ఉన్నత విద్యకు కూడా వసతుల కొరత.. బడ్జెట్లో విద్యకు నిధులు పెంచండి

ఉన్నత విద్యకు కూడా వసతుల కొరత.. బడ్జెట్లో విద్యకు నిధులు పెంచండి

దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని డాక్టర్  దౌలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్ కొఠారి అన్న మాటలు అక్షరసత్యం. అందుకే మనం నేటి బాలలను రేపటి భావి భారత పౌరులుగా చూస్తాం. వారికి సరైన విద్య అందినప్పుడే రేపటి సమాజం బాగుంటుంది. అందుకే విద్యకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తూ రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో పొందుపరిచారు. 2002లో  86వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా 21వ ప్రకరణ ద్వారా చేర్చారు.

6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్య అందించాలని భారత పార్లమెంట్​  విద్యాహక్కు చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగానే  మిగిలిపోతున్నది.  పాలకులు విద్యపై వెచ్చించే ప్రతి రూపాయిని ఖర్చుగానే చూస్తున్నారు తప్ప.. భవిష్యత్​కు పెట్టుబడిగా, మానవ వనరుల సృష్టిగా భావించడం లేదు. అందుకే నానాటికీ ప్రభుత్వ విద్య కునారిల్లుతున్నది. గత డిసెంబర్​నెలలో  కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నివేదికే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరంలో..  ఒక్క విద్యార్థీ లేని  ప్రభుత్వ పాఠశాలలు 5,149 ఉన్నట్లు కేంద్ర విద్యా శాఖ పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. దీని ప్రకారం.. ఒక్క విద్యార్థీ లేని పాఠశాలలు దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2,081 ఉండటం  బాధాకరం. దేశంలోనే  ఇలాంటి  పాఠశాలలు  ఎక్కువగా ఉన్న జిల్లాల్లో  నల్గొండ (315 స్కూళ్లు) మొదటి స్థానంలో, రెండు, మూడు స్థానాల్లో మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(167), వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(135) జిల్లాలు ఉన్నాయి.

ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని లోతుగా విశ్లేషిస్తే.. సర్కారు బడికి పిల్లలు రావాలంటే.. ఉపాధ్యాయులు ఉండాలి, బడిలో క్లాస్​ రూమ్​, గ్రౌండ్, టాయిలెట్స్​, ఫర్నిచర్​,  విద్యుత్​ లాంటి కనీస మౌలిక వసతులు  ఉండాలి. ఒక విద్యార్థి ప్రభుత్వ బడికి రావడం వెనుక ఇలాంటి అన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి.  ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో టాయిలెట్లు అస్సలు లేని బడులు 2,763 ఉన్నాయి.  నిబంధనల మేరకు ప్రతి 80 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండాలి. బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించాలి.  కానీ,  దాదాపు 700 స్కూళ్లలో  బాలికలకు అసలు టాయిలెట్లు లేని పరిస్థితి  నెలకొంది. 

ప్రభుత్వం దృష్టికి గురుకులాల దుస్థితి
తాగునీరు వసతి,  విద్యుత్​ కనెక్షన్,  స్కావెంజర్​ లేని బడులు  కూడా వందల సంఖ్యలో ఉంటాయి.  గురుకులాల పరిస్థితి మరీ  దారుణంగా ఉంది.  రాష్ట్రంలో వెయ్యికిపైగా ఎస్సీ,  ఎస్టీ,  మైనార్టీ,  బీసీ  గురుకులాలు ఉన్నా.. వీటిలో  మెజార్టీ  గురుకులాలు  అద్దె భవనాల్లో  అరకొర  వసతుల  మధ్య  కొనసాగుతున్నాయి.  సకాలంలో  అద్దె  చెల్లించక ఓనర్లు  భవనాలకు తాళాలు వేసిన  సందర్భాలు అనేకం ఉన్నాయి.  తగిన నిధులు  కేటాయింపు లేకపోవడం వల్ల నాణ్యమైన ఫుడ్​ విద్యార్థులకు అందడం లేదు. అందుకే తరచూ ఫుడ్​ పాయిజన్  ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

బెల్లంపల్లి గురుకులంలో  విద్యార్థులు  ఫుడ్​ పాయిజన్​తో  హాస్పిటల్​ పాలైతే..  నేను స్వయంగా అక్కడికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. ఇలా నిధుల లేమి,  మౌలిక వసతుల కొరత,​ అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల దుస్థితిపై శాసనమండలి సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాను. అయినా సర్కారు సత్వర చర్యలకు పూనుకోలేదు. 

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం 2022లో ‘మన ఊరు. -మన బడి’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది.  కార్యక్రమం అయితే ప్రారంభించింది కానీ.. ఆశించిన స్థాయిలో నిధులు  మంజూరుకాక పనులు ఎక్కడికక్కడ నిలిచాయి.  చాలాచోట్ల కొత్త నిర్మాణాల కోసం పాత భవనాలు కూల్చారు. అలాంటి చోట కొత్త నిర్మాణాలు అందుబాటులోకి రాలేదు.  చాలా జిల్లాల్లో కాంట్రాక్టర్లకు  డబ్బులు అందక ఎక్కడికక్కడ 
నిలిచిపోయాయి. 

