బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం16 ఏండ్లలోపు పిల్లలకు స్మార్ట్ ఫోన్ల వినియోగంపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నది. విద్యార్థుల్లో సోషల్ మీడియా వ్యసనం, దాని వల్ల మానసిక సమస్యలు, చదువులపై ప్రభావం దృష్ట్యా ఈ ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. యూనివర్సిటీల వైస్చాన్స్లర్లతో సీఎం సిద్ధరామయ్య ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టూడెంట్స్ ఫోన్లకు బానిసలవడమే కాకుండా మత్తుపదార్థాలకూ అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియాతోపాటు ఇతర దేశాల్లో విద్యార్థులు స్మార్ట్ ఫోన్ల వాడకంపై ఆంక్షలు విధించే ఆలోచనలు జరుగుతున్నాయన్నారు. ఆ దిశగానే కర్నాటక ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నదని తెలిపారు. స్టడీ చేసి అభిప్రాయాలు చెప్పాలని వైస్చాన్స్లర్లను కోరారు. పిల్లలకు సోషల్ మీడియాపై అతిగా ఆసక్తి పెరుగుతున్నదని, దీంతో వాళ్ల ప్రవర్తన మారుతున్నదని, చదువుపై దృష్టి పెట్టడం లేదని, మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నదని ఆయన తెలిపారు.
కాగా, కర్నాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. గోవా, ఏపీ ప్రభుత్వాలు కూడా 16 ఏండ్లలోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటివాటిపై పరిమితులు విధించడాన్ని పరిశీలిస్తున్నాయి.
