వెలుగు ఓపెన్ పేజ్: ఏడాదికి 12 నెలలైతే.. 13 నెలల రీఛార్జ్.. టెలికాం దోపిడీకి అడ్డుకట్ట పడేదెప్పుడు?

వెలుగు ఓపెన్ పేజ్: ఏడాదికి 12 నెలలైతే.. 13  నెలల రీఛార్జ్.. టెలికాం దోపిడీకి అడ్డుకట్ట పడేదెప్పుడు?

భారతదేశ టెలికాం రంగం నేడు ఒక కీలకమైన సంక్షోభంలో చిక్కుకుంది. డిజిటల్ ఇండియా నినాదాల వెనుక పౌరుల ప్రాథమిక హక్కులు హరించుకుపోతున్నాయా అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. కమ్యూనికేషన్ అనేది  నేడు ఒక విలాసం కాదు, అది రాజ్యాంగబద్ధమైన డిజిటల్ హక్కు.  టెలికాం సంస్థలు లాభాల వేటలో పడి వినియోగదారులను దోపిడీ చేస్తున్నప్పుడు నియంత్రణ సంస్థలు ప్రేక్షకుడి పాత్ర పోషించడం శోచనీయం. 2025లో  వచ్చిన అమర్ జైన్ తీర్పు డిజిటల్ యాక్సెస్‌‌‌‌‌‌‌‌ను రాజ్యాంగబద్ధమైన హక్కుగా  మార్చిన తరుణంలో.. సేవల నిలిపివేత అనేది అమానుషం.  ఆర్థిక లావాదేవీల నుంచి పౌరుడిని దూరం చేయడం అంటే అతని జీవనోపాధిని  దెబ్బతీయడమే. ఇది రాజ్యాంగ విలువల ఉల్లంఘన కాదా అని పౌర సమాజం గళమెత్తాలి.

టెలికాం సంస్థల దోపిడీపై పార్లమెంటులో  గళమెత్తిన  ప్రముఖుల్లో ఎంపీ రాఘవ్ చద్దా ఒకరు.  టెలికాం కంపెనీలు అనుసరిస్తున్న 28 రోజుల బిల్లింగ్  విధానం  వినియోగదారులను  వంచించడమేనని ఆయన రాజ్యసభలో బలంగా వినిపించారు.  సంవత్సరానికి 12 నెలలు ఉంటే, కంపెనీలు 13 నెలల రీఛార్జ్  చేయించుకుంటున్నాయని ఆయన గణాంకాలతో సహా  నిరూపించారు. ఈ విధానం వల్ల సామాన్య ప్రజల  జేబుల నుంచి రూ. వేల కోట్లు  కంపెనీల  ఖాతాల్లోకి  వెళ్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్యాలెండర్ నెల ప్రాతిపదికన అంటే 30 రోజుల ప్లాన్లను కచ్చితంగా అమలు చేయాలి. సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే ఈ 13వ నెల  రీఛార్జ్ అనేది చట్టబద్ధమైన దోపిడీ కాదా?  30 రోజుల ప్లాన్లను అమల్లోకి తెచ్చామని కంపెనీలు చెబుతున్నా.. వాటిని సామాన్యులకు అందకుండా చేయడం వంచన కాదా?   దాదాపు 8 శాతం మేర అదనపు  ఆదాయాన్ని కంపెనీల ఖాతాలో  చేరుస్తోంది.  ఏడాదికి 365 రోజులు ఉంటే,  కంపెనీలు లెక్కించే 28 రోజుల లెక్కన వినియోగదారులు దాదాపు 24 నుంచి 28 రోజులు అదనంగా నష్టపోతున్నారు. ఈ అదనపు ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?  కాలాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే అధికారం టెలికాం సంస్థలకు  ఎవరు ఇచ్చారు?

ఇన్‌‌‌‌‌‌‌‌కమింగ్ కట్ డిజిటల్ వెలివేత కాదా?

రీఛార్జ్  ముగిసిన తర్వాత ఇన్‌‌‌‌‌‌‌‌కమింగ్ కాల్స్,  ఎస్ఎంఎస్ సేవలు ఆగిపోవాలి అని ఏ చట్టం చెబుతోంది?  ఆధునిక కాలంలో  మొబైల్ నంబర్ కేవలం కమ్యూనికేషన్ సాధనం కాదు,  అది ఒక వ్యక్తి డిజిటల్ గుర్తింపు.  ఒక  ఓటీపీ అందకపోవడం వల్ల పౌరుడు డిజిటల్  వెలివేతకు గురవ్వడం  ప్రజాస్వామ్య దేశంలో  ఆమోదయోగ్యమేనా?  ఆరోగ్య  సమాచారం అందకపోతే  ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి పరిస్థితి ఏమిటి?  వినియోగదారులు  కాల్  స్వీకరించినప్పుడు కంపెనీలకు ఆదాయం వస్తున్నప్పుడు కూడా సేవలు  నిలిపివేయడం  వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి?  బ్యాంకింగ్,  రేషన్, ప్రభుత్వ పథకాలు అన్నీ మొబైల్ నంబర్​తో  ముడిపడి ఉన్నప్పుడు,  ఇన్‌‌‌‌‌‌‌‌కమింగ్ సేవలు నిలిపివేయడం అంటే పౌరుడి ప్రాథమిక జీవన గమనాన్ని ఆటంకపరచడమే. కార్పొరేట్ లాభాల కోసం పౌరుడి ఆర్థిక స్వేచ్ఛను బలిపెట్టడం భావ్యం కాదు.

