భారత ప్రజాస్వామ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అసాధారణ రీతిలో వార్తల్లో నిలుస్తోంది. 2015 నుంచి ఈ సంస్థను రాజకీయ ప్రత్యర్థులపై అస్త్రంగా వాడుతున్నారనే ఆరోపణలు తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టులు ఇచ్చిన తీర్పులు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
సాక్ష్యాలు లేకున్నా..
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నెలల తరబడి లిక్కర్ స్కామ్ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు, ట్రయల్ కోర్టులు వెల్లడించిన అంశాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో ఎక్కడా సరైన సాక్ష్యాలు లేవని, కేవలం వాంగ్మూలాల ఆధారంగానే అరెస్టులు జరిగాయని కోర్టు పేర్కొంది. ఎలాంటి మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా ఒక వ్యక్తిని నెలల తరబడి జైలులో ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అంటూ న్యాయస్థానం స్పష్టం చేయడం గమనార్హం.
2015 నుంచి మెుదలైన వేట..
2015 తర్వాత దేశంలో ఈడీ దాడుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధానంగా విపక్ష నాయకులు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే సామాజిక కార్యకర్తలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయనే విమర్శ ఉంది. అధికార పక్షంలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈడీ నోటీసులు అందుకోవడం అదే నాయకులు అధికార పార్టీలో చేరగానే ఆ కేసులు అటకెక్కడం 'వాషింగ్ మెషిన్' రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
ALSO READ : లిక్కర్ కేసు బ్యాక్ గ్రౌండ్ ఇదీ.. లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు పై సీబీఐ కేసు
సామాన్యుడిపై ఈడీ పంజా..
కేవలం రాజకీయ నాయకులే కాదు, సామాన్య వ్యాపారవేత్తలు కూడా ఈ వ్యవస్థ బాధితులుగా మారుతున్నారు. ఢిల్లీలో ఒక చిన్న గార్మెంట్ షాపు నడుపుకునే దంపతుల బ్యాంక్ అకౌంట్లను ఎలాంటి నోటీసు లేకుండా ఈడీ ఫ్రీజ్ చేసిన తీరు ఒక ఉదాహరణ మాత్రమే. కోర్టు ఆర్డర్ లేదు, ముందస్తు సమాచారం లేదు.. కేవలం అధికారుల ఇష్టం మేరకు అకౌంట్లు ఫ్రీజ్ చేయడంతో ఆ దంపతులు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, అద్దె కట్టలేక రోడ్డున పడ్డారు. ఇలాంటి ఫేక్ నోటీసులు, ఫేక్ దాడులు ఇప్పుడు దేశంలో సాధారణమైపోయాయనే వాదన బలంగా వినిపిస్తోంది బీజేపీ ప్రభుత్వంలో.
ప్రజాస్వామ్యానికి ముప్పు..
ఈ పరిస్థితి కేవలం కేజ్రీవాల్‌కో లేదా సోనమ్ వాంగ్‌చుక్‌కో పరిమితం కాదు. ఇప్పుడు వారు, రేపు మీరు కూడా కావచ్చు. దేశం నాశనమవుతోంది చెడ్డ వాళ్ల వల్ల కాదు.. ఎదురుగా అన్యాయం జరుగుతున్నా పట్టించుకోని మంచి వాళ్ల మౌనం వల్లనే. వాట్సాప్ ఫార్వర్డ్స్, సినిమాలు, మతపరమైన గొడవల్లో మునిగిపోయి అసలు సమస్యలను మనం విస్మరిస్తున్నాం అనేది వాస్తవం.
మనం ఎన్నుకున్న నాయకులను ప్రశ్నించే ధైర్యం మనకు ఉండాలి. ఆసుపత్రుల్లో ప్రాణాలు, బ్యాంకుల్లో మన డబ్బు భద్రంగా లేని స్థితికి చేరుకుంటున్నాం. హేతుబద్ధంగా ఆలోచించి, రాజ్యాంగ విలువల కోసం గొంతు ఎత్తాల్సిన సమయం ఇది. మీరు పోరాడలేకపోయినా, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే వారికి కనీసం మద్దతుగా నిలవండి. అప్పుడే భారత ప్రజాస్వామ్యం నిలబడుతుంది.
