న్యూఢిల్లీ: ఆసియా కప్ ట్రోఫీ వివాదం త్వరలోనే సమసిపోతుందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అన్నాడు. ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా ఇరుదేశాల బోర్డులు కృషి చేస్తున్నాయని ఐసీసీ బోర్డు మీటింగ్ సందర్భంగా వెల్లడించాడు. ‘నేను ఐసీసీ అనధికార, అధికారిక సమావేశంలో పాల్గొన్నా. పీసీబీ నుంచి మోహిసిన్ నఖ్వీ కూడా హాజరయ్యాడు. అధికారిక సమావేశం, ఎజెండాలో లేకపోయినా ఐసీసీ సీనియర్ ఆఫీస్ బేరర్స్ సమక్షంలో ఆసియా కప్ ట్రోఫీ గురించి చర్చించాం. ఈ సమావేశం విడిగా జరిగింది. చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో కచ్చితంగా సానుకూల ఫలితం వస్తుంది.
వీలైనంత త్వరగా ట్రోఫీ ఇండియాకు వస్తుంది’ అని సైకియా పేర్కొన్నాడు. ఐసీసీ అధికారుల పేర్లు బహిర్గతం చేయకపోయినా.. డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, సీఈవో సంజోగ్ గుప్తా.. సైకియా, నఖ్వీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సమస్యను పరిష్కరించేందుకు రెండు వైపుల నుంచి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెప్పిన సైకియా.. ఐసీసీ ద్వారా వివాద పరిష్కార కమిటీ ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలను తోసిపుచ్చాడు. ఐసీసీ కఠిన చర్యలకు దిగక ముందే ఈ వివాదం పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇండియాలో విమెన్స్ వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు బీసీసీఐని ఐసీసీ బోర్డు డైరెక్టర్లు అభినందించారని వెల్లడించాడు.