అంతర్జాతీయంగా లేకున్నా.. మనకే ఎందుకు?

అభివృద్ధి  చెందిన  దేశాలు  వినియోగదారుల హక్కులకు  అత్యధిక  ప్రాధాన్యత  ఇస్తున్నాయి.  ప్రపంచంలోనే  అతిపెద్ద  డిజిటల్ మార్కెట్​గా  చెప్పుకునే భారత్​లో లేని  ‘డేటా రూల్’  ఓవర్  సౌకర్యం,  అమెరికాలోని ఏటీ అండ్​ టీ  వినియోగదారులకు ఎలా సాధ్యమవుతోంది?   బ్రిటన్‌‌‌‌‌‌‌‌లోని 'స్కై మొబైల్' తన వినియోగదారుల డేటాను మూడేళ్లపాటు దాచుకునే వెసులుబాటు ఇస్తోంది. మరి భారతదేశంలో మనం చెల్లించిన  సొమ్ముకు  గడువు ముగియగానే చెల్లుబాటు  ఎందుకుపోతోంది?   గడువు  ముగిసిందన్న సాకుతో  డేటాను రద్దు చేయడం అక్రమ ఆర్జన కిందకు రాదా అన్నది చర్చనీయాంశం. విదేశాల్లో వినియోగదారులు వాడకుండా  మిగిల్చిన  డేటాను తర్వాతి నెలకు బదిలీ చేసుకునే వెసులుబాటు ఉన్నప్పుడు, ఇక్కడ మాత్రం అది అసంభవం అని కంపెనీలు ఎలా చెబుతాయి?  సాంకేతికత అందరికీ ఒక్కటే అయినప్పుడు  నిబంధనల్లో  ఎందుకీ తేడాలు? 

ట్రాయ్  వంటి సంస్థలు వినియోగదారుల  ప్రయోజనాలను కాపాడటానికా లేక టెలికాం కంపెనీల ఆదాయ మార్గాలను సుగమం చేయడానికా? ప్లాన్ ముగిసిన తర్వాత కూడా కనీసం 60 రోజుల పాటు ప్రాథమిక సేవలు అందించాలి. బ్యాంకింగ్ రంగం తరహాలో ఒక స్వతంత్ర అంబుడ్స్‌‌‌‌‌‌‌‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

సంస్కరణల ఆవశ్యకత

టెలికాం రంగంలో నిర్మాణాత్మక మార్పులు రావాలి.  ముందుగా 28 రోజుల బిల్లింగ్ విధానాన్ని  పూర్తిగా రద్దు చేసి,  క్యాలెండర్ నెల ప్రాతిపదికన ప్లాన్లను రూపొందించాలి. ఇన్‌‌‌‌‌‌‌‌కమింగ్ కాల్స్, మెసేజ్ సేవలను కనీసం మూడు నెలలపాటు ఉచితంగా అందించాలి.  డేటా రోల్  ఓవర్  సౌకర్యాన్ని  ప్రతి ప్లాన్​లోనూ అంతర్భాగం చేయాలి. వినియోగదారుల ఫిర్యాదుల కోసం ప్రాంతీయ భాషల్లో సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థను నెలకొల్పాలి.  

మొబైల్ కనెక్షన్ అనేది నేడు వ్యక్తిగత గుర్తింపుకార్డు లాంటిది కాబట్టి, దానిని నిలిపివేసే అధికారం కంపెనీలకు ఏకపక్షంగా ఉండకూడదు.  ఇన్‌‌‌‌‌‌‌‌కమింగ్ సేవలను నిలిపివేయడం మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి. నియంత్రణ సంస్థలు తమ నిర్లిప్తతను వీడి, కార్పొరేట్ ప్రయోజనాల కంటే ప్రజా హక్కులకే పెద్దపీట వేసినప్పుడే నిజమైన డిజిటల్ ప్రజాస్వామ్యం సాకారం అవుతుంది.  ప్రభుత్వాలు కూడా  కార్పొరేట్ బాసుల కంటే  సామాన్యుల  ప్రయోజనాలే  ముఖ్యమని గుర్తించాలి. అప్పుడే భారతదేశం నిజమైన డిజిటల్ శక్తిగా అవతరిస్తుంది. వ్యవస్థలో ప్రశ్నించేతత్త్వం నశించినప్పుడే కార్పొరేట్ దోపిడీకి పునాదులు పడతాయి, ఆ పునాదులను కూల్చేశక్తి పౌర స్పృహకే ఉంది. 


డా.కట్కూరి,
సైబర్ సెక్యూరిటీ & న్యాయ నిపుణుడు

Note:ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.