- మరో ముగ్గురికి గాయాలు
మంచిర్యాల/కడెం, వెలుగు: మంచిర్యాల సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ఎండీ నసీరుద్దీన్(61) యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ ఘటనలో ఆయన కూతురు, మనవరాలితో పాటు కారు డ్రైవర్ గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి..
మంచిర్యాలలోని ఇస్లాంపురకు చెందిన నసీరుద్దీన్ భార్య ఇర్ఫాన్ నిర్మల్ లో గవర్నమెంట్ టీచర్ గా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు కూతుళ్లు ఉండగా, పెద్ద కూతురు నేహా షరీన్ భైంసాలో ఉంటోంది. ఆదివారం భైంసా వెళ్లిన నసీరుద్దీన్ కూతురు నేహా షరీన్, మనువడు ఇరా హరీన్ తో కలిసి నిర్మల్ కు వచ్చారు. అక్కడ కారులో భార్య ఇర్ఫాన్ ను ఎక్కించుకొని మంచిర్యాలకు వస్తుండగా, నిర్మల్ జిల్లా కడెం మండలం దోస్త్ నగర్ వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.
ముందు సీట్లో కూర్చున్న నసీరుద్దీన్ కు తీవ్రగాయాలై స్పాట్ లోనే చనిపోయారు. నేహా షరీన్, ఇరా హరీన్ తోపాటు డ్రైవర్ బిలాలుద్దీన్ కు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను 108లో మంచిర్యాల జిల్లా లక్షెటిపేట్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన కడెం ఎస్సై సాయికిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నసీరుద్దీన్ మార్చి నెలాఖరులో రిటైర్ కావాల్సి ఉంది.
