కంటతడి పెట్టిస్తున్న సైనిక కుటుంబాల వీడ్కోలు

కంటతడి పెట్టిస్తున్న సైనిక కుటుంబాల వీడ్కోలు

న్యూఢిల్లీ: ఒక్క హెలికాప్టర్ ప్రమాదం దేశ సేవలో నిమగ్నమై ఉన్న భరతమాత ముద్దుబిడ్డల్ని దూరం చేసింది. వారు దూరమైన బాధను ప్రతి భారతీయుడు అనుభవిస్తున్నాడు. ఇక వారి కుటుంబాలు పడే ఆవేదన గురించి అక్షరాల్లో చెప్పడం కష్టమే. బ్రిగేడియర్ ఎల్ఎల్ లిద్దర్ భౌతికకాయాన్ని కడసారి చూసినప్పుడు ఆయన భార్య, కూతురు కన్నీళ్లను చూస్తే ఎవరికైనా ఏడుపొచ్చేస్తుంది. ఈ టైమ్ లో వారు మాట్లాడిన మాటలు అందరి హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. 

‘నేను ఓ సైనికుడి భార్యను. ఇది నిజంగా తీర్చలేని లోటు. కానీ మనం వారికి ఓ మంచి ముగింపు ఇవ్వాలి. నవ్వుతూ వారిని సాగనంపాలి’ అని లిద్దర్ భార్య గీతికా లిద్దర్ అన్నారు.

‘మా నాన్న హీరో. నా బెస్ట్ ఫ్రెండ్. నా మోటివేటర్. నాకు ఇప్పుడు 17 ఏళ్లు. ఈ పదిహేడేళ్లు ఆయన నాతో ఉన్నారు. ఈ జ్ఞాపకాలతో మేం ముందుకు వెళ్తాం. ఇది భారత దేశానికి పూడ్చలేని లోటు’ అని లిద్దర్ కూతురు ఆషానా లిద్దర్ చెప్పారు. 

కాగా, హెలికాప్టర్‌‌ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పొరుగు దేశాల సైన్యాధిపతులు, కమాండర్లు ఢిల్లీకి చేరుకున్నారు. బిపిన్ రావత్ దంపతుల అంతిమయాత్ర వారి ఇంటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రారంభమైంది. రావత్ కూతుర్లు నివాళులు అర్పించిన తర్వాత.. రావత్ దంపతుల పార్ధివ దేహాలను వాహనంపైకి ఎక్కించారు. నాలుగు గంటల సమయంలో ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్‌‌ శ్మశాన వాటికకు చేరుకుంది.  మరికొద్ది సేపట్లో అంత్యక్రియలు ముగియనున్నాయి.