జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ పై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొన్నం,జూపల్లి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్ కుమార్..బీఆర్ఎస్,బీజేపీకి ఓటేస్తే నోటాకు వేసినట్టేనన్నారు. కేటీఆర్ తో కేంద్రమంత్రి మిలాఖత్ అయ్యారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించింది అందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ సహకారంతోనే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. ఓటమి భయంతోనే కేటీఆర్, హరీశ్ కుప్పిగంతులు వేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లు ఎన్ని కుప్పిగంతులేసినా కాంగ్రెస్ దే విజయమన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ వచ్చాకే అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ కులాలకు,మతాలకు,ప్రాంతాలకు అతీతమన్నారు. బీఆర్ఎస్,బీజేపీ వేర్వేరు కాదన్నారు. నవీన్ యాదవ్ 30 వేల నుంచి 50 వేల మెజారిటీ ఖాయమన్నారు .మాగంటి కుటుంబం అడుతున్న ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
జూబ్లీహిల్స్ లో గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డివ్వలేదన్నారు మంత్రి ఉత్తమ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 15 వేల రేషన్ కార్డులిచ్చామని తెలిపారు . 2 లక్షల40 వేల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. ఎల్లప్పుడూ మైనార్టీలకు కాంగ్రెస్ అండగా ఉందన్నారు. నవీన్ యాదవ్ గెలుపుతోనే జూబ్లీహిల్స్ అభివద్ధి సాధ్యమని అన్నారు ఉత్తమ్.
నవీన్ యాదవ్ పదవి లేకున్నా ఇన్నాళ్లు జనం మధ్యలో ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. యువకుడిని గెలిపిస్తే జనం కోసం పనిచేస్తాడన్నారు. జూబ్లీహిల్స్ లో నాలాలు,రోడ్ల సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు.
