ఒక్కొక్కరిది ఒక విజయగాధ... వరల్డ్ కప్ విజేతల ఇన్స్పిరేషనల్ లైఫ్ స్టోరీలు..

ఒక్కొక్కరిది ఒక విజయగాధ... వరల్డ్ కప్ విజేతల ఇన్స్పిరేషనల్ లైఫ్ స్టోరీలు..

యాభై ఏండ్ల కల ఇప్పటికి నెరవేరింది. ఇండియన్ విమెన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ టీం మొదటిసారి ప్రపంచ కప్‌‌‌‌ సాధించి చరిత్ర సృష్టించింది. విజయం కోసం టీం మెంబర్స్‌‌‌‌ అందరూ కష్టపడ్డారు. వరుసగా ఓడిపోయినా చివరికి ఫైనల్‌కు చేరి దక్షిణాఫ్రికాని ఓడించారు. గ్రౌండ్‌‌‌‌లో చూపించిన అదే ధైర్యం, తెగువ  వాళ్ల నిజ జీవితాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడంలోనూ కనిపిస్తోంది.  టీంలో చాలామంది చిన్న పట్టణాల నుంచి వచ్చినవాళ్లే. కలలను సాకారం చేసుకోవడానికి వాళ్లంతా ఎన్నో త్యాగాలు చేశారు. ఈ వారం వాళ్ల ‘లైఫ్‌‌‌‌’ స్టోరీలు వాళ్లవే. 

నాన్న చేసిన బ్యాట్‌తో..

ఆల్ రౌండర్ అమన్ జోత్ కౌర్ పంజాబ్‌‌లో పుట్టి, పెరిగింది. ఆమె తండ్రి భూపిందర్ సింగ్ ఒక కార్పెంటర్‌‌‌‌ వర్క్‌‌షాప్‌‌లో పనిచేసేవాడు. అమన్‌‌ చిన్నప్పుడు ఒకసారి ఆమె దగ్గర బ్యాట్ లేదని అబ్బాయిలు తమతో ఆడనివ్వలేదు. భూపిందర్‌‌‌‌ దగ్గర బ్యాట్‌‌ కొనేందుకు డబ్బు లేదు. దాంతో వర్క్‌‌షాప్‌‌లో మిగిలి పోయిన చెక్కతో బ్యాట్ చేసి ఇచ్చాడు. అదే ఆమె పట్టుకున్న మొదటి బ్యాట్‌‌. అలా ఆమె 2023లో భారత జట్టులోకి అరంగేట్రం చేసింది. 

కిట్ కొనేందుకు డబ్బు లేక..

అవమానాలు, ఆర్థిక కష్టాలు, కుటుంబ త్యాగాల ఫలితమే కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్ సాధించిన విజయం. ఆమె పంజాబ్‌‌‌‌లోని మొగాలో పుట్టింది. ఆమె తండ్రి హర్మందర్ సింగ్ భుల్లార్‌‌‌‌ క్లబ్ క్రికెటర్, జిల్లా కోర్టులో గుమస్తా. సరిపడా జీతం వచ్చేది కాదు. వాళ్లకు నాలుగు గేదెలు ఉండేవి. వాటి పాలు అమ్మి ఇంటి అవసరాలు తీర్చేవాడు. కూతుర్ని ఎలాగైనా గొప్ప క్రికెటర్‌‌‌‌‌‌‌‌ని చేయాలని కలలు కన్నాడు. కానీ.. ఆమె కోసం సరైన క్రికెట్ కిట్ కొనేందుకు కూడా డబ్బు లేదు. 

►ALSO READ | ఆసియా వివాదం త్వరలోనే ముగుస్తుంది: సైకియా

హర్మన్ బాయ్స్ షర్ట్‌‌‌‌ వేసుకుని క్రికెట్‌‌‌‌ ఆడేది. పాత బ్యాట్లు, సీమ్-లెస్ బంతులతో ప్రాక్టీస్‌‌‌‌ చేసేది. కూతుర్ని క్రికెట్ ఆడిస్తున్నందుకు చాలామంది భుల్లార్‌‌‌‌ను ఎగతాళి చేశారు. వాళ్ల మాటలను ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు. అందుకే ఫైనల్స్‌‌‌‌ గెలిచాక ట్రోఫీ పట్టుకుని “నాన్నా.. నీ కల నెరవేరింది” అన్నట్టు తండ్రి వైపు పరుగెత్తింది. ఆమెని అవమానించినవాళ్లకు ఆ ట్రోఫీతోనే సమాధానం చెప్పింది. 

