ఒకనాడు 120 రోజులకు పైగా జరిగే పార్లమెంట్ సమావేశాలు నేడు కీలకమైన బడ్జెట్‌పై ప్రధాని మాట్లాడకుండానే లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై చర్చ సాగడం తీవ్ర అవాంఛనీయం. ఏకంగా దీనికి సాక్షాత్తు భారతదేశ ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యులనే తీవ్రవాదుల్లా... అమానవీయ శక్తులుగా చిత్రీకరిస్తూ, వారి నుంచే ముప్పు పొంచి ఉందని చెప్పడం మరింత హాస్యాస్పదం. గతంలో మునుపెన్నడూ లేని రీతిలో ఎంపీలను, అందునా మహిళా ఎంపీలను ఇంతలా ప్రధాని స్థాయి వ్యక్తి అవమానించడం దురదృష్టకరం. ఇందుకోసం స్పీకర్ నేరుగా పార్లమెంటుకు ప్రధాని వస్తే భద్రతకు ఎంపీల నుంచే ముప్పు ఉందని, మూకదాడికి ఆస్కారం ఉందని నివేదికలు వచ్చాయని అదే పార్లమెంట్ వేదికగా చెప్పడం ఆ ఎంపీల హక్కులను కాలరాయడం కాదా? పార్లమెంటుకు ప్రధాని సమాధానం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అందుకే ప్రతిపక్ష నేతగా రాహుల్ వాదనలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యున్నతమైన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశం పరువును ఎంతలా దిగజారుతుందో అధికార పక్షం పట్టించుకోకపోవడం పెద్ద విషాదం. ఇదంతా ఒకవైపైతే దాదాపు 40 శాతం దేశానికి ప్రతినిధిగా లోక్ సభలో ప్రతిపక్ష నేతగా, పార్లమెంటుకు రెండో స్థానమైన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్థానంలో ఉన్న రాహుల్ గాంధీని తమ తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏకంగా సభ నుంచి అనర్హుణ్ని చేయాలనే తీర్మానం ఇవ్వడం పరాకాష్ట. అడుగడుగునా పార్లమెంటు లోపల రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చూసి కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో పెరుగుతున్న భయాందోళనలకు ఇది స్పష్టమైన సంకేతం.
ప్రజల హక్కులు ధారాదత్తం
జనవరి 28న ప్రారంభమైన సభలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలను నిష్కారణంగా సస్పెండ్ చేయడంతో దాన్నుంచి బయటపడేందుకే అన్నట్లుగా అడుగడుగునా రాహుల్ గాంధీ నిలదీసి ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏకంగా అతనిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. కానీ రాహుల్ గాంధీ ఇచ్చిన అడ్జోర్న్మెంట్ మోషన్స్ పై కనీసచర్చకు కూడా ఆస్కారం ఇవ్వడం లేదు. ఎందుకంటే, యావత్ దేశ రైతాంగం పక్షాన, మధ్యతరగతి పక్షాన, దేశానికి ఆయువుపట్టులాంటి చిన్న, మధ్యతరహా పరిశ్రమలైన ఎంస్ఎంఈల పక్షాన... రాహుల్ గాంధీ ఇస్తున్న వాయిదా తీర్మానాలు చర్చకు వస్తే ప్రభుత్వం వాణిజ్య ఒప్పందాల మాటున మతలబులు బట్టబయలౌతుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేర నడుస్తున్న ప్రహసనంలో దేశ ప్రజల హక్కుల్ని ఎలా అగ్రరాజ్యం ఎదుట ధారాదత్తం చేశారో తేటతెల్లమౌతుంది. కేవలం తమకోసం పనిచేసే కొందరు కార్పొరేట్ శక్తులకు మేలు చేయడం కోసం.. రాహుల్ గాంధీ అన్నట్టు మన భరత మాతను ఎలా విదేశీ శక్తులకు కట్టబెట్టారో అర్థమయ్యేది. ఇప్పటికే ఓ వైపు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేక యావత్ రైతాంగం కుదేలై పోతుంటే. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు, ఈ అమెరికా మధ్యంతర ఒప్పందం ఆ దేశ ఉత్పత్తులపై సుంకాన్ని జీరో శాతానికి తేవడం అంటే.. ఇక్కడి చిన్న, సన్నకారు వ్యవసాయదారుల్ని, వ్యాపారుల్ని రోడ్డున పడేయడమే. దీన్నే రాహుల్ గాంధీ బలంగా ప్రశ్నిస్తున్నారు. నిన్నటిదాకా మోదీని నమ్మినవారు సైతం రాహుల్ వాదనలను సమర్థించడం చూస్తే.. దేశ రాజకీయాల్లో మార్పు మొదలైందని చెప్పొచ్చేమో!
