న్యూస్ పేపర్లపై మిడ్ డే మీల్స్... ప్రధాని, మధ్యప్రదేశ్ సీఎం సిగ్గుపడాలి: రాహుల్ గాంధీ

న్యూస్ పేపర్లపై మిడ్ డే మీల్స్... ప్రధాని, మధ్యప్రదేశ్ సీఎం సిగ్గుపడాలి: రాహుల్ గాంధీ
  • పిల్లల ప్లేట్లు కూడా లాక్కున్నారని ఫైర్

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు న్యూస్ పేపర్లపై మధ్యాహ్న భోజనం వడ్డించారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష లీడర్  రాహుల్  గాంధీ విమర్శించారు. న్యూస్ పేపర్లపై పిల్లలు భోజనం చేస్తున్న ఓ వీడియోను ‘ఎక్స్’ లో ఆయన షేర్  చేశారు. ఆ ఘటన చూసి తన హృదయం ముక్కలైందన్నారు. ‘‘రేపటి పిల్లల భవిష్యత్తును మధ్యప్రదేశ్  బీజేపీ సర్కారు అత్యంత దయనీయ పరిస్థితిలోకి నెట్టేసింది.

విద్యార్థులు తినడానికి కనీసం ప్లేట్లు కూడా లేవా? పిల్లల ప్లేట్లను కూడా బీజేపీ నేతలు లాగేసుకున్నారు. మధ్యప్రదేశ్ లో 20 ఏండ్లకుపైనే బీజేపీ అధికారంలో ఉంది. అలాంటి రాష్ట్రంలో ఇలాంటి దయనీయ పరిస్థితి ఏంది? ఈ ఘటనతో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర సీఎం మోహన్  యాదవ్ సిగ్గుపడాలి. 

రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని బీజేపీ నేతలు చెప్పుకుంటారు. ఆ అభివృద్ధి ఎక్కడ? అంటే డెవలప్ మెంట్ ఒక భ్రాంతి మాత్రమేనా? పిల్లలు భోజనం చేయడానికి కనీసం ప్లేట్లు కూడా ఇవ్వరా?” అని రాహుల్ నిలదీశారు. వ్యవస్థను వాడుకుని బీజేపీ అధికారంలోకి వస్తున్నదని ఆయన ఫైర్  అయ్యారు.