ఉగ్రదాడుల కుట్ర భగ్నం.. 8 మంది అనుమానితుల అరెస్ట్

ఉగ్రదాడుల కుట్ర భగ్నం..  8 మంది అనుమానితుల అరెస్ట్
  • పాక్ లష్కరే, బంగ్లాదేశ్ ఉగ్ర సంస్థలతో లింకున్నట్టు గుర్తింపు 

న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు, బెంగాల్ లో వారిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తాయిబా, బంగ్లాదేశ్ లోని ఇతర ఉగ్ర సంస్థలతో వారికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితులు మిజానుర్  రహమాన్, మొహమ్మద్  షాబాత్, ఉమర్, మొహమ్మద్  లిటన్, మొహమ్మద్  షాహిద్, మొహమ్మద్, ఉజ్జల్ ను తమిళనాడులోని తిరుప్పూర్  జిల్లాలో ఒక గార్మెంట్  తయారీ యూనిట్ లో అదుపులోకి తీసుకున్నారు. 

మిగతా ఇద్దరిని బెంగాల్ లో అరెస్టు చేశారు. వీరిలో ఒకరు బంగ్లాదేశీ అని అధికారులు తెలిపారు. వీరంతా  ఫోర్జరీ చేసిన ఆధార్  కార్డులు వాడుకున్నారని చెప్పారు. వారి నుంచి మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు పోలీసులు అరెస్టు చేసిన నిందితులను ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఢిల్లీ, కోల్  కతా మెట్రో స్టేషన్లతో పాటు పదికిపైగా ప్రాంతాల్లో అనుమానితులు ‘ఫ్రీ కాశ్మీర్’, ‘కాశ్మీర్ లో మారణహోమం ఆపండి’ అని రాసిఉన్న పోస్టర్లు పెట్టారని పోలీసులు తెలిపారు. 

ఉగ్ర  సంస్థల నుంచి వారికి ఫండింగ్  అందిందని, వారితో అనుమానితులు డైరెక్ట్  గానూ, సోషల్ మీడియాలోనూ కాంటాక్ట్ అయ్యారని వెల్లడించారు. కాగా.. ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్ తో పాటు దేశంలోని కీలక ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడేందుకు టెర్రరిస్టులు కుట్రపన్నారని ఇంటెలిజెన్స్  వర్గాలు హెచ్చరించిన ఒకరోజు వ్యవధిలోనే ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.