రిజినల్ రింగ్ రోడ్డు నిర్వాసితులకు హయ్యెస్ట్ పరిహారం.. చౌటుప్పల్‌‌లో ఎకరానికి రూ.1.20 కోట్లు..!

రిజినల్ రింగ్ రోడ్డు నిర్వాసితులకు హయ్యెస్ట్ పరిహారం.. చౌటుప్పల్‌‌లో ఎకరానికి రూ.1.20 కోట్లు..!
  • యాదాద్రిలో 1,795 ఎకరాల భూసేకరణకు ముమ్మర చర్యలు
  • సవరించిన రిజిస్ట్రేషన్‌‌ విలువతో పరిహారం పెంపునకు కసరత్తు
  • ఆర్బిట్రేషన్‌‌లో రైతుల విన్నపాలకు సానుకూల స్పందన
  • ఎన్‌‌హెచ్‌‌ఏఐ ఆమోదం తర్వాతే తుది పరిహారం చెల్లింపులు

యాదాద్రి, వెలుగు: రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు(ట్రిపుల్‌‌ఆర్‌‌) ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియలో ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోంది. భూములు కోల్పోతున్న రైతులతో చర్చలు జరుపుతూ, వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సవరించిన రిజిస్ట్రేషన్‌‌ విలువ ఆధారంగా మెరుగైన పరిహారం అందించేందుకు చర్యలు చేపడుతోంది. యాదాద్రి జిల్లాలో భూసేకరణ వేగం పుంజుకోగా, కొన్ని ప్రాంతాల్లో ఎకరానికి రూ.1.20 కోట్ల వరకు పరిహారం ఇచ్చేందుకు ప్రతిపాదించారు. యాదాద్రి జిల్లా ఐదు మండలాల్లోని 24 గ్రామాల మీదుగా 59.33 కిలోమీటర్ల దూరం నిర్మించే ట్రిపుల్​ ఆర్​ రోడ్డు కోసం 1,795 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.

 యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సర్వే పూర్తి కావడంతో ఆయా మండలాల్లో నిర్వాసితుల అకౌంట్లలో విడతల వారీగా పరిహారం జమ అవుతోంది. యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో సేకరించే భూమి విషయంలో గందరగోళం నెలకొనడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో అక్కడి భూములకు సంబంధించి సుమారు రూ.25 కోట్లు కోర్టులో డిపాజిట్​ చేశారు. భువనగిరి ‘కాలా’(కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్) పరిధిలోని రాయగిరి రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.

'ఆర్బిట్రేషన్'కు నిర్వాసితులు

ట్రిపుల్​ ఆర్​ నోటిఫికేషన్​ 2022లో రిలీజ్​ చేయడంతో  2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్​ విలువ ప్రకారం రూరల్​ ప్రాంతాల్లో మూడు రెట్లు, అర్బన్​ ప్రాంతాల్లో రెండు రెట్లు పరిహారం అందిస్తారు. రూరల్​ ప్రాంతాల్లో 2022 రిజిస్ట్రేషన్​ వ్యాల్యూ ప్రకారం ఎకరానికి మూడు రెట్లు అంటే రూ.12 లక్షల నుంచి రూ.25 లక్షలు, అర్బన్​  ప్రాంతాల్లో రెండు రెట్లు అంటే ఎకరానికి రూ.14 లక్షల నుంచి రూ. 84 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. పరిహారం తక్కువగా వస్తుండడంతో మరింత పెంచాలని కోరుతూ తుర్కపల్లి పరిధిలోని పలు గ్రామాలకు చెందిన నిర్వాసితులు గతంలోనే యాదాద్రి కలెక్టర్​ అనురాగ్​ జయంతి నేతృత్వంలోని ‘ఆర్బిట్రేషన్’ను ఆశ్రయించారు. దీంతో రూరల్​ ప్రాంతాల్లో ఎకరానికి కనీసం రూ.35 లక్షలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చౌటుప్పల్​లో రూ.1.20 కోట్లు..

ట్రిపుల్​ ఆర్​లో భూములు కోల్పోతున్న చౌటుప్పల్​ నిర్వాసితులు తాజాగా కలెక్టర్​ నేతృత్వంలోని ఆర్బిట్రేషన్​ను ఆశ్రయించారు. విజయవాడ, హైదరాబాద్​ జాతీయ రహదారిపై ఉన్న చౌటుప్పల్​లో 2022 విలువ ప్రకారం రూ. 50 లక్షల నుంచి రూ. 84 లక్షల వరకూ పరిహారం అందుతుంది. ఈ మొత్తాన్ని పెంచాలని నిర్వాసితులు కోరారు. ఇటీవల పెరిగిన రిజిస్ట్రేషన్​ వ్యాల్యూను వివరించారు. 2022లో ఎకరం రూ. 25.20 లక్షలు ఉన్న భూమి ఇటీవల సవరించిన ల్యాండ్​ వ్యాల్యూలో రూ. 32.80 లక్షలకు పెరిగింది. కొన్ని సర్వే నెంబర్లలో హయ్యస్ట్​గా ఎకరానికి 73.23 లక్షలకు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. 

వీటన్నింటిని పరిశీలించిన భూసేకరణకు ఓకే చెబితే ఇటీవల పెరిగిన రిజిస్ట్రేషన్​ వ్యాల్యూకు తగ్గట్లుగా పరిహారం నిర్ణయించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ చెప్పారు. చౌటుప్పల్​ మున్సిపాలిటీలో హైవేకు సమీపంలో ఉన్న భూములకు ఎకరానికి  రూ. 1.20 కోట్లు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారని తెలిసింది. రేటు నిర్ణయించిన తర్వాత నేషనల్​ హైవే అథారిటీకి రిపోర్ట్​ చేస్తారు. అక్కడి నుంచి గ్రీన్​ సిగ్నల్​ వచ్చిన తర్వాతే ఆర్బిట్రేషన్​లో పెంచిన పరిహారం చెల్లింపుల విషయంలో చర్యలు తీసుకోనున్నారు.