హైదరాబాద్ నగర సమస్యలకు పరిష్కారంగా చూపెడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ ముసుగు తొలగిస్తే ఒక ఖరీదైన రియల్ ఎస్టేట్ వెంచర్. దీని భౌగోళిక స్వరూపం అస్పష్టంగా, చట్టపరమైన పునాదులు పెళుసుగా ఉన్నాయి, అంతిమంగా చట్టం తన తీర్పును ఇవ్వబోతోంది. 2026 జూన్ 10న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సిడిఎ) ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి, హైదరాబాద్‌కు దక్షిణంగా శ్రీశైలం, నాగార్జున మధ్య ఉన్న 30,000 ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని ప్రకటించారు.
ఈ ప్రాజెక్టును ఒక భావోద్వేగ నిర్ణయంగా, ఆధునిక, సువ్యవస్థిత పట్టణ కేంద్రం కోసం ప్రతి భారతీయుడి ఆకాంక్షకు సమాధానంగా ప్రకటించారు. దీనికి అంతే సూటిగా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనం భావిస్తున్న ఈ భవిష్యత్తు నగరానికి ఆత్మ లేదు. ఆత్మ లేకపోతే, దానికి జీవం ఉండదు.
ఫ్యూచర్ సిటీ ఆలోచనకు నాలుగు మేధోపరమైన మూలాలు ఉన్నాయి. భూమి, రియల్ ఎస్టేట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత వృత్తి అనుభవం, గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ నమూనా, మాదాపూర్‌లోని హై-టెక్ సిటీ, హైదరాబాద్ ఫార్మా సిటీ దీనిలో దాదాపు 70 శాతం చివరికి పారిశ్రామికేతర ప్రయోజనాల కోసం కేటాయించారు. వీటిలో ఏదీ ఒక కొత్త నగారాభివృద్ధికి సరైన బాట కాదు. గిఫ్ట్ సిటీ నుంచి నేర్చుకోగలిగింది పరిమితమే. దాని వెనుక ఒక ప్రత్యేక ఆర్థికసేవల నియంత్రణ సంస్థ, గుజరాత్ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ ఉన్నాయి. హై-టెక్ సిటీ ఏర్పాటులో అనేక లోటుపాట్లు ఉన్నా అప్పటి సందర్భం వేరు.
సాఫ్ట్వేర్ అవుట్‌సోర్సింగ్ పెరుగుతున్న దశలో ఇది రావడం ఉపయోగపడింది. తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఫార్మా సిటీ పూర్తిగా ఫార్మా కంపెనీల సిటీ కాదని అనేకసార్లు చెప్పింది. హైదరాబాద్ నగర సమస్యలకు పరిష్కారంగా వేరే సిటీ నిర్మాణం అని ప్రకటించినా ఫ్యూచర్ సిటీ తీరుతెన్ను ఆ సమస్యల దరిదాపులలో కూడా లేదు.
- ఫ్యూచర్ సిటీ ఒక ఫక్తు వ్యాపార ప్రాజెక్టు
ఇది కంపెనీలకు నగరంగా పదేపదే ప్రకటిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ రూపకల్పనలో అనేక వాస్తవాలు, అనుభవాల లేమి స్పష్టంగా కనపడుతున్నది. ఫ్యూచర్ సిటీ ఒక ఫక్తు భూపందేరానికి ఉద్దేశించిన వ్యాపార ప్రాజెక్టు. ప్రభుత్వ ప్రకటనలలో ఇది స్పష్టంగా ఉన్నది. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడ ఆఫీసులు పెట్టుకుని వారి వ్యాపారం చేసుకుంటాయి తప్పితే వారి వ్యాపారం వల్ల ఒక నగరం నిర్మాణం అవుతుంది అనుకోవడం ఒక భ్రమ. స్థానిక చిన్న, సన్నకారు కంపెనీలకు ఇక్కడ స్థానం లేదు అని చెప్పకనే చెబుతున్నది ప్రభుత్వం.
ఎక్కడినుంచో పెట్టుబడిదారులు కోట్లు తీసుకొస్తారని ఇక్కడి భూమిని ముస్తాబు చేయడం వ్యాపారమే. భవిష్యత్ నగర నిర్మాణం కాదు. నగరంలో ప్రజలు ఉంటారు.. కంపెనీలు కాదు. హైదరాబాద్ సహా ప్రతి నగరానికి ఒక ఆత్మ ఉంటుంది. ఒక ఉనికి ఉంటుంది. ఒక ఐడెంటిటీ ఉంటుంది. ప్రభుత్వం స్వతహాగా ప్రకటిస్తున్నట్టు ఫ్యూచర్ సిటీకి ఉన్న ఆత్మ కంపెనీలే.
