విద్యాసామర్ధ్యాలు ప్రభుత్వ బడులకేనా.. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు అవసరం లేదా?

విద్యాసామర్ధ్యాలు ప్రభుత్వ బడులకేనా..  ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు అవసరం లేదా?

ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు అక్షరాలు గుర్తుపట్టడం, అనర్గళంగా చదవడం, తప్పులు లేకుండా రాయడంతోపాటు  బేసిక్ లెక్కలు చేయడం వంటివి నేర్పించడమే లక్ష్యంగా... ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కాంపిటెన్సీ పేరుతో  ప్రభుత్వం  జులై 1 నుంచి సరికొత్త  కార్యక్రమాన్ని తీసుకురానుంది. ఇందుకోసం రాష్ట్రంలో 1,817 స్కూల్ కాంప్లెక్స్ క్లస్టర్లలో  ఎక్కువ ఎన్​రోల్​మెంట్​ ఉన్న మూడు ప్రైమరీ లేదా అప్పర్ ప్రైమరీ స్కూళ్లను ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు.

అట్లా  మొదటి విడతలో 5,451 స్కూళ్లను ఎంపిక చేయనున్నారు.  ఈ  కార్యక్రమంలో  పిల్లల్లో 80 శాతం నైపుణ్యం సాధించేలా చర్యలు తీసుకుంటారు.  ప్రధానంగా రెండు, మూడు తరగతుల విద్యార్థులపై  ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.  రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను  మెరుగుపరచడానికి  ప్రతి విద్యా సంవత్సరం కొత్త కార్యక్రమంతో హడావిడి చేస్తోంది.  

ఇప్పటికే  చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్​మెంట్ ప్రోగ్రాం,  చిల్డ్రన్ లెర్నింగ్ ఎన్​హాన్స్​మెంట్ ప్రోగ్రాం,  ఏబీసీ ప్రోగ్రాం, ఎల్ఐపి  ప్రోగ్రాం,  త్రీ ఆర్స్ ప్రోగ్రాం, రీడ్ (ఎంజాయ్​మెంట్ అండ్ డెవలప్​మెంట్),  దీక్ష, హరివిల్లు,  నిష్ణ, తొలిమెట్టు  ఇట్లా అనేక కార్యక్రమాలను గత  విద్యా సంవత్సరాల్లో  అమలుచేశారు.  అవన్నీ  పునాదిస్థాయి  అక్షరాస్యత, గణిత సామర్థ్యాలు,  భాషా సామర్థ్యాలు పెంపుదల కోసం రూపొందించారు.  కానీ,  గత  కార్యక్రమాలకు ఈ సంవత్సరం  చేపట్టబోయే 
కార్యక్రమానికి  తేడా ఏమన్నా ఉందా? 

  • విద్యాధికారుల పోస్టులు భర్తీ చేయాలి

గత  కార్యక్రమాల అమలు,  విద్యార్థులందరికీ తరగతివారీ సామర్థ్యాలపై  సమీక్షించకుండానే కొత్త విద్యా సంవత్సరంలో మరో కొత్తపేరుతో కార్యక్రమాన్ని విద్యాశాఖ తేవడం ఆనవాయితీగా మారింది. ఇవన్నీ విద్యా సామర్థ్యాల పెంపుకోసం అని  అధికారులు సమర్థించుకోవచ్చు.   బయోమెట్రిక్ పద్ధతి,  జియో అటెండెన్స్,  యాప్​ల  ద్వారా హాజరు నమోదు,  ఫేషియల్  రికగ్నిషన్,  ఉపాధ్యాయుల సెలవు నమోదు వంటి వాటిని అమలుచేస్తూ  ట్యాబ్​లు, సెల్​ఫోన్లు సమకూరుస్తున్న విద్యాశాఖ  అధికార పర్యవేక్షణపై  మాత్రం శ్రద్ధ చూపడం లేదు.  రాష్ట్రంలో  కొత్తగా ఏర్పాటు అయిన 25 జిల్లాలకు  జిల్లా విద్యాశాఖ అధికారుల  పోస్టులనే మంజూరు చేయలేదు. 

 గత  మూడు దశాబ్దాలుగా  డిప్యూటీ  విద్యాధికారులు,  మండల  విద్యాధికారుల  పోస్టుల భర్తీకి  తీసుకుంటున్న చర్యలు శూన్యం.  ఫలితంగా పాఠశాలల్లో  విద్యా పర్యవేక్షణ,  విద్యా పాలన కుప్ప కూలింది. తరగతి గదిలో సాధికారికంగా ఉపాధ్యాయుల బోధనను మూల్యాంకనం చేసే వ్యవస్థ లేకుండా పోయింది. తాత్కాలిక ఏర్పాట్లతో ఏ యేటి కాయేడు నెట్టుకు వచ్చే చర్యలు తప్ప, సమగ్ర పర్యవేక్షణ వ్యవస్థ లేకుండా పోయింది.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే విద్యాధికారుల  పోస్టులను  భర్తీ చేయాలి.  

