న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో మద్యం వ్యాపారంపై గుత్తాధిపత్యం కోసం 2021–22 నాటి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని తారుమారు చేశారని ఆరోపిస్తూ 2022లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఈ కేసు తెరపైకి వచ్చింది. 2022 జులై 20న లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) , పలువురు నేతలు పాలసీని మార్చడం వల్ల మద్యం తయారీదారుల నుంచి ముడుపులు అందుకున్నారని దర్యాప్తు సంస్థ పేర్కొన్నది. తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పేరుతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటరైంది.
అనాటి ఎక్సైజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ 2023 ఫిబ్రవరి 26న అరెస్ట్ చేయగా, మార్చి 9న ఈడీ కూడా అరెస్ట్ చేసింది. 2021–22 ఎక్సైజ్ పాలసీ విషయంలో సరైన అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకొని లైసెన్సీలకు అనుచిత లాభాలు కల్పించారని ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది. అర్వింద్ కేజ్రీవాల్‌ను 2024 జూన్ 26న..ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో సీబీఐ అధికారికంగా అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయన సుమారు 156 రోజులు జైలుజీవితం గడిపారు. మనీశ్ సిసోడియా సుమారు 530 రోజులు జైలులో ఉన్నారు.
చార్జ్‌షీట్‌లో కింగ్ పిన్‌గా కవిత పేరు..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత కింగ్ పిన్‌గా, ప్రధాన కుట్రదారుగా, లిక్కర్ పాలసీలో ప్రధాన లబ్ధిదారుగా ఉన్నారని అరెస్ట్ తర్వాత ట్రయల్ కోర్టు ముందు సీబీఐ, ఈడీ ఆరోపించాయి. జులై 3న 8 వేల పేజీలతో ఈడీ, జూన్ 7న సీబీఐ కవితతోపాటు పలువురిపై చార్జ్‌షీట్స్ దాఖలు చేశాయి. ఆప్ ముఖ్య నేతలలు కేజ్రీవాల్, సిసోడియాతో కుమ్మకైన కవిత... శరత్ చంద్రా రెడ్డి, రాఘవ మాగుంట, మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు సౌత్ గ్రూపు ప్రాతినిధ్యం వహించారని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో భారీ ఎత్తున మేలు పొందేందుకు వీలుగా రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారని పేర్కొన్నారు.
ఈ దిశగా ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాతో ఆమె అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని ప్రస్తావించాయి. సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి దళారుల ద్వారా ముడుపులు చేతులు మార్చారని తెలిపింది. అందువల్ల ఆప్ నేతలు ముందుగానే కవితకు లిక్కర్ పాలసీ డిటైల్స్ వెల్లడించారని తెలిపింది.
లిక్కర్ పాలసీ రూప కల్పన, పాలసీ తయారీకి వ్యతిరేకంగా దాఖలైన కేసు, ఈ స్కాంలో ప్రమేయం ఉన్న ముఖ్యల వివరాలు, దర్యాప్తు సంస్థల విచారణ, పలువురి స్టేట్‌మెంట్లు, చేతుల మారిన రూ. 100 కోట్ల కిక్ బ్యాగ్‌ల వివరాలను ప్రస్తావించింది. మొత్తం 18 అంశాలను పొందుపరిచిన దర్యాప్తు సంస్థలు లిక్కర్ స్కాంలో పలువురి వాంగ్మూలం, వాట్సాప్ చాట్స్ సేకరించి వాటి ఆధారంగా కవితను విచారించినట్లు తెలిపింది. ఈ ఆధారాలపై బుకాయించడంతో.. ఆమెను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని కోర్టుకు స్పష్టం చేశాయి.
146 రోజులు తిహార్‌లో జైలులో కవిత..
డిసెంబర్ 2022లో సాక్షిగా తొలిసారి కవిత పేరు తెరపైకి వచ్చింది. కవితను సాక్షిగా సీబీఐ హైదరాబాద్‌లోని తన నివాసంలో దాదాపు 7 గంటలపాటు విచారించింది. అనంతరం దాదాపు ఏడాదిన్నర తర్వాత మరోసారి నిందితురాలిగా పేర్కొంటూ 2024లో నోటీసులు ఇచ్చింది. కాగా, కవిత విచారణకు హాజరుకాలేదు. లిక్కర్ కేసులో సోదాల పేరుతో 2024 మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని కవిత నివాసానికి వెళ్లారు. అదే రోజు సాయంత్రం 5:20 గంటలకు కవితను అరెస్ట్ చేసి.. అర్ధరాత్రి ఢిల్లీలోని ఈడీ హెడ్ ఆఫీసుకు తరలించారు.
తర్వాతి రోజు మార్చి 16న కవితను ఈడీ అధికారులు సీబీఐ స్పెషల్ కోర్టు(రౌస్ ఎవెన్యూ)లో ప్రొడ్యూస్ చేశారు. ఆమెకు పలు దఫాలుగా 14 రోజులు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ గడువు పూర్తయిన తర్వాత మరోసారి మార్చి 26న ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయగా. కవితకు స్పెషల్ జడ్జి జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
దీంతో పోలీసులు ఆమెను తిహార్ జైలుకు తరలించారు. జైలులో ఉండగానే 2024 ఏప్రిల్ 6న సీబీఐ అధికారులు ఆమెను విచారించారు. ఈ విచారణను సవాల్ చేస్తూ కవిత కోర్టును ఆశ్రయించగా, ఆమెకు ఊరట దక్కలేదు. ఏప్రిల్ 11 (రంజాన్)న కవితను సీబీఐ అదుపులోకి తీసుకొని హెడ్ ఆఫీసుకు తరలించింది. తర్వాతి రోజు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 3 రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. తిరిగి ఏప్రిల్ 15న కవితను కోర్టులో హాజరుపరచగా, ఆమెకు సీబీఐ కేసులో కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మొత్తం మీద ఈ కేసులో కవిత దాదాపు 146 రోజులు జైలులోనే గడిపారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో 2024 ఆగస్టు 27న రాత్రి 9:10 గంటలకు జైలు నుంచి బయటకు వచ్చారు.
