వందేమాతరం వివాదం..మోదీ చరిత్ర తెలుసుకో.. జైరాం రమేష్

వందేమాతరం వివాదం..మోదీ చరిత్ర తెలుసుకో.. జైరాం రమేష్

వందేమాతరం గీతం 150 ఏళ్ల స్మారకోత్సవాల్లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వందేమాతరం జాతీయ గీతం కొన్ని చరణాలను తొలగించడం వల్లే దేశ విభజన జరిగింది.. ఇప్పటికీ అదే విభజన కొనసాగుతోంది అని  ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం పై కాంగ్రెస్​ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఆనాడు మహాత్మాగాంధీ, రవీంద్ర నాథ్​ ఠాగూర్​ లాంటి నేతలు ఇచ్చిన సలహా మేరకే కొన్ని చరణాలను తొలగించారని సాక్ష్యాలతో సహా మోదీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు కాంగ్రెస్​ సీనియర్​ నేత జైరాంరమేష్​. 

1937లో వందేమాతరంపై కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ) చేసిన ప్రకటనను భారత విభజనతో ముగిపెట్టినందుకు ప్రధానమోదీపై కాంగ్రెస్​ నేత జైరాం రామే తీవ్ర విమర్శలు చేశారు. 

మోదీ మాటలను తిప్పికొట్టేందుకు ది కలెక్టెడ్​ వర్క్స్​ ఆఫ్​ మహాత్మాగాంధీ పుస్తకం నుంచి సారాంశాలను Xలో షేర్​ చేశారు.1937 అక్టోబర్​ 28న సీడబ్ల్యూసీ వందేమాతరంపై  రవీంద్రనాథ్​ ఠాగూర్​ సలహాతో ఓ ప్రకటన చేసింది. జాతీయ సమావేశాల్లో  వందేమాతరం గేయంలోని  మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని తెలిపింది. 

భారత దేశ సౌందర్యాన్ని , స్ఫూర్తిని ఉట్టిపడేలా ఉన్న మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్నారు.  మతపరమైన అంశాలు గా ఉన్న మిగతా చరణాలను అరుదుగా ఉపయోగించారు. కొన్ని చరణాలపై ముస్లిం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.. మొదటి రెండు చరణాలు బ్రిటీష్​ పాలనకు వ్యతిరేకంగా భారత్​ ఐక్యతను సూచిస్తాయని కమిటీ తెలిపింది. 

దీనికి సంబంధించి రమేష్ ప్రభాత్ కుమార్ ముఖోపాధ్యాయ రాసిన ,1994లో విశ్వభారతి ప్రచురించిన రవీంద్రనాథ్ ఠాగూర్ జీవిత చరిత్ర రవీంద్ర-జీబానీ వాల్యూమ్ 4 నుంచి పేజీల స్క్రీన్‌షాట్‌లను శనివారం (నవంబర్​8) జైరాం రమేష్​ షేర్​ చేశారు. 

వందేమాతరం గేయంలో కొన్ని చరణాలను తొలగించాలనే నిర్ణయం విభజనకు బీజం నాటిందని నేటికీ విభజన మనస్తత్వాన్ని  కలిగి ఉందని మోదీ వ్యాఖ్యనించడాన్ని  సాక్ష్యాలతో సహా జైరాం రమేష్​ఖండించారు.