Bhumika Shajwani: ప్రపంచ కిరీటాన్ని ముద్దాడిన భారతీయురాలు.. ఎవరీ భూమికా షాజ్వానీ?

Bhumika Shajwani: ప్రపంచ కిరీటాన్ని ముద్దాడిన భారతీయురాలు.. ఎవరీ భూమికా షాజ్వానీ?

అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ‘మిసెస్ ఎర్త్ ఎలైట్ 2026’ పోటీల్లో భారత్‌కు చెందిన భూమికా షాజ్వానీ (Bhumika Shajwani) విజేతగా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతపై ఆమె చూపిన నిబద్ధత ఈ విజయానికి కారణమైంది. ఈ సందర్భంగా భారతీయ మహిళల ప్రతిభ, ఆత్మవిశ్వాసం ప్రపంచ వేదికపై మరోసారి సగర్వంగా నిలిచాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన ఎంతో మంది ప్రతిభావంతులైన పోటీదారులను అధిగమించి.. భూమికా షాజ్వానీ చరిత్ర సృష్టించారు. 

కేవలం అందమే కాదు... సామాజిక స్పృహే అసలైన ఆయుధం!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన భూమికా షాజ్వానీ, అమెరికాలో జరిగిన ‘మిసెస్ ఎర్త్ ఎలైట్ 2026’ పోటీల్లో విజేతగా నిలిచి భారత్‌కు గర్వకారణంగా నిలిచారు. అయితే, సాధారణ అందాల పోటీలతో పోలిస్తే ‘మిసెస్ ఎర్త్ ఎలైట్ 2026’ పోటీల్లో విజేతను ఎంపిక చేసే ప్రక్రియ భిన్నంగా ఉంటుంది.

ఇందులో కేవలం అందం మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధత, నాయకత్వ లక్షణాలు, సమాజంపై సానుకూల ప్రభావం చూపే సామర్థ్యం వంటి అంశాలను కూడా న్యాయనిర్ణేతలు పరిగణనలోకి తీసుకుంటారు.

ఈ నేపథ్యంలో భూమికా షాజ్వానీ తన అందంతో పాటు పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత వంటి అంశాలపై ఉన్న స్పష్టమైన అవగాహనతో న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకున్నారు. సమాజంలో సుస్థిర అభివృద్ధి కోసం తాను చేపట్టిన కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలు, వాటి ద్వారా సాధించిన ఫలితాలను ఆమె ఆత్మవిశ్వాసంతో వివరించిన తీరు ప్రశంసలు అందుకుంది.

ఆమె సందేశంలో ఉన్న స్పష్టత, సమాజం పట్ల ఉన్న నిబద్ధత, సేవా దృక్పథమే ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని ఆమెకు అందించడంలో కీలక పాత్ర పోషించాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

నెలల తరబడి కఠిన సాధన..

మిసెస్ ఎర్త్ ఎలైట్ 2026 కిరీటాన్ని అందుకోవడం ఒక్కరోజులో జరిగిన విషయం కాదని, దీని వెనుక నెలల తరబడి సాగిన కఠిన సాధన, అంకితభావం, క్రమశిక్షణ ఉన్నాయని భూమికా షాజ్వానీ వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్ కోసం ఆమె అన్ని రంగాల్లో ప్రత్యేకంగా సిద్ధమయ్యినట్లుగా చెప్పుకొచ్చింది. 

►ALSO READ | Rao Bahadur OTT Release: ఓటీటీలోకి 'రావు బహదూర్'.. సత్యదేవ్ సైకాలజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?

ఫిట్‌నెస్, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి:

శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు, కఠినమైన ఆహార నియమాలను పాటించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకున్నట్లుగా భూమికా తెలిపింది. 