హాకీ జట్టుకు కెప్టెన్‌‌

జెమిమా రోడ్రిగ్స్ ముంబైలోని బాంద్రాలో పుట్టింది. తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ జూనియర్ కోచ్‌‌గా పనిచేసేవాడు. అందుకే చిన్నప్పటినుంచే ఆమెను క్రికెట్‌ ఆడేలా ప్రోత్సహించాడు. ఆమె క్రికెట్‌‌తో పాటు హాకీ కూడా బాగా ఆడేది. మహారాష్ట్ర అండర్‌‌ - 17 హాకీ జట్టుకు కెప్టెన్‌‌ కూడా అయ్యింది. 2018లో ఇండియన్ క్రికెట్‌‌ టీంలో చేరింది. 2024లో ఖార్ జిమ్‌‌ఖానా క్లబ్​లో ఆమె తండ్రి ఇవాన్ మతపరమైన సమావేశాలు నిర్వహించి, క్లబ్ బైలాస్‌‌ని ఉల్లంఘించాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దాంతో ఖార్ జింఖానాలో జెమిమా గౌరవ సభ్యత్వాన్ని రద్దు చేశారు. దాంతో జెమిమా చాలా బాధపడింది. 

ఆ తర్వాత కూడా ఆమెని చాలామంది ట్రోల్‌‌ చేశారు. దాంతో కొన్నిసార్లు క్రికెట్‌‌ను వదిలేయాలి అనుకుంది. కానీ.. ఆస్ట్రేలియా మ్యాచ్‌‌లో 116 బంతుల్లో 14 బౌండరీలు, 3 సిక్సర్లతో 127 పరుగులు చేసి ఆమెని విమర్శించిన వాళ్లకు గట్టి సమాధానం ఇచ్చింది. 

తొమ్మిది ఏండ్లకే..

మహారాష్ట్రలోని సాంగ్లిలో క్రికెట్‌‌ను ఇష్టపడే కుటుంబంలో పుట్టింది స్మృతి మంధాన. వాళ్ల అన్న శ్రవణ్ కూడా క్రికెటర్‌‌‌‌. ఎన్నో అండర్‌‌‌‌–-16 టోర్నీలు ఆడాడు. స్మృతి తన తండ్రితో కలిసి అతని ఆటను చూసేందుకు వెళ్లేది. శ్రవణ్ విజయాలు సాధించినప్పుడు అతని గురించి స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చేవి. అప్పుడే స్మృతికి కూడా ఆటపై ఆసక్తి పెరిగింది. 

చిన్న  వయసులోనే బ్యాట్‌‌ పట్టుకుంది. శ్రవణ్‌‌కు రాహుల్ ద్రవిడ్ సంతకం చేసి ఇచ్చిన బ్యాట్‌‌తో ప్రాక్టీస్‌‌ చేసింది. మహారాష్ట్ర అండర్–15 జట్టులో తొలిసారి ఎంపికైనప్పుడు ఆమె వయసు తొమ్మిది సంవత్సరాలు. 11 ఏండ్లకే మహారాష్ట్ర అండర్–19 టీంలో ఆడింది. ఆమెకు సైన్స్‌‌ చదవాలని కోరిక. కానీ.. సైన్స్‌‌ కోర్స్‌‌ల్లో చేరితే క్రికెట్ ఆడేందుకు టైం దొరకదని కామర్స్‌‌లో చేరింది. ఆ తర్వాత 2013లో ఆమె భారత జట్టులోకి ఎంపికైంది.

రోడ్లపైనే క్రికెట్‌‌..

రిచా ఘోష్ పశ్చిమ బెంగాల్‌‌లోని సిలిగురిలో పుట్టింది. ఆమె తండ్రి మనబేంద్ర ఘోష్ క్లబ్ క్రికెటర్, కోచ్. రిచాకు చిన్నప్పటినుంచి టేబుట్‌‌ టెన్నిస్‌‌ అంటే ఇష్టం ఉండేది. కానీ.. తన తండ్రికి క్రికెట్‌‌మీద ఉన్న ఇష్టం వల్ల ఆమె కూడా క్రికెట్‌‌నే ఎంచుకుంది. క్రికెట్ స్టేడియం లేని ప్రాంతం వాళ్లది. రోడ్లపైనే క్రికెట్‌‌ ఆడేది. 

పదేండ్ల వయసులోనే వికెట్ కీపర్​గా రాణించింది. వాళ్ల ప్రాంతంలో అమ్మాయిలు క్రికెట్ ఆడేవాళ్లు కాదు. అందుకే ఆమె అబ్బాయిలతోనే ఆడేది. మనబేంద్ర ఘోష్ ఆమెకు ట్రైనింగ్‌‌ ఇప్పించడానికి, కావాల్సినవి సమకూర్చడానికి తన ఆస్తులు కూడా అమ్మేశాడు. 

బంతి విసిరి..

