జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం.. అని చెప్పడానికి బలమైన కారణాలు ఇవే !

జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం.. అని చెప్పడానికి బలమైన కారణాలు ఇవే !

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు ఎన్ని గారడీలు చేసినా అక్కడ  గెలిచేది అధికార కాంగ్రెస్ పార్టీనే.   మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నట్లుగా సానుభూతికి  ఓట్లు పడవనేది గతంలో జరిగిన కంటోన్మెంట్,  ఇతర ఉపఎన్నికల ఫలితాలు నిరూపించాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ..  2024 జూన్​లో  వెలువడిన కంటోన్మెంట్‌ ఫలితామే  కచ్చితంగా పునరావృతమవుతుంది.

కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలవటానికి బలమైన కారణాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ సర్కారు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 3.98 లక్షల  ఓటర్లు ఉన్నారు. ఇందులో సుమారు లక్ష  కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నాయి. 

ఈ నియోజకవర్గంలో పదేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కానీ,  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 23 నెలల పాలనలో  కాంగ్రెస్ ప్రభుత్వం 14,197 మందికి  కొత్త రేషన్​కార్డులు మంజూరు చేసింది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఉన్న రేషన్​కార్డుల్లో 8,123 మందిని కొత్తగా చేర్చటం జరిగింది.  రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెల 23,311 క్వింటాళ్ళ సన్నబియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జూబ్లీహిల్స్​లో  శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో అదే అన్నాన్ని సామాన్యులు, బస్తీ ప్రజలు తింటున్నారు.

కాంగ్రెస్ నాయకులకు బ్రహ్మరథం  
రేషన్​కార్డు అనేది పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక. పైగా ఒక్క రేషన్​కార్డు పేదలను పలు సంక్షేమ పథకాలకు అర్హులను చేస్తుంది. పేదవారి రేషన్​కార్డు కలను నిజం చేసిన రేవంత్ రెడ్డి  కాంగ్రెస్  సర్కారు మాకు దైవంతో సమానం అని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీ ప్రజలు ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన కాంగ్రెస్  నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 10 లక్షల మందికి పైగా ఉచిత బస్సు పథకం ద్వారా లబ్ధి పొందారు. వీరు ప్రయాణాల  ద్వారా రూ.130 కోట్ల వరకు తమ  డబ్బులు  ఆదా చేసుకున్నారని టీజీఎస్ఆర్టీసీ గణాంకాలు  తెలుపుతున్నాయి. 

ఇక ఈ నియోజకవర్గంలో 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం ద్వారా 25,925 కుటుంబాలు లబ్ధి  పొందుతున్నాయి. రూ.500లకే  గ్యాస్  సబ్సిడీ సిలిండర్ల పథకం ద్వారా 19,658 కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది.  వీరంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులు అందుకుంటున్న వారు, ఆసరా పెన్షన్లు, ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 10 లక్షల వరకు  లబ్ధి పొందుతున్న  కుటుంబాల దీవెనలు ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి.  బీసీవాదం బలంగా వినిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డ నవీన్ యాదవ్​ను బరిలో  దింపటం కాంగ్రెస్ పార్టీకి  కలిసొచ్చే మరొక  అంశం. ఈ  నియోజకవర్గంలో  కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా ఉంది.

కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 35 వేల నుంచి 60వేల వరకు స్థిరమైన ఓటు బ్యాంకును కలిగి ఉంది.  ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీల ఓట్లు అధికంగా ఉన్నాయి. అదేవిధంగా మైనారిటీ ఓట్లు 1,30,000 వరకు ఉన్నాయి.  ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్​కి మద్దతు ప్రకటించింది.  బీసీ బిడ్డ నవీన్ యాదవ్​కు  బీసీలు,   మైనారిటీలతో పాటు  కాంగ్రెస్ బలంగల ఓటు బ్యాంకు తోడైంది.  కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ  గెలుపు ఖాయం అని తేలిపోయింది.  

ఉప ఎన్నికలు ఎప్పుడూ నూటికి 99 శాతం అధికార పార్టీలకే అనుకూలంగా ఉంటాయి. గతంలో టీఆర్ఎస్/బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2015 నారాయణ్ ఖేడ్  కాంగ్రెస్ ఎమ్మెల్యే  పటోళ్ల కిష్టారెడ్డి  చనిపోయినప్పుడు, 2016 పాలేరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చనిపోయినప్పుడు  సానుభూతి  పనిచేయలేదు. అప్పుడు అక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 

కాంగ్రెస్  ఎమ్మెల్యే  రాజగోపాల్ రెడ్డి  రాజీనామాతో  వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల్లో సైతం అధికార బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది.  నాగార్జున సాగర్​లో  నోముల  నర్సింహయ్య  మృతితో వచ్చిన ఉపఎన్నికలో కూడా సానుభూతి చూడకుండా అధికార బీఆర్ఎస్​ను  అక్కడి  ప్రజలు  గెలిపించారు.  దుబ్బాకలో  హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి చెందింది.  దుబ్బాకలో  బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలిచారు.  

అభివృద్ధికే ఓటు
2020లో జరిగిన  దుబ్బాక ఉపఎన్నికలో బీఆర్ఎస్  కేవలం 1,079 స్వల్ప ఓట్లతో  ఓడిపోయింది.  హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల  రాజేందర్​పై  నాటి అధికార  బీఆర్ఎస్ ఓడిపోయింది.  కాబట్టి  ఉపఎన్నికల్లో అధికారంలో  ఉన్న పార్టీకి  ఓటు వేయటం వల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలు ఆలోచించి అధికార పార్టీకి ఓటు వేస్తారు.  అదేవిధంగా రేపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో  కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు గెలిపిస్తారు. పదేళ్లు అధికారంలో ఉండి  జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి  చేయకుండా రాష్ట్రాన్ని లూటీ చేసిన అవినీతి  బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో అక్కడి ప్రజలు తప్పక తిరస్కరిస్తారు.

8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకి బీజేపీ  నయాపైసా ఇవ్వలేదు.   జూబ్లీహిల్స్ నియోజకవర్గం కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి  ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్  పార్లమెంట్ పరిధిలో ఉన్నా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణకి నిధులియ్యని, యూరియా ఇవ్వని, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకి నిధులివ్వని,  బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించని,  బీసీల నోటికాడ ముద్ద 42% శాతం రిజర్వేషన్లను గుంజుకుంటున్న  బీజేపీకి  జూబ్లీహిల్స్ ప్రజలు  ఓట్లేయరుగాక వేయరు.  ఏ కోణంలో చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని స్పష్టమైంది. 

డా. కోటూరి మానవతా రాయ్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి