మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుస్నాబాద్ ఆర్ఓకు బీజేపీ ఫిర్యాదు

 మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుస్నాబాద్ ఆర్ఓకు బీజేపీ ఫిర్యాదు

హుస్నాబాద్, వెలుగు: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్​లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం హుస్నాబాద్ మున్సిపల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత మంత్రి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. 

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును వేదికగా చేసుకుని ప్రెస్ మీట్ నిర్వహించడం, ఓట్లు అభ్యర్థించడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో కాంగ్రెస్​ను గెలిపించాలని కోరుతూ ప్రజలను ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల రోజున తన అనుచరులతో అల్లర్లు సృష్టించి, అక్రమంగా ఓట్లు వేయించుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్నికల అధికారులు స్పందించి ఆయనపై  చర్యలు తీసుకోవాలని కోరారు.