దీప్తి శర్మది ఆగ్రాలోని అవధ్‌‌పురి కాలనీ. తన అన్న సుమిత్‌‌ క్రికెట్‌‌ ఆడేవాడు. అతనితోపాటు దీప్తి కూడా వెళ్లేది. ఒకసారి బంతి తన వైపు రావడంతో దాన్ని తీసుకుని విసిరింది. అది 50 మీటర్ల దూరంలో ఉన్న స్టంప్స్‌‌ని తాకింది. అక్కడే ఉన్న భారత మాజీ బ్యాటర్ హేమలత కాలా ఆమె టాలెంట్‌‌ని గుర్తించి, ప్రోత్సహించింది. 

అప్పటినుంచి సుమిత్‌‌తో కలిసి దీప్తి కూడా క్రికెట్‌‌ ప్రాక్టీస్ చేసింది. ఆ తర్వాత సుమిత్ ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాడు. దాంతో దీప్తిని రోజూ స్టేడియంకి తీసుకెళ్లేవాళ్లు లేక ప్రాక్టీస్‌‌ మానేసింది. కానీ.. ఆ తర్వాత చెల్లి కోసం సుమిత్‌‌ జాబ్ మానేసి రెండేళ్లపాటు రోజూ ప్రాక్టీస్‌‌కు తీసుకెళ్లాడు. అలా 2014లో ఇండియా క్రికెట్‌‌టీంలో చేరింది. 

అబ్బాయిలతో ఆడి.. 

ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ సిమ్లాలోని పర్సా గ్రామంలో  పుట్టింది. తండ్రి కేహర్ సింగ్ ఠాకూర్‌‌‌‌ ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు  క్రికెట్‌‌ అంటే చాలా ఇష్టం. రేణుకాకు మూడేండ్లు ఉన్నప్పుడు అతను చనిపోయాడు. దాంతో కుటుంబాన్ని పోషించడానికి తల్లి సునీత అతని ఉద్యోగంలో చేరింది. ఆదాయం అంతంత మాత్రంగానే వచ్చినా కూతురికి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంది. తండ్రి లాగే రేణుకకు కూడా క్రికెట్‌‌ అంటే ఇష్టం. అందుకే తన అన్న వినోద్‌‌తో కలిసి క్రికెట్‌ ఆడేది. 

ఆమెకు క్రికెట్‌‌మీదున్న ఇష్టాన్ని గమనించిన రేణుక మామ భూపిందర్ సింగ్ ఠాకూర్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే ఉమెన్స్ రెసిడెన్షియల్ అకాడమీలో ట్రయల్స్‌‌కు వెళ్లాలని సలహా ఇచ్చాడు. అక్కడే ఆమె తన ఆటను మెరుగుపరుచుకుంది. ఆ తర్వాత భారత జట్టులో చేరే అవకాశం వచ్చింది. 

జుట్టు కత్తిరించుకుని..

హర్యానాలోని రోహతక్‌‌లో పుట్టిన షఫాలీ వర్మ.. వాళ్ల ప్రాంతంలో క్రికెట్‌‌ ఆడే అమ్మాయిలు లేకపోవడంతో అబ్బాయిలతో ఆడాలి అనుకుంది. “గ్రౌండ్‌లో నా పేరు షఫాలీ అని చెప్పగానే ‘ఇది అబ్బాయిలు ఆడే ఆట, వెళ్లి గుడియా ఆడుకో’ అని ఎగతాళి చేసేవాళ్లు. అందుకే నా జుట్టును కత్తిరించుకుని, మా అన్నలా షార్ట్స్ వేసుకుని అతని స్థానంలో ఆడేదాన్ని” అని తాను ఎదుర్కొన్న సమస్యలను చెప్పింది షఫాలీ. ఆమె తండ్రి సంజీవ్ వర్మ రోహతక్‌‌లో బంగారం షాప్ నడిపేవాడు. 

షఫాలీకి పదేండ్లు ఉన్నప్పుడు క్రికెట్‌‌ ప్రాక్టీస్​కి వెళ్లాలంటే రోజూ 40 కి.మీ. ప్రయాణించాల్సి వచ్చేది. దాంతో ఆమె కోసం సంజీవ్‌‌ తన దుకాణం మూసేసి ఆటో నడపడం మొదలుపెట్టాడు. ఆదాయం తగ్గి, ఇల్లు నడవడం కష్టమైంది. అయినా కూతురి కోసం ఆ కష్టాలన్నీ ఓర్చుకున్నాడు. హర్యానాలో 2014 వరకు అమ్మాయిల అండర్‌‌‌‌ –-14 జట్టు లేదు. దాంతో షఫాలీని బాయ్స్ అకాడమీలో చేర్చారు. 11 ఏండ్ల వయసులో ఆమె 15 ఏండ్ల అబ్బాయిలతో ఆడేది. అలా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇండియా టీంలో స్థానం సంపాదించుకుంది.  

క్రికెట్ గేర్‌‌ అద్దెకు తెచ్చుకుని..

