలం 46 పరుగులకే ఆలౌటైంది.  92 ఏళ్ళ భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్వదేశంలో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.

6) 2015 తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోయారు: 
 
బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను ఇండియాపై ఆస్ట్రేలియా 3-1 తేడాతో గెలుచుకుంది. తొలి టెస్ట్ భారత్ గెలవగా.. ఆ తర్వాత నాలుగు టెస్టుల్లో ఆస్ట్రేలియా మూడు టెస్టుల్లో జయభేరి మోగించింది. బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్ట్ డ్రా గా ముగిసింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు ఆసీస్ అధికారికంగా అర్హత సాధించింది. మరోవైపు ఇండియా ఓడిపోయి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి నిష్క్రమించింది.  ఈ సిరీస్ ఓటమితో గంభీర్ ను హెడ్ కోచ్ నుంచి తప్పించాలనే డిమాండ్ వినిపంచింది.  

►ALSO READ | T20 World Cup 2026: ఆడకపోతే ఔట్.. బంగ్లాదేశ్‌కు ఐసీసీ అల్టిమేటం.. రీప్లేస్ మెంట్‌గా ఏ జట్టు అంటే..?

7) టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద ఓటమి: 

గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికాపై టీమిండియా ఘోరంగా ఓడింది. ఐదో రోజు ముగిసిన ఈ టెస్టులో సఫారీలపై 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 549 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా.. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి పూర్తి చేతులెత్తేశారు. కేవలం 140 పరుగులకే మన జట్టు కుప్పకూలింది. 

8) తొలిసారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుకోవడంలో విఫలం:

తొలి రెండు సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకున్న టీమిండియా గంభీర్ కోచ్ గ అడుగుపెట్టిన తర్వాత ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైంది. 

9) న్యూజిలాండ్ చేతిలో తొలిసారి స్వదేశంలో వన్డే సిరీస్ ఓటమి:    

న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 1-2 తేడాతో కోల్పోయింది. కివీస్ జట్టు ఇండియాకు వచ్చి తొలిసారి వన్డే సిరీస్ గెలుచుకున్నారు. ఆదివారం (జనవరి 18)  ఇండోర్ వేదికగా హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా మ్యాచ్ తో పాటు 1-2 తేడాతో సిరీస్ కూడా ఇండియా చేజార్చుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన న్యూజిలాండ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది.