ఇరాన్– ఇజ్రాయెల్– అమెరికాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా ఒకవైపు, ఇరాన్ ఒక్కటి ఒకవైపు తలపడుతున్నాయి. ముస్లిం దేశాలలో కూడా ఇప్పటివరకు ఏదీ ఇరాన్‌కు అండగా మేం ఉన్నామని ప్రకటించలేదు. ఇజ్రాయెల్, అమెరికాకు మత సాంస్కృతిక సంబంధం ఉంది. ఆ రెండు దేశాల్లో ఉన్న మత సాంస్కృతిక సంబంధాలను జూడో–క్రిస్టియన్ మత సంబంధాలు అంటారు. అంటే ఇజ్రాయెల్ జ్యూయిష్ దేశమైనా బైబిల్ మొదటి భాగమైన ఓల్డ్ టెస్ట్‌మెంట్ నుంచి.. అదే ఇజ్రాయెలీ జ్యుయిష్ కమ్యూనిటీ నుంచి జీసస్ వచ్చాడు. న్యూ టెస్ట్‌మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్కు జతపర్చకముందు ఓల్డ్ టెస్ట్మెంట్ను తోరా అని ఇజ్రాయెలీలు పిలుస్తారు. ఇప్పటికీ అలానే పిలుస్తున్నారు. చాలా యుద్ధాల తరువాత జ్యూస్– క్రిస్టియన్లు ఏకమయ్యారు. ఇప్పడు ఐక్యంగా ఇరాన్‌పై యుద్ధం చేస్తున్నారు. వీరిని కలిపింది జర్మనీ డిక్టేటర్ హిట్లర్.
ఇరాన్‌పై యుద్ధం మొదలయ్యాక మన దేశంలో వంట గ్యాస్ కొరత ఎందుకు వచ్చింది? మనం ఆవుపెండతోనో (అంటే పిడకలతో) లేదా కర్ర చందనంతోనో వండుకుంటే వాళ్లు ఎన్ని యుద్ధాలు చేసుకున్నా హాయిగా వండుకుని షడ్రసోపేతాలు తినేవారం కదా? లేదా మన రాజులో, మన రాజ్యాంగ ప్రభుత్వాలో 1947 తరువాతనైనా మన భూమి నుంచి ఆయిల్నో లేదా నేరుగా గ్యాస్నో బయటకుతీసి మన వంట గదుల్లోకి పంపితే హాయిగా వండుకుని తిరిగేవారం కదా? అలాగే ముస్లిం రాజ్యాలన్నీ ఆవు, ఎద్దు, బర్రె దున్నపోతు మాంసం లేదా బియ్యం, గోధుమలు, కూరగాయలు మన దేశం నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు? హాయిగా కర్జూరపండు తిని, ఒంటె మాంసం తిని ఆయిల్ తాగి, గ్యాస్ పీల్చి బతికితే బాగుండేది కదా!.
కానీ, దురదృష్టవశాత్తు అన్ని భూములకు, అన్ని ఉత్పత్తులు చేసే శక్తి లేదు. అంతెందుకు మన దగ్గరే గ్రామానికి, గ్రామానికి మధ్య భూముల స్వభావాల్లో తేడా ఉంది. వాటి ఉత్పత్తి శక్తిలో తేడా ఉంది. అయితే, భూములు ఉత్పత్తి శక్తిని ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మార్చగలిగే శక్తి సైన్సుకున్నదికాని మతానికి లేదు. మతానికి మనం పనిచేసే టైంలో ఏర్పడే భయానికి, రోగమొచ్చినప్పుడు కొంత ధైర్యమిచ్చే సెంటిమెంటల్ వ్యాల్యూ ఉంది. కానీ, అది ఉత్పత్తిని పెంచే సైన్సుతో సమానమైనది కాదు. సైన్సుపై ఫోకస్ తగ్గి మతంపై ఫోకస్ పెరిగినందువల్ల ఈ యుద్ధం వచ్చింది. దీని ఫలితం మన దేశానికి కూడా పొయ్యి కష్టాలు వచ్చాయి.
ఇరాన్తోటే యుద్ధమెందుకు?
ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్‌తోనే ఎందుకు యుద్ధం చేస్తున్నాయి? మిగతా ముస్లిం దేశాలు అమెరికాపట్లనే అనుకూలంగా ఉన్నట్లు ఎందుకు కనిపిస్తున్నాయి. ఇరాన్ ముస్లిం దేశమే కదా! ఇరాన్ అరబ్ దేశాల్లో కూడా ఎందుకు బాంబులు పేలుస్తోంది? ఆ దేశాల్లోని ఆయిల్ బావులపై బాంబులు ఎందుకు వేస్తోందని అనే ప్రశ్నలు ప్రపంచమంతటా చర్చల్లో ఉన్నాయి. ఇరాన్ మాత్రమే షియా ముస్లిం జనాభా అధికారికంగా ఉండి షియా మూలాలచే పరిపాలిస్తున్న దేశం. మిగతా దేశాలన్నీ సున్నీ దేశాలు.
అయితే, చాలా దేశాల్లో మైనార్టీలుగానైనా షియాలు ఉన్నారు. భారతదేశంతో సహా, ఇక్కడ షియాలు బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఉంటున్నారు. సున్నీలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇరాన్ మిగతా దేశాల మధ్య ఈ షియా – సున్నీ వైరుధ్యం చాలా ఉంది. ఈ దేశంలో ఒకప్పుడు వైష్ణవిజం–శైవిజం మధ్య ఈ విధమైన తగువు ఉండేదో అలాంటిదే. అయితే షియా దేశాలలో ఒక పాకిస్తాన్‌కు తప్ప న్యూక్లియర్ వెపన్స్ గాని లాంగ్రేంజ్ ఇంటర్ కాంటినెంట్ బాలిస్టిక్ మిసైల్స్ (ఐసీబీఎంఎస్)కాని లేవు.
ఇరాన్ మాత్రం ఒకవైపు ప్రజలను అణచివేస్తూ, పీడిస్తూనైనా రకరకాల మిసైల్స్ ఐసీబీఎంలతో సహా తయారు చేసుకుంది. కొద్దిరోజుల్లో న్యూక్లియర్ వెపన్స్‌ను తయారు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంది. దాని ప్రధాన పోటీ ఇజ్రాయెల్‌తో. మిగతా అరబ్ దేశాలకు డబ్బు, సుఖమైన జీవన వనరులు ఉన్నప్పటికీ రక్షణరంగంలో అమెరికాపై ఆధారపడి ఉన్నాయి. దాని ఆయుధ సైనిక స్థావరాలకు చాలాచోట్ల అవకాశాలు కలిపించాయి అరబ్ దేశాలు. ఇప్పుడు ఇరాన్ ఈ ముస్లిం దేశాల మీద, వాటి ఆయిల్ బావుల మీద దాడి చేస్తోంది. వాటన్నింటిని అమెరికా మిత్రులుగా ఉన్నాయని దాడులు చేస్తున్నది. ఇది క్రమంగా ఇరాన్‌ను ముస్లిం దేశాలల్లో కూడా ఒంటరిని చేసే అవకాశం కనిపిస్తున్నది. కానీ, ఈ క్రమంలో ఆయిల్ ఫీల్డ్ నాశనమై ప్రపంచ వంటకు, కార్లు, సైకిల్ మోటార్లు, విమానాలు నడపడానికి కూడా గ్యాస్లేని రోజు రావొచ్చు.
గ్లోబలైజేషన్‌తో ప్రపంచం ఒక గ్రామమైంది అని, అది ఆధునిక జీవితాన్ని అన్ని దేశాల బీద ప్రజలకు కూడా కల్పిస్తున్నదని చాలామంది భావించారు. ముఖ్యంగా పెట్టుబడుదారులు విపరీతంగా ప్రపంచ మార్కెట్లలో డబ్బు సంపాదించారు. ఈక్రమంలో 21 వ శతాబ్దం రెండు దశాబ్దాలు తిరక్కముందే మత రాజకీయాలు, మత పునాదిగా రూపొందిన ఫండమెంటలిజంతో కూడిన ఉగ్రవాదం, చాలా దేశాల్లో పాలకవర్గాలు కూడా ఆ ఆలోచనతో ఎదగడం ప్రారంభించాయి.
ముస్లిం దేశాలన్నీ ఐక్యంగా లేవు
దోపిడీ పెరిగినకొద్దీ పాపభీతి పెరిగింది. ఒక మతంపై, మరో మతం కోపం, యుద్ధ వైఖరి పెరిగాయి. సెక్యులర్ ప్రజాస్వామ్యాలు కూడా మత రాజకీయాల్లోకి జారుకోవడం మొదలైంది. ఇప్పడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం మత రాజకీయాలతో ముడిపడి ఉంది. ఇది ఎటు దారి తీస్తుందో తెలియడం లేదు. ఒకే ఒక ఆశ ఏమంటే ముస్లిం దేశాలన్నీ ఐక్యంగా లేవు. ఇరాన్ ఇతర ముస్లిం దేశాల మీద దాడి చేస్తుండటంతో అది చాలాకాలం యుద్ధం నడపలేదు అనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ యుద్ధంలోకి ఇంకా రష్యా, చైనా దిగలేదు.
జపాన్ అమెరికాకు మద్దతు దేశం కనుక అది దిగితే అమెరికా మద్దతుదారుగానే ఉంటుంది. అయితే, ఆయిల్ అవసరాలు అన్ని దేశాల కంటే భారతదేశానికి ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చైనా భారత్లాగ పెద్ద జనాభా కలిగిన దేశమే అయినా అక్కడ సొంత ఆయిల్ ఉత్పత్తి ఉంది. అక్కడ ఎలక్ర్టిసిటీ ఉత్పత్తి మన దేశం ఉత్పత్తి కంటే చాలా ఎక్కువ. ఇప్పటికే వంటకు, వాహనాల అవసరాలకు విద్యుత్ వాడకం చాలా పెంచిందా దేశం. కానీ, ఇండియా ఈ అన్ని రకాల ఉత్పత్తుల్లో వెనుకబాటులో ఉంది. దేశ అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గ్లోబలైజ్డ్ ప్రపంచంలో ఏ చిన్న మారుమూలల్లో యుద్ధాలు మొదలైనా ప్రపంచ సప్లై చైన్ మొత్తం దెబ్బతింటుంది.
మారిన యుద్ధ రూపురేఖలు
ఇప్పుడు యుద్ధాలు భూమిమీద పదాతి సైన్యంతో జరగడం లేదు. యుద్ధాలు మొత్తంగా బాంబుల యుద్ధంగా మారాయి. ఆకాశం నుంచి ఎక్కడ, ఎప్పుడు, ఏ నగరం మీద బాంబులు పడతాయో తెలియదు. విధ్వంసం మామూలుగా ఉండదు. నగరాలు నాశనమైపోతాయి. మనుషులు పురుగుల్లా చనిపోతారు. అది మనం గాజాలో చూశాం. ఇప్పడు ఇరాన్లో చూస్తున్నాం. ఇక న్యూక్లియర్ ఆయుధాలు వాడితే ప్రపంచమే నాశనానికి దారి తీస్తుంది. ఒక్క దేశంలో జరిగే యుద్ధంతో ప్రపంచ రవాణా సంస్థలు మొత్తం అతలాకుతలం అవుతున్నాయి. ఆహార, ఇంధన సరఫరా గందరగోళంలో పడింది. ఇక అది ప్రపంచ యుద్ధంగా మారితే!. ఒకవేళ ఇదే అణు ఆయుధాలతో ప్రపంచ యుద్ధమే వస్తే మానవాళి సంపూర్ణ ఉనికిని కోల్పోతుంది.
రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఇటువంటి మారణాయుధాలు దేశాల దగ్గర లేవు. ఒకవేళ ఆనాడు హిట్లర్ చేతిలో న్యూక్లియర్ వెపన్ ఉంటే దాన్ని ఆయన ఉపయోగించి యూరప్ అంతా సర్వనాశనం చేసేవాడు. ఇప్పడు మతపర రాజ్యాలలో కూడా ఎంతటి తెగింపుకైనా సిద్ధపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. మతపర సెంటిమెంటు, ఇతర మతపర ప్రజలమీద, రాజ్యాలమీద తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకుని మానవులు మగ్గిపోతున్నారు. చరిత్ర పొడవునా జరిగిన మత యుద్ధాలను, మత హింసనూ, దారుణాలను తిరిగి నెమరువేసి పగ సాధించాలనే ద్వేష భాష పాలకుల మధ్య కూడా కనిపిస్తున్నది. అటువంటి పాలకుల చేతిలో అణుబాంబులు ఉంటే ప్రపంచం ఏమవుతుంది? సెక్యులర్ పాలకుల మధ్య ఉండే సమన్వయం మత పాలకుల మధ్య ఉండదు. అందుకే మతం, రాజ్యం వేరుగా ఉండటం అవసరం.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
