హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీగా, దక్షిణ తెలంగాణలో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ముసురుతో పాటు పలు చోట్ల వానలు కురిశాయి. మెదక్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మిన్పూర్‌లో 8 సెం.మీ., మెదక్‌లో 7.8, చేగుంటలో 7.6, శంకరంపేటలో 6.5 సెం.మీ. వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా గాంధారిలో 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 4.8, సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో 4.6, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లో 4, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 3.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