యావత్ సమాజం గమనిస్తోంది
ఇలా దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన పార్లమెంట్ చర్చలు ఇంత పక్కదారి పట్టడం దేశ ప్రజల్ని బాధపెడుతోంది. ప్రధాన చట్టాలకు చర్చలు లేకుండా ఆమోదం పొందడం, ఈ 13 రోజుల్లో దాదాపు రోజుకు ఆరుగంటలపాటు నడిచినా 80 గంటల పాటు నడవాల్సిన లోక్‌సభ కేవలం 40 గంటలకు మించకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపింది. అటు రోజులపరంగా చూసినా సగానికి అటు ఇటుగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి నడిపిస్తోంది. ఇలా తమ వైఫల్యాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ప్రధాని మోదీ మొదలు ఆయన మంత్రివర్గ సహచరులతో పాటు అధికార ఎంపీలు సైతం రాహుల్ గాంధీపై విరుచుకుపడుతూ ఎదురు దాడి చేస్తున్నారు. ఈ తతంగాన్ని యావత్ సమాజం గమనిస్తోంది.
ప్రజల విశ్వసనీయతే కీలకం
అమెరికాతో ఒప్పంద నిర్ణయం చాలా పెద్దది. పార్లమెంటు విశ్వాసం తీసుకోవాల్సింది. కానీ అది జరగలేదు. అమెరికాతో ట్రేడ్ డీల్‌ను ట్రంప్ ప్రకటిస్తేగానీ దేశ ప్రజలకు తెలియదు. కీలకమైన విషయాల్లో ఈ దేశ ప్రతిపక్ష నేతను విశ్వాసంలోకి తీసుకోవడం అవసరం. కానీ అలా జరగడంలేదు. సంఖ్యా బలాన్ని చూసుకొని దేశ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం సరికాదు, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అడుగుతున్నది, ఎదిరిస్తున్నది ఆ విషయంలోనే! ఎన్నుకున్న ప్రజల పట్ల మోదీ విశ్వాసంగా పనిచేయడంలేదని చాలా కాలంగా రాహుల్ గాంధీ చెపుతూ వస్తున్నారు. ఇపుడు దాన్నే రాహుల్‌గాంధీ ఈ దేశ ప్రతిపక్షనేతగా ప్రజల పక్షాన నిలదీస్తున్నారు. మొతంమీద రాహుల్ గాంధీ వాదనలకు దేశంలో విస్తృతంగా మన్ననలు లభిస్తున్నాయనడంలో సందేహం లేదు.
ఎప్స్టీన్ ఫైల్స్‌పై చర్చించాలిఈ దేశ యువత, వ్యవసాయ,చిరు వ్యాపారుల పక్షాన రాహుల్ నిలబడుతున్నందుకు అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలనే తీర్మానాన్నే సభలో పెట్టేవరకూ ఈ కేంద్ర ప్రభుత్వం వెళ్లడం విచారకరం. మనందరం ఈ అంశాలపై నిరసనను తెలియజేసే సందర్భమిది. ఇంతచేసినా... అమెరికా నేడు భారతదేశాన్ని తమ సంపూర్ణ మిత్రదేశంగా ప్రకటించడం లేదు. వాణిజ్య ఒప్పందం కోసం రష్యాతో చమురు కొనుగోళ్లు తగ్గించినా అమెరికా నేడు మనల్ని పాకిస్తాన్‌తో సమానంగా చూడడం దురదృష్టకరం. ఇదెందుకో దేశంలోని ప్రతీ బుద్ధిజీవి ఆలోచించాలి. అంతర్జాతీయంగా అమానవీయమైన పనులు చేసిన ఏప్స్టీన్ ఫైల్స్‌పై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. దీన్ని ఓటేసిన ప్రతి ఒక్కరం బాధ్యతగా ప్రశ్నించాలి. ప్రతిపక్ష నేతగా మనకోసం నిలబడ్డ రాహుల్ గాంధీ బాధ్యత కూడా ఇదే కదా, ఆయన తన పనిని చేశారు. ఇప్పుడు ప్రధానిగా ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి ఎవరు తప్పించుకుంటున్నారో కూడా మనమంతా చూస్తున్నాం. ఇలా వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న ప్రభుత్వం చరిత్రలో మరోటి లేదు అని మేధావులు చెప్పుకుంటున్నారు. అందుకే రాహుల్ వాదనలకు విస్తృత మద్దతు లభిస్తోంది.
- బోదనపల్లి
వేణుగోపాల్ రెడ్డి,
సీఈవో, టిసాట్ నెట్వర్క్
