ప్రధానిని కాపాడేందుకు..ప్రధాన్ ను తొలగించారు: అఖిలేష్ యాదవ్ సెటైర్లు

ప్రధానిని కాపాడేందుకు..ప్రధాన్ ను తొలగించారు: అఖిలేష్ యాదవ్ సెటైర్లు

కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ప్రధాన్‌ను తొలగించడం ద్వారా ఈ ప్రభుత్వం ప్రధానమంత్రిని కాపాడుకుంది అని అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు.

యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థుల నిరసనలు, జెన్ జీ ఉద్యమమే మోదీ సర్కార్ మెడలు వంచిందని, ప్రజా ఒత్తిడికి తలొగ్గే ప్రధాన్ చేత రాజీనామా చేయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. మోదీకి అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. 

దేశంలో నీట్ పరీక్షల నుంచి సైనిక రిక్రూట్‌మెంట్ వరకు అన్ని పరీక్షలూ లీకవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జామ్ పేపర్లు, విరాళాల చోరీలు కామన్‌గా మారాయని, యాంటీ పేపర్ లీక్ బిల్లు పేరుతో ప్రభుత్వం మరోసారి డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.

►ALSO READ | పాకిస్తాన్ తో యుద్ధం గెలిచి వచ్చారా?.. ప్రధాన్ కు సన్మానం ఎందుకు? : కేంద్రంపై గౌరవ్ గొగోయ్ సెటైర్లు

విద్యార్థులు రోడ్డెక్కి పోరాటం చేసేవరకు విద్యామంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అవినీతి ఆరోపణలతో రాజీనామా చేసిన వ్యక్తికి పార్లమెంట్‌లో ఘనస్వాగతం పలకడం సిగ్గుచేటన్నారు. మోదీ పాలనలో దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, అగ్నీవీర్ నియామకాల నుంచి యువతకు అందే ఉపాధి వరకు కేంద్రం చెబుతున్నవన్నీ అబద్ధాలేనని అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.