మనం రోజూ రోడ్ల మీద రకరకాల వాహనాలు తిరగడం చూస్తుంటాం. చాలామంది వారికీ నచ్చిన ఎరుపు, తెలుపు, నలుపు వంటి కార్లను కొంటుంటారు. కానీ అందరూ ఎక్కే బస్సులు, ముఖ్యంగా స్కూల్ బస్సుల విషయానికి వస్తే మాత్రం ఒకే రంగు కనిపిస్తుంది. స్కూల్ బస్సులు ఎప్పుడూ పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? దీనికి అసలు కారణాలేంటో తెలుసా..?
స్కూల్ బస్సుకు పసుపు రంగు
1930వ సంవత్సరంలో అమెరికాలో మొదటిసారిగా స్కూల్ బస్సులకు పసుపు రంగు వేయడం మొదలుపెట్టారు. కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రాంక్ సిర్ అనే ఆయన, స్కూల్ పిల్లల రవాణాపై ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. అందులో స్కూల్ అధికారులతో పాటు బస్సులు తయారుచేసే కంపెనీల వాళ్లు కూడా పాల్గొన్నారు.
ఆ మీటింగ్‌లో ప్రొఫెసర్ ఫ్రాంక్ గోడ మీద రకరకాల రంగులను ఉంచి, అందరినీ ఒక రంగును ఎంచుకోమన్నారు. అక్కడ ఉన్నవారంతా కలిసి పసుపు, నారింజ రంగులను ఇష్టపడ్డారు. చివరకు ఎక్కువ మంది ఓట్లతో పసుపు రంగును ఫైనల్ చేశారు. అప్పటినుంచి స్కూల్ బస్సులంటే పసుపు రంగులోనే ఉండటం అలవాటైపోయింది.
దీని వెనుక ఉన్న సైన్స్
సైన్స్ ప్రకారం.. మనుషుల కంటికి పసుపు రంగు చాలా త్వరగా, స్పష్టంగా కనిపిస్తుంది. పగటిపూట మాత్రమే కాదు... వర్షం పడుతున్నప్పుడు, దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు లేదా ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు కూడా పసుపు రంగు దూరం నుంచే కనిపిస్తుంది. దీనివల్ల రోడ్డు మీద వెళ్లే ఇతర వాహనాల డ్రైవర్లకు స్కూల్ బస్సు వస్తోందని సులభంగా తెలిసిపోతుంది. ఇది పిల్లల ప్రాణాలకు రక్షణ ఇస్తుంది.
ఎరుపు రంగును ఎందుకు
నార్మల్‌గా ఎరుపు (రెడ్) రంగు కూడా బాగానే కనిపిస్తుంది కదా, మరి దాన్ని ఎందుకు పెట్టలేదు ? అనే డౌట్ రావచ్చు. నిజానికి ఎరుపు రంగును ఇప్పటికే ప్రమాదాలకు (డేంజర్ సైన్స్), బ్రేక్ లైట్లకు, సిగ్నల్స్ దగ్గర స్టాప్ గుర్తులకు వాడుతున్నారు. స్కూల్ బస్సుకు కూడా ఎరుపు రంగు వేస్తే రోడ్డు మీద వెళ్లే డ్రైవర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది.
అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్‌తో సంబంధం లేకుండా ఉండేలా పసుపు రంగును ఎంచుకున్నారు. రోడ్డుపై పసుపు బస్సు కనిపిస్తే... "జాగ్రత్త, ఇందులో స్కూల్ పిల్లలు ఉన్నారు" అని డ్రైవర్లను హెచ్చరించినట్లు అవుతుంది. దీనివల్ల ప్రమాదాలు జరగకుండా ఆపవచ్చు.