కంపెనీలు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి. యుద్ధ పరిణామాలు, ప్రపంచ ద్రవ్యోల్బణం నేపథ్యంలో విదేశీ మదుపుదారులు వలస బాట బట్టిన పరిస్థితులలో, పెట్టుబడులు ఎండమావులుగా మారిన సందర్భంలో కంపెనీలు వస్తాయా అనేది కూడా అనుమానమే. ఈ ప్రాజెక్ట్ భౌగోళిక స్వరూపమే అస్పష్టంగా ఉంది. ఎఫ్‌సిడిఎ అధికార పరిధి 765 చదరపు కిలోమీటర్లు. అంటే సుమారు 1.89 లక్షల ఎకరాలు విస్తరించి ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న జిహెచ్‌ఎంసి నగరం కంటే పెద్ద ప్రాంతం. ఈ ప్రాజెక్ట్‌ను 30,000 ఎకరాల నగరంగా ప్రచారం చేస్తున్నారు. మిగిలిన 1.6 లక్షల ఎకరాల భూ వినియోగ స్థితి ఏమిటి?
- 'గ్రీన్ ఫింగర్స్' పర్యావరణ పర్యాటక ప్రాంతం
ఎఫ్‌సిడిఎ జోన్‌లోని 15,000 ఎకరాలలో ఇప్పటికే అటవీ భూమి ఉన్నది. దీనిని 'గ్రీన్ ఫింగర్స్' పర్యావరణ పర్యాటక ప్రాంతంగా పునఃనామకరణం చేశారు. రిజర్వ్ అడవులు 1980 అటవీ సంరక్షణ చట్టం, 1927 భారత అటవీ చట్టం ప్రకారం రక్షితంగా ఉంటాయి. ఈ అడవులను అటవీయేతర ప్రయోజనాల కోసం మళ్లించాలంటే కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం. ఒక నెట్ జీరో నగరం, ఉన్న రిజర్వ్ అడవులను తన పర్యావరణ అర్హతలుగా పరిగణిస్తూనే, అదే సమయంలో దానిని అభివృద్ధి చేయదగిన భూమిగా చూడకూడదు. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ డిసెంబర్ 2026 వరకు ఖరారు కాదు.
ఒక స్థిరమైన భూవినియోగ ప్రణాళిక తయారుకాకముందే అనుమతులు జారీ అవుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ కంపెనీల కోసం రూపొందించింది. స్థానిక ప్రజలు లేకుండా కంపెనీలు నగరాలను నిర్మించవు. భారతదేశంలో ఒక నగరాన్ని నిర్మించడం అంటే కేవలం రాజకీయ సంకల్పం సరిపోదు. రాజ్యాంగం నిర్వచించిన చట్టాలు కూడా అనుమతించాలి.
- పర్యావరణ అనుమతిని పొందాలి
ఎఫ్‌సీడీఏ తప్పనిసరిగా ఈఐఏ నోటిఫికేషన్, 2006 ప్రకారం పర్యావరణ అనుమతిని పొందాలి. ఈ అనుమతి ప్రక్రియలో సవివరమైన పర్యావరణ ప్రభావ అధ్యయనం (ఈఐఏ), నిర్వాసిత ప్రజల అభ్యంతరాలు నమోదు చేసుకోగల ప్రజాభిప్రాయ సేకరణ, రాష్ట్ర నిపుణుల కమిటీ ద్వారా మూల్యాంకనం ఉంటాయి. ఈ అనుమతి మంజూరయ్యేవరకు చట్టబద్ధంగా ఎలాంటి నిర్మాణం చేయకూడదు. భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో 2013 చట్టం ప్రకారం ఒక్క ఎకరం భూమిని తీసుకునే ముందు సామాజిక ప్రభావ అంచనా (ఎస్ఐఏ), కనీసం 70 శాతం ప్రభావిత కుటుంబాల సమ్మతి, విశ్వసనీయమైన పునరావాస ప్రణాళికలు తప్పనిసరి. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక ఎస్ఐఏ, ఈఐఏ లేదు. పునరావాస ప్రణాళిక లేదు. ఒడిశాలోని పోస్కో స్టీల్ ప్రాజెక్ట్.. సంవత్సరాల ప్రతిఘటన, వ్యాజ్యాలు, ఎన్జీటీ జోక్యం తర్వాత పరిష్కారం కాని ఈ చట్టపరమైన బాధ్యతల చిక్కుముడిని ఉటంకిస్తూ కంపెనీ వైదొలగడంతో పూర్తిగా కుప్పకూలింది. ఇది భవిష్యత్తుకు అద్దంపడుతుంది.
ఫార్చ్యూన్ 500 కంపెనీలకు మాత్రమే ఫ్యూచర్ సిటీ
కాలుష్య చట్టాలు కూడా ఉన్నాయి. ఫార్మాస్యూటికల్ తయారీ, డేటా సెంటర్లు, టెక్స్టైల్ క్లస్టర్లు.. ఫ్యూచర్ సిటీకి ప్రతిపాదిత ప్రధాన ఆకర్షణలైన వీటన్నింటికీ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నుంచి
స్థాపనకు అనుమతి, నిర్వహణకు అనుమతి అవసరం. ప్రతి యూనిట్ వీటిని విడివిడిగా పొందాలి. ఫ్యూచర్ సిటీలో పారిశ్రామిక వ్యర్థ జలాలకు భారీ సామర్థ్యం గల ఉమ్మడి వ్యర్థజల శుద్ధి కర్మాగారాలు అవసరం. ఎకరాకు రూ. 300 కోట్ల విలువైన భూమిలో, ఈటీపీలు, సబ్-స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, మురుగునీటి వ్యవస్థల కోసం స్థలాన్ని,
మూలధనాన్ని కేటాయించే ప్రణాళికలు పూర్తిగా పొంతన లేకుండా ఉన్నాయి. కంపెనీలు తెచ్చే కాలుష్యం గురించి ఫ్యూచర్ సిటీ ప్రణాళికలలో కనీస ప్రస్తావన లేదు. ఫ్యూచర్ సిటీలో రాబోయే జోనల్ ప్లాన్‌లు బడా కంపెనీలకు అనుగుణంగా తయారుచేస్తారు. ఖరీదైన ఈ భూమిలో సామాన్యులు, స్థానిక చిన్న, సన్నకారు సంస్థలకు స్థానం లేదు. ఫార్చ్యూన్ 500
కంపెనీలకు మాత్రమే ఫ్యూచర్ సిటీ అని పదేపదే ప్రకటనలు పరిశీలిస్తే దాని వెనుక ఉద్దేశ్యం అర్థం అవుతుంది.
మంచి బ్రాండింగ్ ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా...
నేటి పెద్ద టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ కంపెనీలు మూలధనం తక్కువగా, ఏఐ ఎక్కువగా కలిగి ఉండి, ఉద్యోగుల సంఖ్యను వేగంగా తగ్గిస్తున్నాయి. ఈ కంపెనీలు తమ కార్మికుల కోసం నివాస కాలనీలను నిర్మించవు. అవి దీర్ఘకాలిక ఉద్యోగ హామీని ఇవ్వవు. ఒక నిజమైన భవిష్యత్ నగరం సామాజిక ప్రభావ అంచనా, పునరావాస ప్రణాళికతో ప్రారంభమవుతుంది. ఆ ప్రణాళిక మౌలిక సదుపాయాలను -ఈటీపీలు, సబ్-స్టేషన్లు, గృహాలను ప్రారంభం నుంచే - భూమి ధరల నమూనాలో ఏకీకృతం చేస్తుంది. వాటిని అప్రధాన సమస్యలుగా తరువాత ఎప్పుడో చూడాల్సిన అవసరాలుగా పరిగణించదు. పైన పేర్కొన్న సవాళ్ళకు, ప్రశ్నలకు నిజాయితీగా, పారదర్శక సమాధానాలు లభించేవరకు, భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణాకు, తెలంగాణ వాదానికి, తెలంగాణ మూలవాసులకు భవిష్యత్తు లేదు. ప్రభుత్వ మద్దతుతో, పెట్టుబడిదారులకు మార్కెటింగ్ చేసి,
దాని అభివృద్ధిలో భాగస్వామ్యం లేని ప్రజల జీవనోపాధులపై నిర్మించిన మంచి బ్రాండింగ్ ఉన్న ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఫ్యూచర్ సిటీ.
- డా. దొంతి నరసింహారెడ్డి
పాలసీ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
