హెచ్-1బీ వీసా.. లక్ష డాలర్ల అడ్డుగోడ తొలగినట్టేనా? అమెరికా కోర్టు తీర్పు ఏం చెబుతోంది..?

హెచ్-1బీ వీసా.. లక్ష డాలర్ల అడ్డుగోడ తొలగినట్టేనా? అమెరికా కోర్టు తీర్పు ఏం చెబుతోంది..?

అమెరికాలో వలస విధానాలపై చర్చ  జరిగినప్పుడల్లా  హెచ్-1బీ వీసా అంశం ముందుకు వస్తుంది.  ఉద్యోగాలు ముందుగా అమెరికా పౌరులకే దక్కాలనే వాదన ఒకవైపు ఉంటే,  ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించకపోతే అమెరికా తన ఆర్థిక, సాంకేతిక ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేదనే అభిప్రాయం మరోవైపు వినిపిస్తుంది. ఈ రెండు దృక్కోణాల మధ్యే అమెరికా వలస విధానం రూపుదిద్దుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో 2026 జూన్ 8న బోస్టన్  ఫెడరల్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.  

ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా దరఖాస్తులపై విధించిన ఒక లక్ష డాలర్ల అదనపు రుసుమును కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఇది కేవలం వీసా రుసుముకు సంబంధించిన నిర్ణయం మాత్రమే కాదు. అధ్యక్ష అధికారాల పరిమితులు, కాంగ్రెస్ పాత్ర,  ప్రపంచస్థాయి నైపుణ్యం, భారతీయ నిపుణుల భవిష్యత్తు వంటి అనేక అంశాలను  స్పృశించిన తీర్పు.  

ఈ చర్చ కొత్తది కాదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ప్రతిభను ఎంతగా ఆకర్షించిందో,  అదే స్థాయిలో దేశీయ ఉద్యోగాల రక్షణపై రాజకీయ చర్చలు కూడా కొనసాగుతున్నాయి. అందుకే హెచ్-1బీ  వీసా విధానంలో జరిగే ప్రతి మార్పు సాధారణ పరిపాలనా నిర్ణయంగా కాకుండా విస్తృత ప్రజా చర్చకు కారణమవుతోంది. 

హెచ్-1బీ వీసా అమెరికా ఆర్థికవ్యవస్థలో  కీలక సాధనం.  సమాచార  సాంకేతికత, కృత్రిమ మేధ, వైద్యం, పరిశోధన, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను అమెరికా సంస్థలు ఈ విధానం ద్వారా నియమించుకుంటాయి.  భారతీయులు ఈ వ్యవస్థలో అతిపెద్ద భాగస్వాములు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 2023లో ఆమోదమైన హెచ్-1బీ వీసా దరఖాస్తుల్లో దాదాపు మూడు వంతులు భారతీయులవే.  ముఖ్యంగా భారతీయ సమాచార సాంకేతిక రంగం ఎదుగుదలతో ఈ వీసా ప్రాధాన్యం మరింత పెరిగింది. 

అనేక కుటుంబాలకు ఇది ఉద్యోగ అవకాశం,  అంతర్జాతీయ వృత్తి అభివృద్ధికి మార్గంగా కూడా మారింది.  దీంతో ఈ విధానంపై వచ్చే ప్రతి నిర్ణయం భారతదేశంలో  కూడా ఆసక్తిగా గమనించడం జరుగుతోంది.  2025 సెప్టెంబర్ 19న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన సంఖ్య 10973పై  సంతకం చేశారు. అనంతరం కొత్త హెచ్-1బీ  వీసా దరఖాస్తులపై ఒక్కో ఉద్యోగి కోసం ఒక లక్ష డాలర్ల ప్రత్యేక రుసుము విధించే నిర్ణయం తీసుకున్నారు. 

అమెరికా ఉద్యోగాలను రక్షించడం, విదేశీ ఉద్యోగులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం ప్రకటించింది. కాగా సాంకేతిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఉన్న సమయంలో ప్రపంచ ప్రతిభకు అడ్డంకులు సృష్టించడం అమెరికా ప్రయోజనాలకు అనుకూలం కాదని పేర్కొన్నాయి. 

  • ట్రంప్​ నిర్ణయంపై సర్వత్రా ఆందోళన

ట్రంప్​ నిర్ణయం వెలువడిన  వెంటనే  వ్యాపారవర్గాలు, విశ్వవిద్యాలయాలు,  పరిశోధనా సంస్థలలో  ఆందోళన వ్యక్తమైంది.  ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని ఆకర్షించడంలో అమెరికా బలహీనపడే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వినిపించాయి. ఇదే వివాదం చివరకు కోర్టు గడప చేరడానికి దారి తీసింది.  కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా నేతృత్వంలో 20 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ఇది సాధారణ రుసుము కాదని,  పన్ను స్వభావం కలిగిన ఆర్థికభారం అని వాదించాయి.  

అమెరికా  రాజ్యాంగం ప్రకారం  పన్నులు విధించే  అధికారం కాంగ్రెస్‌‌‌‌కు  మాత్రమే ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాయి. ఈ వాదన కేవలం చట్టపరమైన అంశానికి మాత్రమే పరిమితం కాలేదు. అమెరికాలోని పలు ప్రజా సేవారంగాల పనితీరుపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని రాష్ట్రాలు వాదించాయి.  ఆ కారణంగానే,  ఈ కేసు వలస విధానం కంటే విస్తృత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి లియో టి. 

సోరోకిన్ కీలకమైన ప్రశ్న లేవనెత్తారు. ఒక వీసా దరఖాస్తు పరిశీలనకు అయ్యే వ్యయంతో  పోలిస్తే ఒక లక్ష డాలర్ల రుసుమును  ఎలా సమర్థించగలమని ప్రశ్నించారు. ప్రభుత్వం అందించే సేవకు,  వసూలు చేసే మొత్తానికి  మధ్య  సహజ సంబంధం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ అనుమతి లేకుండా పన్ను స్వభావం కలిగిన భారీ ఆర్థిక భారాన్ని  కార్యనిర్వాహక శాఖ విధించలేదని కోర్టు అభిప్రాయపడింది.

  • అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ఫెడరల్ న్యాయవ్యవస్థకు పునాది

ఈ కేసు ప్రాధాన్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అమెరికా రాజ్యాంగ వ్యవస్థను కూడా చూడాలి. అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్–3 ఫెడరల్ న్యాయవ్యవస్థకు పునాది.  కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగ వివాదాలు, ఫెడరల్ చట్టాలకు సంబంధించిన అంశాలను ఫెడరల్ కోర్టులు పరిశీలించే అధికారం కలిగి ఉంటాయి. 

అదే సమయంలో ఆర్టికల్–1, సెక్షన్–8 ప్రకారం పన్నులు విధించే అధికారం కాంగ్రెస్‌‌‌‌కు కేటాయించడమైనది. ఈ నేపథ్యంలోనే  హెచ్-1బీ వీసా దరఖాస్తుపై  విధించిన ఒక లక్ష డాలర్ల అదనపు భారం సాధారణ రుసుమా,  లేక పన్ను స్వభావం కలిగిన చర్యనా అనే అంశాన్ని కోర్టు పరిశీలించింది. 

ఆ కారణంగానే ఈ కేసు  సాధారణ వలస వివాదాన్ని దాటి రాజ్యాంగపరమైన  చర్చగా  మారింది.  ఈ తీర్పు భారతీయ యువతకు,  నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ముఖ్యమైన ఊరటనిచ్చింది.  ఒక లక్ష డాలర్ల అదనపు రుసుము కొనసాగి ఉంటే అమెరికా సంస్థలు  విదేశీ ఉద్యోగులను  నియమించుకోవడంలో  వెనుకడుగు  వేసే  అవకాశం ఉండేది.  

దాని ప్రభావం ముందుగా భారతీయ ఉద్యోగార్థులు, అమెరికాలో ఉన్నత విద్య పూర్తిచేసి ఉద్యోగ అవకాశాల కోసం  ఎదురుచూస్తున్న విద్యార్థులు, సమాచార సాంకేతిక రంగంలో పనిచేసే  యువతపైనే  పడేది.  ఈ  కారణంగానే సాంకేతికరంగ ప్రతినిధులు, భారతీయ సంఘాలు, ఈ తీర్పును సానుకూలంగా 
స్వాగతించాయి. 

  • భవిష్యత్తులో  ఇతర  నిబంధనలు లేదా కొత్త పరిమితులు

ఈ తీర్పుతో అన్ని అనిశ్చితులు తొలగిపోయాయని భావించడం సమంజసం కాదు.  ప్రభుత్వం అప్పీల్‌‌‌‌కు వెళ్లే అవకాశం ఉంది.  భవిష్యత్తులో  ఇతర  నిబంధనలు లేదా కొత్త పరిమితులు కూడా రావచ్చు.  కాగా బోస్టన్ ఫెడరల్ కోర్టు తీర్పు ఒక రుసుమును మాత్రమే నిలిపివేయలేదు. అమెరికా ఉద్యోగాలను రక్షించాలనే లక్ష్యం,  ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని ఆకర్షించాలనే అవసరం మధ్య సమతుల్యత ఎలా సాధించాలనే ప్రశ్నను మరోసారి ముందుకు తెచ్చింది. 

అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ స్థాయి నిపుణులు ఎంత అవసరమో, ఉద్యోగాల రక్షణపై రాజకీయ ఒత్తిడి కూడా అంతే బలంగా ఉందనే విషయాన్ని ఈ తీర్పు గుర్తు చేసింది. అందుకే దీనిని కేవలం హెచ్-1బీ  వీసా రుసుముపై వచ్చిన న్యాయ నిర్ణయంగా మాత్రమే చూడలేం. అమెరికా వలస విధానాల భవిష్యత్తు, ప్రపంచ స్థాయి నైపుణ్యం కోసం జరుగుతున్న పోటీ, రాజ్యాంగ పరిమితులపై సాగుతున్న చర్చలో ఇది ఒక 
ముఖ్యమైన మలుపుగా నిలిచింది.

- డా. వకుళాభరణం 
కృష్ణమోహన్ రావు
మాజీ  చైర్మన్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com 

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.