రాధా ప్రకాష్ యాదవ్ పశ్చిమ ముంబైలోని కందివళి వెస్ట్‌‌లో పుట్టింది. తల్లిదండ్రులు, ఇద్దరు అన్నలు, అక్కతో సహా మొత్తం తొమ్మిదిమంది ఒక చిన్న ఇరుకైన (225 స్క్వేర్ ఫీట్) ఇంట్లోనే ఉండేవాళ్లు. తండ్రి ఓంప్రకాష్ రోడ్డు మీద కూరగాయలు, పాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆమె క్రికెట్‌‌ ట్రైనింగ్‌‌ కోసం ఫీజు కట్టే స్తోమత కూడా లేదు. 

దాంతో వాళ్ల గల్లీలోనే ప్రాక్టీస్‌‌ చేసేది. రాధ కంటే తన అక్క సోనీ మంచి ప్లేయర్. కానీ, వాళ్ల ఫ్యామిలీకి ఇద్దరిని క్రికెటర్లను చేసే స్తోమత లేకపోవడంతో తన కెరీర్‌‌‌‌ని త్యాగం చేసింది. రాధ కూడా మొదట్లో క్రికెట్ గేర్‌‌ అద్దెకు తెచ్చుకుని ప్రాక్టీస్‌‌ చేసేది. 

తల్లి నగలు అమ్మి..

మధ్యప్రదేశ్‌‌లోని ఛతర్‌‌పూర్ జిల్లాలోని ఘువారాలోని ఒక గిరిజన కుటుంబంలో పుట్టింది క్రాంతి గౌడ్‌. తండ్రి మున్నా సింగ్ గౌడ్ కానిస్టేబుల్‌‌ ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. దాంతో అన్నలు డైలీ వేజ్ లేబర్, బస్ కండక్టర్‌‌గా పని చేశారు. ఆమెకు  చిన్నప్పటినుంచి క్రికెట్‌‌ అంటే ఇష్టం. 

గల్లీలో చిన్నప్పుడు బంతి విసిరితే అబ్బాయిలు తిరిగి రాళ్లు రువ్వి హేళన చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల 8వ తరగతితోనే చదువు మానేసింది. అప్పటినుంచి క్రికెట్‌‌పై ఫోకస్‌‌ పెట్టింది. ఒక దశలో క్రాంతి కలలను సాకారం చేసుకోవడానికి తన తల్లి నగలను కూడా అమ్మేసింది.  

ఏకైక ప్లేయర్‌‌‌‌

అస్సాంలోని కందులిమారి గ్రామంలో పుట్టింది ఉమా చెత్రీ. తండ్రి లోక్ బహదూర్ చెత్రీ చిన్న రైతు. ఉమా ఎంఎస్‌‌ ధోని అభిమాని. అందుకే ఆయనలాగే వికెట్ కీపర్​ కావాలి అనుకుంది. 8 ఏండ్ల వయసులోనే తన అన్న విజయ్‌‌తో కలిసి క్రికెట్‌‌ ఆడేది. రోజూ 16 కి.మీ. సైకిల్ తొక్కుతూ బొకాఖాత్ ట్రైనింగ్ సెంటర్‌‌కి వెళ్లేది. ‘‘ఒకసారి మా ప్రాంతంలో వచ్చిన వరదలు నా షూని తీసుకెళ్లాయి. కానీ, నా కలల్ని తీసుకెళ్లలేకపోయాయి” అంటుంది ఉమా. షూ లేకున్నా క్రికెట్‌‌ ప్రాక్టీస్‌‌ చేసి భారత జట్టులో స్థానం సంపాదించింది. 2025 మహిళల ప్రపంచ కప్ జట్టులో ఈశాన్య భారతదేశం నుంచి పాల్గొన్న ఏకైక ప్లేయర్‌‌‌‌ ఆమెనే. 

ప్లాస్టిక్ బ్యాట్​తో ప్రాక్టీస్​

కడప జిల్లా ఎర్రమల్లెపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి మూడో తరగతిలో ఉన్నప్పుడు క్రికెట్‌‌ ఆడడం మొదలుపెట్టింది. తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌‌లో ఉద్యోగి. మామ కిషోర్ కుమార్ రెడ్డి పార్ట్-టైమ్ క్రికెటర్. అతనే శ్రీ చరణికి క్రికెట్‌‌ని పరిచయం చేశాడు. మామతో కలిసి ఇంట్లో ప్లాస్టిక్ బ్యాట్‌‌లతో ఆడుకునేది. 

ఆ తర్వాత అతనితో పాటు క్వార్టర్స్‌‌లోని గ్రౌండ్‌‌కి వెళ్లడం మొదలుపెట్టింది. తన కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆటగాళ్లతో పోటీ పడేది. అలా భారత జట్టులో చేరి వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల్లో అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంది. మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసింది.  టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది.