ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే ఆదివాసులు నివసించే అటవీ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. అందువల్ల ప్రభుత్వం తక్షణమే ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత 2018లో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత 2024 మెగా డీఎస్సీ పేరుతో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య 11,062 ఉండగా 2,79, 956 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఒక్క పోస్ట్ కు 26 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 6 సెప్టెంబరు 2023 నాటికి ఏజెన్సీ ప్రాంతంలో 5,089 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీని పక్కన పెట్టిన పాలకులు 22 ఏప్రిల్ 2020 సంవత్సరం సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ను కొట్టివేసిందని సాకు చెబుతూ అర్హులైన స్థానిక ఆదివాసీ నిరుద్యోగ యువతకు దక్కవలసిన ఉపాధ్యాయ ఉద్యోగాలు గిరిజనేతర్లతో భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో భర్తీ చేయవలసిన 5,089 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన స్థానిక ఆదివాసీ నిరుద్యోగ యువత ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది.
ఉపాధ్యాయుల కొరత
ఏజెన్సీ ప్రాంతంలోని ప్రైమరీ పాఠశాలలు ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కూల్స్ సంఖ్య 2,311 ఉండగా ట్రైబల్ రెసిడెన్షియల్, ఆర్ఎస్, ఆర్ జేసీ, జీఎం స్కూల్స్ మొత్తం 165 ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతతో నడుస్తున్నాయి. కొన్నిచోట్ల ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులకు బోధిస్తున్న పరిస్థితి ఉంది. ఇది విద్యా ప్రమాణాలను తగ్గిస్తోంది. విద్యార్థులు సరైన మార్గదర్శకత్వం పొందలేకపోతున్నారు. ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ ద్వారా అర్హత కలిగిన స్థానిక ఆదివాసీ అభ్యర్థులను నియమిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఆదివాసీ ప్రాంతాల్లో విద్యార్థులు భాషా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రవాణా సౌకర్యాల లోపం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. స్థానిక భాష, సంస్కృతి తెలిసిన ఉపాధ్యాయులు ఉంటే విద్యార్థులకు బోధన సులభంగా అర్థమవుతుంది. దీంతో చదువు మానివేతలు తగ్గి, ఉన్నత విద్యకు అవకాశాలు పెరుగుతాయి. బీఈడీ, టీటీసీ పూర్తిచేసిన స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది వారి ఆర్థికస్థితిని మెరుగుపరచడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుంది. స్థానికులు ఉద్యోగాలు పొందితే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి
వేగవంతమవుతుంది.
గిరిజన సంక్షేమం ప్రభుత్వ బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలి. రాజ్యాంగం కూడా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక రక్షణ కల్పించింది. అందువల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను గుర్తించి, ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ఆదివాసీ నిరుద్యోగ యువత కోరుతున్నారు. మన పక్క రాష్ట్రమైన ఏపీలో ఎన్నికల్లో ఆదివాసీ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సుప్రీంకోర్టు కొట్టివేసిన జీవో నెంబర్ 3ను పునరుద్ధరించి ఏజెన్సీ ప్రాంతాలలోని ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రత్యేక ఏజెన్సీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగ ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మొత్తానికి ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ అత్యవసరం. ఇది ఆదివాసీ విద్యార్థుల భవిష్యత్తును ప్రకాశవంతం చేయడమే కాకుండా ఆదివాసీ సమాజ అభివృద్ధికి బాటలు వేస్తుంది. ప్రజా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అర్హులైన ఆదివాసీ నిరుద్యోగ యువత కోరుతున్నారు.
- డా. సాగబోయిన పాపారావు