  • స్థిరమైన విధానాలతో దిశా నిర్దేశం చేయాలి

మన విద్యాశాఖ,  ఎస్సీఈఆర్టీ కేవలం 35 శాతం నమోదు ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే తన కార్యక్రమాలను ఇస్తోంది.  కానీ 65% మంది విద్యార్థులు చదివే  ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఈ కార్యక్రమాలు ఉండవు.  మరి ప్రైవేట్ పాఠశాల  విద్యార్థులకు  విద్యాసామర్ధ్యాలు అవసరం లేదా? వారికి కూడా కనీస అభ్యసనా సామర్థ్యాలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖకు లేదా? అనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి.  

ఎందుకంటే వారి సామర్థ్యాలు కూడా తీసికట్టుగా ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి.  కనుక  ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలలను కూడా విద్యాశాఖ  పర్యవేక్షణలోకి తెచ్చి,  అందరికీ  ఒకేవిధమైన సామర్థ్యాల కార్యక్రమాలు అమలయ్యేలా  చూడాలి.  ఎస్సీఈఆర్టీ  ఆధ్వర్యంలో  విద్యాశాఖ ఒక అకడమిక్  క్యాలెండర్  రూపొందించి ఆ అకడమిక్ క్యాలెండర్ 220  పనిదినాల్లో రోజూ చేయాల్సిన కార్యక్రమాలను నిర్దేశించాలి.  అవి అమలయ్యేలాగ పర్యవేక్షణ అధికారులు నిత్యం పర్యవేక్షించాలి.  తద్వారా సరైన విద్యా బోధన సాగుతుంది.  

కేవలం  తాత్కాలిక కార్యక్రమాలతో  విద్యాశాఖను నడిపిస్తే మరింత సంక్షోభంలోకి విద్యాశాఖ నెట్టబడుతుంది.  బడిని బడిగా నడపాలి.  బడి  ప్రతిరోజు కొత్త విన్యాసాలతో  పిల్లల భవిష్యత్తును  పరీక్షించే  వేదిక కాదు, ఈ రోజు ఒక తీరు, రేపు ఇంకో తీరు, ఎల్లుండి మరొక మార్పు.. ఇలా గాలివాటం విధానాలతో విద్యను సంక్షోభంలోకి వెళ్ళేలా చేయడం సరికాదు. స్థిరమైన విధానాలతో దిశా నిర్దేశం జరగాలి.  బోధనకు లక్ష్యం ఉండేలా  విద్యా ప్రణాళిక  రూపొందించి అమలుచేస్తే  సత్ఫలితాలు వస్తాయి.

  • అకడమిక్ అథారిటీగా ఎస్సీఈఆర్టీ

విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యను పర్యవేక్షించే సూచనలు చేయడంతోపాటు, బోధనలో  మార్గదర్శనం చేసే  అకడమిక్ అథారిటీగా ఎస్సీఈఆర్టీ ఉంది. ఉపాధ్యాయులకు వృత్తిపరమైన శిక్షణ అందించడంతోపాటు విద్యా లక్ష్యాలు, బోధన విధానాలు,  విద్యా ప్రణాళిక రూపకల్పన, పాఠ్యపుస్తకాల రచించడం, నూతన మూల్యాంకన పద్ధతులపై పరిశోధన చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలి. అయితే  రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ)లో సిబ్బంది  కొరత ఉంది.   

ప్రొఫెసర్లు,  లెక్చరర్లు  కలిపి  మొత్తం 24 మంది పని చేయాల్సి ఉండగా నలుగురు మాత్రమే ఉన్నారు.  మూడు  దశాబ్దాలుగా పదోన్నతులు లేక పోస్టులన్నీ ఖాళీగా ఉండి, తాత్కాలిక సర్దుబాట్లతో సంస్థ నెట్టుకొస్తోంది.   క్షీణించిన స్థితిలో ఉండి,  రాష్ట్ర విద్యాశాఖకు మార్గ నిర్దేశం చేయలేని స్థితిలో ఎస్సీఈఆర్టీ  అచేతనంగా ఉంది.  ఉపాధ్యాయుడు  పాఠశాల  పనిదినాలన్నింటిని బోధనా వ్యాసంగం కోసమే  పనిచేసేవిధంగా అకడమిక్ క్యాలెండర్  రూపొందించాలి.  

ఈ  క్యాలెండర్​ను  విద్యా సంవత్సరం మధ్యలో  మార్చకుండా  జాగ్రత్తలు తీసుకోవాలి.  పాఠశాల పనిదినాల్లో శిక్షణలు,  సర్వేలు  ఉండకూడదు.  అట్లే  పర్యవేక్షణ అధికారులు పనిదినాల్లో బోధనను పర్యవేక్షించే  విధుల్లో మాత్రమే ఉండాలి.  అంటే  ఉపాధ్యాయుడు  తరగతి గదిలో,  పర్యవేక్షణ అధికారి పర్యవేక్షణలో  మాత్రమే ఉండాలి.  విద్యేతర పనుల్లో వారిని వినియోగించకూడదు.

- కె. వేణుగోపాల్
విద్యారంగ విశ్లేషకుడు

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.