ప్రపంచ దేశాల్లో భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. 73, 74 రాజ్యాంగ సవరణలతో స్థానిక పాలన ప్రజల చెంతకు చేరింది. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ రెండు శాఖలు చాలా వరకు ప్రజలకు అందుబాటులోనే ఉన్నా యి. కానీ, మరో కీలకమైన శాఖ జ్యుడీషియరి దేశ ప్రజలందిరికీ సమానంగా అందుబాటులో ఉందా ? దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉండడం వల్ల ఈ ప్రశ్న తలెత్తుతోంది. దేశంలోని పలు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా, దక్షిణాదివారు తమ హక్కుల సాధన కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.
రాష్ట్రాల రాజధానుల పరంగా చూస్తే తెలంగాణ నుంచి ఢిల్లీ 1,506 కి.మీ దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 1,700 కి.మీ, కర్నాటక నుంచి 2,073 కి.మీ, తమిళనాడు నుంచి 2,118 కి.మీ, కేరళ నుంచి 2,574 కి.మీ. దూరంలో ఢిల్లీ ఉంది. వందలాది కి.మీ. దూరంలో ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు సుప్రీంకోర్టుకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది కేవలం ప్రయాణ సమస్య మాత్రమే కాదు, అందరికీ సమన్యాయం అందించాలనే రాజ్యాంగ లక్ష్య సాధనకు సైతం విఘాతం కలిగిస్తోంది.
2006 నుంచి 2011 వరకు సుప్రీంకోర్టులో నమోదైన అప్పీళ్లపై సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో పనిచేసే ఉన్నత స్థాయి నిపుణుడు నిక్ రాబిన్సన్ చేసిన అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఢిల్లీకి దగ్గర ఉన్న రాష్ట్రాలతో పోల్చిచూస్తే, దూరంగా ఉన్న రాష్ట్రాల ప్రజలు చాలా తక్కువగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తున్న విషయం అధ్యయనంలో వెల్లడైంది. ఢిల్లీ హైకోర్టు కేసులపై అప్పీల్స్ 9.4 శాతం కాగా, పంజాబ్, హర్యానా హైకోర్టు కేసులపై 7.4 శాతం, ఉత్తరాఖండ్ హైకోర్టు కేసుల్లో 5.8 శాతం కేసులు అప్పీల్ చేస్తున్నారు. దక్షిణ భారతదేశం నుంచి దాఖలయ్యే అప్పీళ్ల శాతం చాలా స్వల్పంగా ఉంది. ఉమ్మడి ఏపీ, కర్నాటక హైకోర్టు కేసుల్లో 2.9 శాతం చొప్పున, కేరళ హైకోర్టు కేసుల్లో 2 శాతం, తమిళనాడు హైకోర్టు కేసుల్లో కేవలం 1.1 శాతం మాత్రమే అప్పీల్ చేస్తున్న విషయం ఆ స్టడీలో బయటపడింది.
ఒడిశా హైకోర్టు కేసుల్లో మరీ అత్యల్పంగా కేవలం ఒక్క శాతం మాత్రమే అప్పీల్ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల ప్రజలు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలంటే భారీ ఖర్చులు, సమయం, మరియు మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోంది. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఢిల్లీ ప్రయాణం, నివాసం, న్యాయవాదుల ఖర్చులు భరించడం కష్టంగా మారింది. ఈ నిస్సహాయత కారణంగా అనేకమంది తమ హక్కుల కోసం పోరాడే అవకాశాన్ని వదులుకుంటున్నారని స్పష్టమవుతున్నది. ఈ అసమానతను తొలగించడానికి దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడమే తగిన పరిష్కారం.
లా కమిషన్ సిఫారసు
ఇండియన్ లా కమిషన్ తన 229వ నివేదిక (2009)లో దేశంలో నాలుగు ప్రాంతీయ సుప్రీం కోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని, వాటిలో ఒకటి దక్షిణ భారత బెంచ్ చెన్నై లేదా హైదరాబాద్‌లో ఉండాలని పేర్కొంది. అదేవిధంగా, పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ లా అండ్ జస్టిస్‌పై 2022లో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా రీజినల్ సుప్రీం బెంచెస్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. దక్షిణాది రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ సౌత్ ఇండియాలో సుప్రీం బెంచ్ పెట్టాలని 2021 జులైలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని లిఖితపూర్వకంగా అభ్యర్థించాయి.
ఆర్టికల్ 130 ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త బెంచెస్ ఏర్పాటు చేయవచ్చు. దీనికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు. కేవలం పరిపాలనా పరమైన నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. సుప్రీం కోర్టులో ప్రస్తుతం 70,000కి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రాంతీయ బెంచ్‌లు ఏర్పాటు చేస్తే కేసులు వేగంగా పరిష్కారం అవుతాయి. సుప్రీంకోర్టు కేవలం రాజ్యాంగ వ్యవహారాలపైనే కేంద్రీకృతమై, అప్పీల్ కేసులు రీజినల్ బెంచ్‌ల ద్వారా పరిష్కారమైతే, దేశ ప్రజలందరికీ జ్యుడీషియరీ అందుబాటులోకి రావడమే కాకుండా, కేసుల పెండెన్సీ సైతం తగ్గుతుంది.
హైదరాబాద్ అనుకూలతలు
హైదరాబాద్ దేశంలోనే అత్యాధునిక మౌలిక సదుపాయాలు కలిగిన నగరాల్లో ఒకటి. ఇప్పటికే ఉన్న హైకోర్టు, నేషనల్ లా యూనివర్సిటీ, అనుభవజ్ఞులైన న్యాయ నిపుణులు, అంతర్జాతీయ కనెక్టివిటీ ఇవన్నీ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహజ అనుకూలతలు. పైగా హైదరాబాద్ భౌగోళికంగా దక్షిణ భారతానికి మధ్యలో ఉండడం ఈ బెంచ్ ఏర్పాటుకు సరైన సిటీగా నిలుస్తుంది. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్‌కు సులభంగా చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి.
సౌత్ ఇండియా బార్ అసోసియేషన్లు, న్యాయవాదులు, పౌరసంఘాలు సుప్రీం బెంచ్ కోసం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్స్ పలుమార్లు లేఖల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు గౌరవించాల్సిన అవసరం ఉంది. వర్చువల్ హియరింగ్స్ కొంతవరకు సౌకర్యం కలిగించినా, అన్ని కేసులకు అది సరిపోదు. ప్రత్యక్ష విచారణ అవసరమయ్యే క్రిమినల్, రాజ్యాంగ అంశాలపై భౌతిక బెంచ్ తప్పనిసరి. హైదరాబాద్‌లో సుప్రీం బెంచ్ ఏర్పాటే శాశ్వత పరిష్కారం.
హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం భారత న్యాయవ్యవస్థలో చారిత్రాత్మక నిర్ణయంగా నిలుస్తుంది. ఇది కేవలం సౌకర్యం మాత్రమే కాదు. సమానత్వం, సమాఖ్యత, సమన్యాయం అనే రాజ్యాంగ విలువలను నిలబెట్టే చర్య. కేంద్ర ప్రభుత్వం తక్షణమే హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు సర్క్యూట్ బెంచ్ ఏర్పాటుకు ఆమోదం ఇవ్వాలి.
సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ ఢిల్లీలో కొనసాగించాలి. అప్పీల్ కేసులు హైదరాబాద్ బెంచ్‌లో వినాలి. లా కమిషన్ సిఫార్సులను అమలు చేయడంలో కేంద్రం ముందడుగు వేయాలి. న్యాయం ఢిల్లీ గడప దాటి, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమంగా అందుబాటులోకి రావాలి. రీజినల్ సుప్రీం బెంచెస్ ఏర్పాటు చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. అప్పుడే భారత్ ఫెడరల్ స్ఫూర్తి పరిఢవిల్లుతుంది.
మానేటి ప్రతాపరెడ్డి, అడ్వకేట్