స్టేజ్ ప్రెజెంటేషన్, పబ్లిక్ స్పీకింగ్‌లో శిక్షణ:

వేదికపై ఆత్మవిశ్వాసంతో తన ఆలోచనలను వ్యక్తపరచడం, సామాజిక అంశాలపై స్పష్టంగా మాట్లాడడం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూ రౌండ్లలో తన అభిప్రాయాలను సమర్థంగా వివరించేలా నిరంతరం సాధన చేసినట్లుగా భూమికా చెప్పుకొచ్చింది.

సామాజిక సేవలో చురుకైన పాత్ర:

పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో పాల్గొంటూ సమాజానికి ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలను భూమికా నిర్వహించింది. ఈ అనుభవమే పోటీలో తనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని ఆమె తెలిపింది.

ఇక చివరగా.. భూమికా తన సక్సెస్కి సహకరించిన గురువులు, శిక్షకులు, మెంటర్లు, అలాగే ప్రతి అడుగులోనూ తనకు అండగా నిలిచిన ఫ్యామిలి, ఫ్రెండ్స్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ‘ఈ కిరీటం నా ఒక్కదానిది కాదు.. నన్ను నమ్మి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరిది’ అని భూమికా ఎమోషనల్ అయింది. 

యూఎంబీ పేజెంట్స్ ప్రశంసలు..

భూమికా షాజ్వానీ విజయం పట్ల యూఎంబీ పేజెంట్స్ (UMB Pageants) నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె విజయం కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా, అంతర్జాతీయ వేదికపై భారతీయ మహిళల ప్రతిభ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని కొనియాడారు. భూమికా అందంతో పాటు సామాజిక బాధ్యత పట్ల ఉన్న నిబద్ధత, పర్యావరణ పరిరక్షణపై ఆమె చూపించిన అంకితభావం, మహిళా సాధికారతకు సంబంధించిన స్పష్టమైన దృక్పథం న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

‘‘భూమికా విజయం ఆమె వ్యక్తిగత ఘనత మాత్రమే కాదు.. ప్రపంచ వేదికపై భారతీయ మహిళల సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పిన గర్వకారణం. ఆమె నాయకత్వ లక్షణాలు, సమాజం పట్ల ఉన్న బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయి’’ అని యూఎంబీ పేజెంట్స్ ప్రతినిధులు ప్రశంసించారు.

అలాగే, ఈ విజయంతో భూమికా సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో ముందుకు తీసుకెళ్లే అవకాశం లభిస్తుందని, ఆమె చేపట్టనున్న పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

భూమికా భవిష్యత్తు లక్ష్యం..

మిసెస్ ఎర్త్ ఎలైట్ 2026 కిరీటాన్ని అందుకున్న అనంతరం భూమికా షాజ్వానీ తన భవిష్యత్తు లక్ష్యాలను వెల్లడించారు. ఈ అంతర్జాతీయ గుర్తింపును కేవలం వ్యక్తిగత విజయంగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే వేదికగా మలుచుకోవడమే తన ప్రధాన ఉద్దేశమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత వంటి అంశాలపై తాను ఇప్పటికే చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో కొనసాగిస్తానని ఆమె తెలిపారు. అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలు ఏర్పరుచుకుని, సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులను అమలు చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

‘‘ఈ కిరీటం నాకు గౌరవాన్ని మాత్రమే కాదు, మరింత బాధ్యతను కూడా తీసుకొచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత కోసం మరింత ప్రభావవంతంగా పనిచేస్తాను’’ అని భూమికా పేర్కొన్నారు.

అందం, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతలను సమన్వయం చేస్తూ మిసెస్ ఎర్త్ ఎలైట్ 2026 విజేతగా నిలిచిన భూమికా షాజ్వానీ, ఆధునిక భారతీయ మహిళా నాయకత్వానికి సరికొత్త నిర్వచనం అందించారు. ఆమె విజయం వ్యక్తిగత ఘనత మాత్రమే కాకుండా, సేవా భావంతో ముందుకు సాగాలనుకునే యువతకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచింది.