గ్రేటర్ వరంగల్, వెలుగు: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ లో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైద్యులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు ప్రోత్సహించాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, సంబంధిత సూపరింటెండెంట్లు, గైనకాలజిస్టులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆరోగ్య మహిళా క్లినిక్ లో పరీక్షించి మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేసిన వారికి తగిన ఫాలోఅప్ సేవలు అందించాలన్నారు.
ప్రభుత్వ వైద్యాధికారులు యాక్షన్ ప్లాన్ షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ నాన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, ఇప్పటి వరకు నిర్వహించిన క్యాంపుల వివరాలను సమర్పించాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో అప్పయ్య, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ గౌతమ్ చౌహన్, జీఎంహెచ్ఆర్ఎంవో డాక్టర్ మంజుల, డిప్యూటీ డీఎంహెచ్ వో ప్రదీప్ రెడ్డి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
