గెలుపు, ఓటమిని శాసిస్తున్న సోషల్ మీడియా

గెలుపు, ఓటమిని శాసిస్తున్న సోషల్ మీడియా

ఒకప్పుడు ఎన్నికలు రాగానే అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఊరూరా తిరుగుతూ మైకుల్లో ప్రచారం చేసేవారు.   ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆన్లైన్ ప్రచారం పెరిగింది. ఫేస్​బుక్,  వాట్సాప్, ఎక్స్(ట్విట్టర్), ఇన్​స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు సంక్షిప్త సందేశాలు వాయిస్ మెసేజ్ లు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.  మరోవైపు డిజిటల్ తెరలతో  కూడిన వాహనాలను తిప్పుతూ పార్టీల మేనిఫెస్టోలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే.. ప్రత్యర్థి లోపాలను ఎత్తి చూపుతున్నారు.  సోషల్ మీడియాలో  ప్రస్తుతం నయా ట్రెండ్ కొనసాగుతున్నది. ఇంటింటికి తిరిగేవారు.  ప్రతి ఇంటికి వెళ్లి ఓటును అభ్యర్థించేవారు.  మారుతున్న కాలానుగుణంగా ఇదివర

కులా  రోడ్ల మీద, ఊర్లలో  కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.  

స్టార్​ క్యాంపెయినర్​గా సోషల్ మీడియా

రాజకీయ పార్టీలు  తమ ప్రత్యర్థి పార్టీలపై  విమర్శలు చేయడానికి, సొంత డబ్బా కొట్టుకోవడానికి, ప్రత్యర్థులు చేసే ఆరోపణలు తిప్పికొట్టడానికి సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారు.   తమ తరఫున పనిచేయడానికి  సోషల్ మీడియాను స్టార్ క్యాంపెయినర్ గా వినియోగిస్తున్నారు. పార్టీలపరంగా వార్ రూమ్ లను ఏర్పాటు చేసి  ప్రచారం చేస్తున్నారు.  ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో తమ ప్రత్యర్థులపై నేతలు ఆరోపణలు చేయడానికి సోషల్ మీడియా వేదికగా మారిందని చెప్పవచ్చు.  అదేవిధంగా ఎన్నికల్లో  గెలవాల్సిందే అన్న లక్ష్యంతో  ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేయడం, ఫేక్ పత్రాలను సృష్టించి వాటిని వివిధ గ్రూపులకు పంపుతున్నారు.  సోషల్‌‌‌‌ మీడియా ఇప్పుడు ప్రచారంలో కీలకంగా మారింది.  అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయికి ఎదిగింది.  సమాచారం సెకన్లలో లక్షలాది మందిని చేరుకుంటోంది.    రోజువారీ ప్రచార వివరాలు, ప్రజలతో మమేకమయ్యే సందర్భాలను సోషల్‌‌‌‌ మీడియాలో అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేయడానికి అవగాహన ఉన్నవారిని ఉద్యోగాల్లో చేర్చుకున్నారు. అభ్యర్థికి పాజిటివ్‌‌‌‌ అంశాలను జత చేస్తూ,   ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు,  కంటెంట్‌‌‌‌ రైటర్లను నియమించుకున్నారు.  

సోషల్ మీడియా కీలక పాత్ర

డిజిటల్ యుగంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నది.  ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా సోషల్ మీడియా కొత్త ట్రెండ్ సెట్ సృష్టిస్తోంది.ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్రచారంలో యాక్టివ్‌‌‌‌గా ఉండటానికి పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.  ప్రధానంగా ఒక పార్టీ అభ్యర్థి తన ప్రచారంలో భాగంగా ఒక గ్రామానికి వెళ్లి మాట్లాడితే,  కేవలం ఆ గ్రామ ప్రజలే కాకుండా యూట్యూబ్, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ల  లైవ్ స్ట్రీమింగ్ ద్వారా డిజిటల్ ప్రచారం సాగిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ డాక్యుమెంటరీ రూపంలో ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ పార్టీ మేనిఫెస్టోను, తాను గెలిస్తే ఏం చేస్తానో సోషల్ మీడియా వేదిక ద్వారా పబ్లిసిటీ చేస్తున్నారు.  ప్రత్యర్థులు ఏమైనా మాటలను తప్పుగా మాట్లాడినప్పుడు, చేయరాని హావభావాలు వ్యక్తపరిచినప్పుడు నిమిషాల్లో ఆ వీడియోను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.  

పోస్టులు వైరల్​

పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ సోషల్‌‌‌‌ మీడియా ద్వారా తమకు మద్దతు ఇవ్వాలని పోస్టులు వైరల్‌‌‌‌ చేస్తున్నారు. అభ్యర్థులు తమకు మద్దతుగా ప్రచారం చేయాలని అత్యధికంగా ఫాలోవర్స్‌‌‌‌ ఉన్న పేజీ నిర్వాహకులను సంప్రదిస్తున్నారు.  లక్ష సబ్‌‌‌‌స్ర్కైబర్స్‌‌‌‌ ఉన్న యూట్యూబ్‌‌‌‌ పేజీకి ఓ ధర, ఆపై ఉన్న పేజీలకు ఓ ధరలను నిర్ణయిస్తూ వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు.  ఇప్పటికే వార్త కంటెంట్‌‌‌‌తో ఉన్న యూట్యూబ్‌‌‌‌ పేజీలకు మరింత డిమాండ్‌‌‌‌ పెరిగింది.  అభ్యర్థి ప్రచారం నుంచి ఎన్నికలు పూర్తయ్యేవరకు కంటెంట్‌‌‌‌ సృష్టించి వీడియోలు ప్రసారం చేసి అభ్యర్థికి ఆదరణ వచ్చేలా యాక్టివిటీ అంతా సోషల్‌‌‌‌ మీడియా నిర్వాహకులే చూసుకుంటున్నారు.  మొత్తానికి ఎన్నికల ప్రచారం సోషల్‌‌‌‌ మీడియాలో కౌంటర్‌‌‌‌ ఎటాక్‌‌‌‌లతో జోరందుకున్నది.  చాలామంది టీనేజర్లు రోజూ ఏదో ఒక రకమైన ఆన్‌‌‌‌లైన్ మీడియాలో నిమగ్నమవుతున్నారు.  మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో సోషల్ మీడియా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నది. అభ్యర్థుల గెలుపోటములు శాసించే స్థాయికి ఎదిగింది.

- జి. లక్ష్మణ్ కుమార్,
అసిస్టెంట్ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