- అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేట, వెలుగు : అంగన్‌వాడీ వర్కర్లు, అధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హెచ్చరించారు. మంగళవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో డివిజన్ పరిధిలోని అంగన్‌వాడీ సీడీపీఓలు, సూపర్ వైజర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రాల పనితీరు, పిల్లలు, గర్భిణులకు అందుతున్న పౌష్టికాహారం, ఫ్రీస్కూల్ విద్య అమలు తీరును అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన అంగన్‌వాడీ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బల్మూరు మండలం జినుకుంటలో నిర్వహిస్తున్న యాదవుల ఎల్లమ్మ పండుగ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓలు దమయంతి, లక్ష్మి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
లింగాల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ రీ-సర్వే ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. లింగాల మండలం అంబటిపల్లిలో నిర్వహించిన రీ-సర్వే అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. భూ భారతిని పక్కాగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అంబటిపల్లిలోని 915 సర్వే నంబర్లలో గల 6,492 ఎకరాల భూమిని సర్వే చేస్తున్నట్లు వివరించారు.
నాగర్ కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన నాలుగు గ్రామాల్లో అంబటిపల్లి ఒకటి అని అడిషనల్ కలెక్టర్ అమరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వేయర్ నాగేందర్, తహసీల్దార్ వెంకటేశ్, సర్పంచ్ జంబుల శ్రీవాణి, ఉప సర్పంచ్ మల్లేశ్, మాజీ చైర్మన్ హనుమంత్ రెడ్డి తదితర అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
