న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాతో మ్యాచ్ ఆడే విషయంలో పాకిస్తాన్ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాకు మద్దతుగా టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్ కాట్ చేస్తామన్న పాక్.. ఐసీసీ చర్చలు జరపడంతో దారిలోకి వచ్చింది. బాయ్ కాట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. దీంతో ఇండియా, పాక్ మ్యాచ్‌పై నెలకొన్న నీలినీడలు తొలగిపోయాయి.
తాజాగా ఈ అంశంపై బీసీసీఐ స్పందించింది. షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకోవడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఇది ఐసీసీ సాధించిన భారీ విజయమని బీసీసీఐ అభివర్ణించింది. ఈ మేరకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ఐసీసీ, పీసీబీ, బీసీబీ మధ్య జరిగిన చర్చల ఫలితం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
వ్యక్తిగత అంశాలను పక్కనబెట్టి క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది మంచి పరిష్కారమని అన్నారు. ఈ ఇష్యూపై ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించి యధావిధిగా మ్యాచ్ జరిగేలా కృషి చేసిన ఐసీసీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. పాకిస్తాన్‌ను చర్చల పట్టికలోకి తీసుకువచ్చి 2026, ఫిబ్రవరి 15న షెడ్యూల్ ప్రకారం ఇండియా, పాక్ మ్యాచ్ జరిగేలా చేయడం ఐసీసీ సాధించిన అతి పెద్ద విజయమని ప్రశంసించారు.
ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండియా, పాక్ మ్యాచ్ యధావిధిగా జరుగుతుందని.. ఇది క్రికెట్ ప్రియులందరికీ శుభవార్త అని అన్నారు. షెడ్యూల్ ప్రకారం మ్యాచులు జరగనుండటంతో ఇండియా, శ్రీలంక వేదికలుగా జరుగుతోన్న ఈ వరల్డ్ కప్ గ్రాండ్ సక్సెస్ అవుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
