ప్రస్తుత వ్యవస్థతో యువతకు మోసం.. ఈ పేపర్ లీకులు, భారీ ఫీజులతో యువత భవిత ప్రశ్నార్థకం: రాహుల్

ప్రస్తుత వ్యవస్థతో యువతకు మోసం.. ఈ పేపర్ లీకులు, భారీ ఫీజులతో యువత భవిత ప్రశ్నార్థకం: రాహుల్

న్యూఢిల్లీ: దేశంలోని విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఉన్నత స్థాయికి ఎదగాల్సిన యువతను ప్రస్తుత వ్యవస్థే ఫెయిల్ చేస్తోందని విమర్శించారు. పేపర్ లీకులు, భారీ ఫీజులు, శిథిలమవుతున్న మౌలిక వసతులతో యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ‘ఎక్స్‌‌’ వేదికగా విద్యా వ్యవస్థపై విమర్శలు చేశారు. లక్షలాది మంది యువతీ యువకులు కష్టపడి చదువుతున్నప్పటికీ.. ప్రస్తుత వ్యవస్థ వారిని నిరాశకు గురిచేస్తోందన్నారు.

“స్టూడెంట్స్, పేరెంట్స్‌‌, టీచర్లు.. విద్యా వ్యవస్థపై మీకు ఎందుకు ఆశలు పోయాయి?” అని ప్రశ్నించారు. విద్యా రంగంలో సమస్యలు, అనుభవాలు, ఆధారాలను ఆన్‌‌లైన్‌‌ లింక్‌‌ ద్వారా పంచుకోవాలని కోరారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలంటే బాధితుల గొంతు వినాలన్నారు. కాగా, మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌‌లో 19న ‘ఛత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం ఐదో విడత నిర్వహించనున్నారు.