హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ కు ఆహ్వానం

హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ కు ఆహ్వానం
  •     ప్రతిష్టాత్మక ‘ఏఐ పాలసీ సింపోజియం’లో ప్రసంగించాలని విజ్ఞప్తి
  •     భారత్ నుంచి ఈ ఘనత దక్కించుకున్న ఏకైక సీఎం
  •     డేటా సెంటర్లు, ఏఐ సిటీ అభివృద్ధిపై కీలక ప్రసంగం

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘హార్వర్డ్ కెన్నెడీ స్కూల్’నుంచి అరుదైన ఆహ్వానం అందింది. ఆ విద్యాసంస్థ తొలిసారిగా నిర్వహిస్తున్న ‘ఏఐ పాలసీ సింపోజియం(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు)’లో ప్రసంగించాలని కోరుతూ సదస్సు నిర్వాహకులు సీఎంకు ఆహ్వాన లేఖ పంపారు. 2026 మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లోనే ఈ కార్యక్రమం జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు భారత్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి కావడం గమనార్హం. 

ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఏఐ యాజ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంప్యూట్ పవర్: ఇంపాక్ట్ ఆన్ లివబిలిటీ అండ్ వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్’అనే ప్రత్యేక ప్యానెల్‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. భవిష్యత్తులో వ్యూహాత్మక మౌలిక సదుపాయాలుగా డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ఎలా మారబోతున్నాయి? అవి మానవ జీవన ప్రమాణాలు, ఉపాధి రంగాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అనే కీలక అంశాలపై ఈ సెషన్‌‌‌‌‌‌‌‌లో చర్చించనున్నారు.

‘ఏఐ సిటీ’ విజన్‌‌‌‌‌‌‌‌పై అంచనాలు..

భారత్ ఫ్యూచర్ సిటీ విజన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా తెలంగాణలో ‘ఏఐ సిటీ’నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధికి అవసరమైన భూమి, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణ నిబంధనలు, పెట్టుబడుల్లో భాగస్వామ్యం తదితర అంశాలపై ప్రభుత్వాల విధానాలు ఎలా ఉండాలన్న దానిపై రేవంత్ రెడ్డి ఆ వేదికపై తన విజన్‌‌‌‌‌‌‌‌ను పంచుకోనున్నారు. స్థానికులకు పెద్దపీట వేస్తూ విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ప్రభుత్వాల పాత్రను వివరించనున్నారు.

ఒకే వేదికపైకి దిగ్గజాలు..

ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా (అకాడమీయా) రంగాలకు చెందిన అగ్రశ్రేణి నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్నదే ఈ సింపోజియం ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో ఏఐ పాలన, జియోపాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, ఎనేబ్లింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై ఇందులో మేధోమథనం సాగనుంది. 

కాగా, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంగా.. సదస్సు నిర్వాహకులు ఆయనను ప్రత్యేకంగా కలిసి ఈ సింపోజియం గురించి చర్చించారు. దానికి కొనసాగింపుగానే హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ కో-క్యూరేటర్ రుక్సాండా రెనిటా నుంచి సీఎంకు అధికారికంగా ఈ ఆహ్వానం అందింది.