Virat Kohli: భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు విరాట్ కోహ్లీ సరికొత్త ప్రమాణాలు నిర్దేశించాడనేది జగమెరిగిన సత్యం.. కఠినమైన ఆహార నియమాలు, గంటల కొద్దీ జిమ్‌లో వర్కౌట్లు చేయడంతో కోహ్లీ అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. ఇటీవల జియోస్టార్ బిలీవ్ (Believe) షోలో పాల్గొన్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, కోహ్లీ ఫిట్‌నెస్ క్రమశిక్షణపై ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. భారత క్యాంప్ సమయంలో విరాట్ తో కలిసి జిమ్‌లో ఉన్నప్పుడు, తన కెరీర్ ఎదుగుదలకు ఎలాంటి సలహాలు పాటించాలనే దాని గురించి కింగ్ కోహ్లీని అడిగినట్లు శాంసన్ గుర్తు చేసుకున్నాడు. జిమ్‌లో విరాట్ కష్టపడే విధానం, అతనిలోని ఆ అంకితభావం ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చాడు.
కోహ్లీ లైఫ్‌స్టైల్ సలహా.. ఏడాదిన్నరకే వదిలేసిన సంజు:
అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం రాణించాలంటే ఆట తీరుతో పాటు లైఫ్‌స్టైల్ కూడా అంతే ముఖ్యాంశమని విరాట్ కోహ్లీ తనకు చెప్పినట్లు సంజు శాంసన్ తెలిపాడు. శరీరం త్వరగా కోలుకోవడానికి ఏ ఆహారం సహాయపడుతుందో, దేనికి దూరంగా ఉండాలో విరాట్ తనకు స్పష్టంగా వివరించాడని చెప్పుకొచ్చాడు. ఈ కఠినమైన క్రమశిక్షణను రాబోయే 10 ఏళ్ల పాటు పాటిస్తే నీకు అద్భుతమైన కెరీర్ ఉంటుందని కింగ్ కోహ్లీ సూచించాడని పేర్కొన్నాడు. కోహ్లీ చెప్పిన డైట్, లైఫ్‌స్టైల్‌ను తాను దాదాపు ఏడాదిన్నర పాటు పాటించానని, కానీ ఆ తర్వాత ఆ కఠినమైన నియమాలను కొనసాగించలేకపోయానని సంజు ఒప్పుకున్నాడు.
ALSO READ : 2027 వరల్డ్‌కప్ ఆడాలంటే పరుగులు చేయాల్సిందే
నా శైలిలోనే క్రికెట్ ఆడుతా:
టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇషాన్ కిషన్ ప్రధాన వికెట్ కీపర్‌గా ఉండటం, తన స్థానంపై అనిశ్చితి నెలకొనడం లాంటి పరిణామాలపై సంజు శాంసన్ స్పందించాడు. జట్టులో స్థానం కోసం నిరంతరం సాగే పోటీ (Rat race) గురించి ఆలోచించడం మానివేసి, ఒత్తిడి లేకుండా ఆటను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. 2028 టీ20 ప్రపంచకప్‌లో ఆడతానో లేదో అని ఆలోచించి అనవసరంగా ఒత్తిడి పెంచుకోనని, మైదానంలో తనదైన స్టైల్ లోనే ఆడుతూ ముందుకు సాగుతానని తేల్చి చెప్పాడు. ఇప్పటి వరకు తన క్రికెట్ ప్రయాణంలో సాధించిన ప్రదర్శనల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని సంజు శాంసన్ వెల్లడించాడు.