విద్యకు బడ్జెట్లో కేటాయింపులు పెరగాలి
రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేతబట్టిన తర్వాత.. ‘మన ఊరి  మన బడి’ కార్యక్రమాన్ని కొనసాగించకపోగా.. ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బడుల్లో చిన్న చిన్న  మైనర్​ రిపేర్లకు,  మరమ్మతులకు మాత్రమే నిధులు ఇస్తున్నది.  ఈ రెండు కార్యక్రమాల వల్ల చిన్న చిన్న మార్పులు తప్ప.. మౌలికంగా ప్రభుత్వ బడుల్లో జరిగిన ప్రగతి ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితి మారాలంటే విద్యకు బడ్జెట్​లో  కేటాయింపులు పెరగాలి.  నిధులు కేటాయించడమే కాదు.. వాటిని మెరుగ్గా ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నది.

1966లో ‘విద్య జాతీయ వికాసం/ జాతీయ విద్యాభివృద్ధి' అనే పేరుతో  డా. కొఠారి కమిషన్​ ఇచ్చిన రిపోర్ట్​ ప్రకారం  దేశ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6%  నిధులను విద్యకు కేటాయించాలి.  అదే రాష్ట్రాల్లో  అయితే బడ్జెట్​లో కనీసం 30 శాతం తగ్గకుండా బడ్జెట్​కేటాయించాలి.  అయితే,  రాష్ట్రస్థాయిలో  విద్యకు బడ్జెట్​ కేటాయింపుల విషయంలో జీఎస్డీపీ  చాలా తక్కువ ఉన్న రాష్ట్రాలు కూడా  తెలంగాణ కంటే ముందు ఉన్నాయి.  ఉత్తర ప్రదేశ్,  మహారాష్ట్ర,  తమిళనాడు  రాష్ట్రాలు  తెలంగాణ కంటే  విద్యకు ఎక్కువ కేటాయింపులు చేస్తుండగా.. బిహార్​, అస్సాం లాంటి చిన్న రాష్ట్రాలు సైతం బడ్జెట్​ లో 15 శాతానికి తగ్గకుండా అత్యధికంగా 22 శాతం వరకు నిధులు కేటాయిస్తున్నారు. 

ఉన్నత విద్యకు కూడా వసతుల కొరత
తెలంగాణ  రాష్ట్ర  గత  ఏడేండ్ల కేటాయింపులు చూస్తే.. 2019–20లో 6.77%,   2020–21లో 6.69%,  2021–22లో 6.78%,  2022–23లో 6.24%,  2023–24లో 6.57%,  2024–25లో 7.31%,  2025–26లో 7.57% ఎప్పుడూ 8% నిధులు విద్యకు కేటాయించింది లేదు. ఇలా సింగిల్​ డిజిట్​ కేటాయింపులతో  ప్రభుత్వ బడుల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు, లీకేజీలు, తరగతి గదుల్లో  ఫర్నిచర్,  సబ్జెక్టు టీచర్ల కొరత, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం,  ఆధునిక డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వంటి  సమస్యలు పరిష్కారానికి  నోచుకోవు. 

పాఠశాల విద్య పరిస్థితే ఇలా ఉంటే..  ఉన్నత విద్యకు కూడా  రాష్ట్ర  ప్రభుత్వం  బడ్జెట్లో  పెద్ద మొత్తంలో కేటాయింపులు  చేయడం లేదు. కొన్నిసార్లు  కేటాయింపులు జరిపినా..  నిధులు  మంజూరు కావడం లేదు. ఉన్నత  విద్యాశాఖ పరిధిలో 12 విశ్వవిద్యాలయాలున్నాయి. వాటికి ఆశించినస్థాయిలో నిధుల కేటాయింపు లేక.. కనీస వసతుల  కొరత వేధిస్తున్నది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీల్లో హాస్టళ్లు, టాయిలెట్స్​ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది. పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలైన ఘటనలు గత రెండేండ్లలో చాలా ఉన్నాయి.

18 శాతం నిధులైనా విద్యకు కేటాయించాలి
యూనివర్సిటీల్లో అభివృద్ధి పనులకు 2017–18 నుంచి ప్రత్యేకంగా కొన్ని నిధులు కేటాయిస్తున్నా.. వాటిలో సగం ఫండ్స్​ కూడా రిలీజ్​ చేయడం లేదు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఒక్కరూపాయి కూడా  ఇవ్వలేదు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.500 కోట్లు కేటాయించినా అందులో రూ.200.25 కోట్లే ఇచ్చారు. 2025–26లో యూనివర్సిటీలకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో  ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకి మినహా మిగతా వర్సిటీలకు పెద్దగా  నిధులు  మంజూరు కాలేదు. 

గతేడాది పాఠశాల విద్యకు రూ.19,464 కోట్లు, ఉన్నత, సాంకేతిక విద్యకు రూ.3,644 కోట్లు మొత్తం కలిపి.. రూ.23,108 కోట్లు(7.57%) ప్రభుత్వం బడ్జెట్​లో విద్యకు కేటాయించింది. ఈ నిధులు ఏ మూలకూ సరిపోలేదు. రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా  నియమించిన తెలంగాణ విద్యా కమిషన్​ రిపోర్టులోని మిగతా అంశాల మాట అటుంచినా.. ఆ కమిషన్​ సూచించినట్లుగా బడ్జెట్​లో కనీసం 18 శాతం నిధులైనా విద్యకు కేటాయించాల్సిన అవసరం ఉంది.

మల్క కొమరయ్య, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ openpage@v6velugu.com

  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.